కొత్త వ్యవసాయ చట్టాలు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు..

కొత్త వ్యవసాయ చట్టాలు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు..

రైతులకు దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు కలుగుతాయంటూ కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకుంది ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్... అయితే, కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.. వ్యవసాయ సంస్కరణ చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజే బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.. చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, వాటిని అమలు కాకుండా చూడాలంటూ సుప్రీం కోర్టు న్యాయవాది మనోహర్‌శర్మ, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఛత్తీస్‌గఢ్‌ కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.. అయితే, పిటిషన్‌లో సరైన కారణాలు చూపలేదంటూ మనోహర్‌ శర్మ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించింది.

ఇక, కొత్త చట్టాలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వం కేంద్రం నిత్యావసర సరుకుల సవరణ బిల్లు, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్, ఫెసిలియేషన్ బిల్లు, ఫార్మర్స్ ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్షన్, అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ బిల్లులను.. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేంచినా లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదింపజేసింది.. అనంతరం ఆ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కొత్త బిల్లుపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళను కొనసాగిస్తున్నారు.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో అయితే.. కొత్త బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.