రాజకీయ ఎత్తుల్లో 'ఫాల్కే' ఓ తాయత్తేనా!?

రాజకీయ ఎత్తుల్లో 'ఫాల్కే' ఓ తాయత్తేనా!?

ఆల్ ఫూల్స్ డే అయిన ఏప్రిల్ 1న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్రం 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు ప్రకటించడంపై సోషల్ మీడియాలో పలు వ్యంగ్యం చోటు చేసుకుంది. నిజానికి రజనీకాంత్ అన్ని విధాలా ఆ అవార్డుకు అర్హుడే! అందులో సందేహం లేదు. కానీ,  తమిళనాడులో ఎన్నికలు జరగనున్న సమయంలో రజనీకి ఈ అవార్డు ప్రకటించడంపైనే విమర్శలు సాగుతున్నాయి. మొన్న 'నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్' ప్రకటించిన జాబితాలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ కు 'అసురన్' చిత్రం ద్వారా   ఉత్తమనటుడు విభాగంలో అవార్డు లభించింది. ధనుష్ తో పాటు 'భోస్లే' హిందీ చిత్రంలో నటించిన మనోజ్ బాజ్ పాయ్ కూడా ఉత్తమ నటునిగా ఎంపికయ్యాడు. ఇలా ఒకే అవార్డుకు ఇద్దరిని ప్రకటించడం కొత్తేమీ కాదు.  2010 లో ధనుష్‌  తొలిసారి తన 'ఆడుకాలం' ద్వారా జాతీయ స్థాయిలో  ఉత్తమనటునిగా ఎంపికయ్యాడు. ఆ సమయంలోనూ 'అడమింటే మకన్ అబు' మళయాళ సినిమా ద్వారా సలీమ్ కుమార్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడు. అంటే దనుష్‌ బెస్ట్ యాక్టర్ అవార్డుకు ఎంపికైన ప్రతీసారి మరో నటుడు కూడా ఆ అవార్డుకు ఎన్నికయ్యాడన్న మాట! అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ కూటమి, ఇప్పుడు బీజేపీ కూటమి అధికారంలో ఉన్నాయి. ఇక బీజేపీకి జైకొట్టే కంగనా రనౌత్ కు ఇప్పటికే మూడుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించడం పట్ల కూడా జనం నొసలు చిట్లిస్తున్నారు. 

ఎప్పుడూ రాజకీయాలే...
ఈ సారి ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లోనే మోహన్ లాల్ నటించిన 'మరక్కర్'ను జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడాన్నీ జనం రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. కేరళలోనూ ప్రస్తుతం ఎన్నికల వేడి రాజుకున్న విషయం విదితమే. ఎన్నికల సమయాల్లో ప్రతిభావంతులకు ప్రతిష్ఠాత్మక అవార్డులు ప్రకటించినప్పుడు వారిపై రాజకీయ నీడలు ప్రసరించడం కొత్తేమీ కాదు.  2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో, దేశవ్యాప్తంగా ఎంతో ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు దేశంలోనే అత్యున్నతమైన 'భారతరత్న' అవార్డును ప్రకటించారు. ఆ సమయంలోనే కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడో ఓ చోట వ్యతిరేకత వచ్చినా, సచిన్ కు భారతరత్న అవార్డు ఇవ్వడం వల్ల అది భర్తీ అవుతుందని అప్పటి కాంగ్రెస్ పార్టీ భావించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఫలితం ఏంటో మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా దేశంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సామ్, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు  కొన్ని చోట్ల ఉపఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది. అందువల్లనే ఇప్పుడు ప్రకటితమైన సినిమా అవార్డులు నూటికి నూరుపాళ్లు  రాజకీయ తాయెత్తులే అని విమర్శకుల మాట!

ఆలోచిస్తే... ఎన్నో... 
నిజానికి ఒకప్పుడు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు అన్నీ నిజాయితీగానే ప్రకటిస్తారనే మాట వినిపించేది. అయితే 1980లో ఇందిరాగాంధీ మళ్ళీ  అధికారంలోకి వచ్చిన తరువాత నుంచే ప్రతిష్ఠాత్మక అవార్డుల విషయంలోనూ రాజకీయాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. 1977 పార్లమెంట్ ఎన్నికల్లోనూ, తరువాత 1978 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా నిలచింది. ఆ తరువాత 1983లో ఆ పార్టీ నుండి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు ఆ నాటి తెలుగు సినిమా సూపర్ స్టార్ యన్టీఆర్. ఆయన లాగే కన్నడ నాట మంచి ఫాలోయింగ్ ఉన్న రాజ్ కుమార్ కూడా ఎక్కడ రాజకీయాల్లోకి వస్తాడోనన్న యోచనతో, ఆయనను మంచిచేసుకోవడానికి అన్నట్టు 1983లో రాజ్ కుమార్ కు నేరుగా 'పద్మభూషణ్' పురస్కారం అందించారు. ఆ సమయంలోనూ పలు విమర్శలు వినిపించాయి. నిజానికి రాజ్ కుమార్ ఎంతో ప్రతిభావంతుడు. అయితే తమ రాజకీయ లబ్ధికోసం ప్రతిభావంతులకు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అవార్డులకు ఎంపిక చేయడమే విచారకరమని పలువురి అభిప్రాయం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ ఈ విషయంలో ఒకే తీరున ప్రవర్తిస్తాయనడంలో సందేహం లేదు. 

ఏమిటి లాభం?
మరో ముఖ్య విషయం, తమకు మద్దతు పలకనివారికి, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి ఏ లాంటి అవార్డులకూ ఎంపిక చేయక పోవడం కూడా రాజకీయ కోణంలోని భాగమే! 1968లో 'పద్మశ్రీ' పురస్కారం అందుకున్న యన్టీఆర్ కు, ఆ తరువాత మరే ప్రతిష్ఠాత్మక అవార్డు లబించలేదు. ఇక 1982 నుండీ ఆయన రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి, రామారావుకు ప్రతిష్ఠాత్మక అవార్డులు ఎందుకు రాలేదో అర్థం చేసుకోవచ్చు.  మరో నటుడు ఎమ్జీఆర్ కు 'పద్మ' అవార్డు రాలేదు. అయితే 1971లో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్టు అప్పటి కేంద్రప్రభుత్వం 'రిచ్చా కారన్' సినిమాలో ఎమ్జీఆర్ నటనకు ఏకంగా జాతీయ ఉత్తమనటుని అవార్డు ప్రదానం చేసింది. ఆ సినిమా చూస్తే, అసలు ఎమ్జీఆర్ కు 'భరత్' అవార్డు ఎలా వచ్చిందా అనిపించక మానదు. అలాగే ఎమ్జీఆర్ కన్నుమూశాక  1988లో ఆయనకు 'భారతరత్న' ప్రకటించారు. అదీ రాజకీయ కోణమే అని వేరే చెప్పక్కర్లేదు. ఇలా ఎలా చూసినా, ప్రతిష్ఠాత్మక అవార్డుల విషయంలో రాజకీయనీడలే కనిపిస్తున్నాయి. ఎటూ, సినిమా స్టార్స్ కు వేరే హీరోల అభిమానుల దాడి ఉండనే ఉంటుంది. వారి ప్రతిభకు తగ్గ అవార్డులే లభించినా, ప్రత్యర్థి వర్గాలు మాత్రం అవి రాజకీయ కోణంలో వచ్చినవనే చాటింపు వేస్తాయే తప్ప, నిజంగా వారి ప్రతిభను గౌరవించరు. ప్రస్తుతం తమిళనాడులో కమల్ హాసన్ తన 'మక్కల్ నీతిమయం' పార్టీ తరపున రాజకీయబరిలో ఉన్నారు. ఆయన పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో కానీ, కమల్ ఫ్యాన్స్ మాత్రం రజనీకి ఈ సమయంలో 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు ప్రకటించడాన్ని 'రాజకీయ తాయెత్తు'గానే భావిస్తున్నారు. కామెడీ చేస్తున్నారు.