ఐపీఎల్‌లో మరో కీలక మ్యాచ్‌.. ప్లే ఆఫ్‌ నాలుగో బెర్త్‌ ఎవరిదో..?

ఐపీఎల్‌లో మరో కీలక మ్యాచ్‌.. ప్లే ఆఫ్‌ నాలుగో బెర్త్‌ ఎవరిదో..?

ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు... ప్లే ఆఫ్‌కు చేరాయి. నిన్న బెంగళూరుపై గెలిచి... ఎట్టకేలకు ఢిల్లీ కేపిటల్స్‌ ప్లే ఆఫ్‌ బెర్త్‌ సాధించింది.  ఇక ఢిల్లీ చేతిలో బెంగళూరు ఓడినా... మెరుగైన రన్‌రేట్‌తో ఆ టీమ్‌ కూడా ప్లే ఆఫ్‌కు చేరింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు... 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 152 పరుగులు చేసింది. పడిక్కల్‌ హాఫ్‌ సెంచరీ చేయగా... డివిలీర్స్‌ 35, కోహ్లీ 29 రన్స్‌ చేశారు. వీళ్లు మినహా ఎవరూ పెద్దగా స్కోర్‌ చేయకపోవడంతో... 152 పరుగులే చేయగలిగింది... బెంగళూరు.

ఛేజింగ్‌లో ఢిల్లీ రెండో ఓవర్లోనే పృథ్వీ షా వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ధావన్‌, రహానే రెండో వికెట్‌కు ఏకంగా 88 రన్స్‌ జోడించారు. ఇద్దరూ హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో... ఢిల్లీ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. చివర్లో స్టయినిస్‌, పంత్‌... జట్టును గెలిపించారు. ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఐపీఎల్‌ లో రెండోస్థానంలో నిలిచిన ఢిల్లీ... ఎల్లుండి ముంబైతో తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇక ఇవాళ ముంబై-హైదరాబాద్ మధ్య జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న దానిపైనే... ఏ టీమ్‌కు ప్లే ఆఫ్‌ నాలుగో బెర్త్‌ దక్కుతుందనేది ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ గెలిస్తే... బెంగళూరుతో శుక్రవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడుతుంది. ఒకవేళ ముంబై చేతిలో హైదరాబాద్‌ ఓడితే... కోల్‌కతా, బెంగళూరు మధ్య ఎలిమినేషన్‌ మ్యాచ్‌ జరుగుతుంది.