మా నాన్న మృతికి కారణం ఇదే... సున్నం రాజయ్య కుమారుడు
సీపీఎం సీనియర్ నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనావైరస్ బారినపడి కన్నుమూశారు.. కోవిడ్ రూల్స్‌కు అనుగుణంగా ఆయనకు వీడ్కోలు పలికాయి పార్టీ శ్రేణులు.. అయితే.. తాజాగా సున్నం రాజయ్య కుమారుడు ఓ ఆడియో విడుదల చేయడం చర్చగా మారిపోయింది.. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా బతికిన రాజయ్య... ఆయన కుమారుడికి సీతారామరాజు అనే పేరు పెట్టుకున్నారు.. తన నాన్న మృతిపై తాజాగా ఓ ఆడియో విడుదల చేశాడు సున్నం సీతారామరాజు.. మా నాన్న చనిపోయింది కరోనాతోనే.. కానీ, చంపింది మాత్రం కరోనా కాదు అని పేర్కొన్నాడు సీతారామరాజు.
కరోనావైరస్ సోకిన సున్నం రాజయ్య కుటుంబం పట్ల గ్రామంలో వివక్షత చూపారని ఆరోపించారు సీతారామరాజు.. మొదట మా అక్కకి కరోనా పాజిటివ్‌గా తేలింది.. రోజూ బయటకు వెళ్లే మా నాన్నను గ్రామస్తులు అదోలా చూడడం.. తలుపులు వేయడం ఆయన జీర్ణించుకోలేకపోయారు.. దీంతో, మా నాన్న మానసికంగా కృంగిపోయారని పేర్కొన్నారు. ఇక, ఆ తర్వాత ఆయనకు కూడా పాజిటివ్‌గా తేలడంతో.. నా ఫ్యామిలీలో వస్తేనే ఇలా చూస్తున్నారు.. ఇప్పుడు ఏంటి ? అనే ఆందోళన ఆయనలో మొదలైందని తెలిపాడు. ఎన్నో వ్యాధులను ఎన్నో ప్రమాదాలను చవిచూసిన రాజయ్యకు.. కరోనా పెద్ద సమస్య కాదు.. కానీ, ఎప్పుడూ ప్రజల కోసం పరితపించే మా తండ్రి రాజయ్యను.. ప్రజలు దూరంగా ఉంచడాన్ని జీర్ణించుకోలేకపోయారు... మానసికంగా కృంగి చనిపోయారని తెలిపారు. ప్రజలు సాధారణంగా ఆయనను పలకరించి.. ధైర్యం చెబితే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రభుత్వం కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం కూడా.. దీని కారణంగా చెప్పుకొచ్చాడు సీతారామరాజు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)