ఈ సారైనా సందీప్ పాసవుతాడా?

ఈ సారైనా సందీప్ పాసవుతాడా?

ప్రస్థానం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. ఆ తర్వాత ఇప్పటి వరకూ మళ్ళీ ఆ స్థాయి విజయం దక్కలేదనే చెప్పాలి. మధ్యలో టైగర్, ‘నిను వీడని నీడను నేనే’ లాంటి యావరేజ్ సినిమాలు వచ్చినా హిట్ అనే మాట వినలేకపోయాడు. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా సందీప్ ని సినిమాలు పలకరిస్తూనే వస్తున్నాయి. ఇప్పుడు అతని ముందు కఠిన పరీక్ష ఉంది. ఈసారి హిట్ పడకుంటే కెరీర్ కష్టాల్లో పడటం ఖాయం. 

సందీప్ నటించిన తాజా చిత్రం ఎ1 ఎక్స్‌ప్రెస్. ఈ సినిమా మార్చి 5న విడుదల కానుంది. ఈ సినిమాపై సందీప్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. హాకీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ట్రైలర్ తో ఆకట్టుకుంది. అయితే విడులయ్యే తొలి రోజున సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావాలి. ఇటీవల కాలంలో సందీప్ ట్రాక్ రికార్డ్ అంత పాజిటీవ్ గా లేకపోవడం మైనస్ పాయింట్. లావణ్య త్రిపాఠి సందీప్‌కు జోడీగా నటించింది. సందీప్ మావయ్య ఛోటా కే నాయుడు ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి సంగీతం హిప్ హాప్. మరో వైపు సందీప్ నిర్మాతగాను మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 'వివాహభోజనంబు' పేరుతో సినిమా నిర్మిస్తున్నాడు సందీప్. మరి ఇటు నటుడుగా అటు నిర్మాతగా పాస్ మార్కులతో సరిపెడతాడా? లేక డిస్టింక్షన్ లో పాస్ అవుతాడా? అన్నది తేలాల్సి ఉంది.