నటుడిగా కోటి... బ్యాక్ టు బ్యాక్ మూవీస్!

నటుడిగా కోటి... బ్యాక్ టు బ్యాక్ మూవీస్!

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి... సైతం ఇప్పుడు నటుడిగా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. మొన్నటి వరకూ సంగీత దర్శకుడిగా తెర వెనుక పాత్ర పోషించి వీనుల విందు చేసిన కోటి... కొంత కాలంగా బుల్లితెర లో మ్యూజికల్ రియాలిటీ షోస్ కు జడ్జిగా వ్యవహరిస్తూ వీక్షకులకు కనువిందు చేస్తున్నారు. అంతే కాదు... కరోనా సమయంలో ఆయన సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవేర్ నెస్ మ్యూజిక్ వీడియోస్ లో కోటి నటించి, మెప్పించారు.

తాజాగా ఆయన వెండితెర నటుడిగానూ మారారు. ఫిబ్రవరి 26న విడుదల కాబోతున్న 'క్షణక్షణం' మూవీలో కోటి ఓ కీలక పాత్ర పోషించారు. ఉదయ్‌ శంకర్, జియాశర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందించడం మరో విశేషం. మరో ప్రధాన విషయం ఏమంటే... ఫిబ్రవరి మార్చి 5న విడుదల కాబోతున్న 'దేవినేని' చిత్రంలోనూ కోటి నటించారు. బెజవాడ రౌడీ రాజకీయాల నేపథ్యంలో శివనాగు తెరకెక్కించిన ఈ సినిమాలో ఒకప్పుడు బెజవాడ రౌడీలకు సింహస్వప్నంగా ఉన్న ఐపీఎస్ అధికారి వ్యాస్ పాత్రలో కోటి కనిపించబోతున్నారు. ఆ రకంగా ఆయన వెండితెరపైకి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో వస్తుండం విశేషం.