సిక్కోలులో హై టెన్షన్.. ఎస్పీ ఏమంటున్నారంటే ?

సిక్కోలులో హై టెన్షన్.. ఎస్పీ ఏమంటున్నారంటే ?

సైలెంట్ గా ఉండే శ్రీకాకుళం జిల్లాలో సైతం ఈ సారి ఎన్నికలు కాక రేపాయి. జిల్లాలో చాలా చోట్ల టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఒకటి రెండు ఘటనలు మినహా నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ తెలిపారు. రేగిడి మండలం కొండ వలస , రణస్థలం మండలం చిన్నపల్లిరాజాంలలో ఘర్షణలు జరిగాయని అన్నారు. చిన్నపల్లిరాజాంలో ఘర్షణలకు కారకులైన వారిలో 20 మందికి పైగా గుర్తించామని...మరికొందరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచేది ఒక్కరే అని తెలిసినప్పటికీ పోటీకి దిగిన వారు  ఒకరి పై ఒకరు దాడులకు పాల్పడుతున్నారని...ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో చోటుచేసుకుంటున్న ఈ గొడవల్లో యువత , విద్యార్ధులు కూడా పాల్గొంటున్నారని... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. చదువుకునే యువత ఇలాంటి గొడవల్లో పాల్గొంటే వారి భవిష్యత్తు పాడువుతందని గ్రహించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్న గ్రామాలు , సెన్సిటివ్ , హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల పై ప్రత్యేక నిఘా పెట్టి పోలీసు బందోబస్తు పెంచినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.