టీడీపీ నేతలను ఏకం చేసిన మంత్రి...?

టీడీపీ నేతలను ఏకం చేసిన మంత్రి...?

టీడీపీకి కంచుకోటగా భావించే శ్రీకాకుళంలో తమ్ముళ్ల మధ్య గ్రూప్‌ పాలిటిక్స్‌ ఓ రేంజ్‌లో సాగుతుంటాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కళా వెంకట్రావు వర్సెస్‌ అచ్చెన్నాయుడు అన్నట్టు పరిస్థితులు ఉండేవి. ఎవరి వర్గాలు వారివే.. కొందరు అటూ ఇటూ ఊగుతూ.. ఇద్దరి మధ్య నలుగుతూ మసులుకునేవారు. మొన్నటి ఎన్నికల్లో అధికారం దూరం కావడంతో గ్రూపు రాజకీయాల మాట దేవుడెరుగు.. కనీసం, నాయకత్వం వహించేవారే కనిపించలేదు. ఎవరిని కదిపినా మౌనమే సమాధానంగా ఉండేది. 

డిప్యూటీ సీఎం ధర్మాన కామెంట్‌ టీడీపీకి బలాన్నిచ్చిందా? 
మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కూన రవికుమార్‌లు అడపాదడపా రోడ్డెక్కి ఆందోళనలు చేసేవారు. గడిచిన ఏడాదిన్నరగా ఇదే తీరు ఉంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చేసిన ఒకే ఒక్క కామెంట్‌ నిస్తేజంగా పడిఉన్న సైకిల్‌కు బూస్టప్‌ ఇచ్చిందట. అమరావతి రైతుల ఆందోళనపై డిప్యూటీ సీఎం టంగ్‌ స్లిప్‌ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. టీడీపీ విరుచుకుపడింది. అదే సమయంలో డిప్యూటీ సీఎంపై  సిక్కోలు టీడీపీ నేతలు యుద్ధం ప్రకటించినంత పనిచేశారు. 

ఎన్నడూ లేని ఐక్యమత్యాన్ని ప్రదర్శించిన టీడీపీ నేతలు..
శ్రీకాకుళం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడిగా కూన రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించడం ఇష్టం లేక స్తబ్దుగా ఉన్న నాయకులంతా.. ధర్మాన కామెంట్స్‌తో విభేదాలను పక్కనపెట్టి లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు. అచ్చెన్న అరెస్ట్ సమయంలో కూడా సాధ్యం కాని ఐకమత్యాన్ని ప్రదర్శించారు. జిల్లా నేతలను ఒకేతాటిపైకి తీసుకొచ్చారు కూన. కళా వెంకట్రావు మొదలుకొని, ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు ఇలా అంతా కలిసి నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. 

తెలుగు తమ్ముళ్లు లోలోన దాసన్నకు థ్యాంక్స్‌ చెబుతున్నారా? 
అదే సమయంలో అంత మంది టీడీపీ నేతలు మూకుమ్మడిగా వెళ్లి కృష్ణదాస్‌పై ఫిర్యాదు చేసినా.. వైసీపీ నాయకులంతా కూన రవికుమార్‌ను టార్గెట్ చేస్తూ సవాళ్లు విసరడం కూడా కలిసి వచ్చిందని లెక్కలు వేసుకుంటున్నారట. గడిచిన వారం రోజులుగా  జిల్లాలో జరుగుతున్న  పరిణామాలను గమనిస్తున్న పార్టీ కేడర్‌ ఫుల్‌ హ్యాపీగా ఉందట. డిప్యూటీ సీఎం ధర్మాన చేసిన ఒకే ఒక్క మాటతో గడిచిన దశాబ్దకాలంలో లేని ఐకమత్యం టీడీపీలో కనిపిస్తోందట. అందుకే  తెలుగు తమ్ముళ్లు లోలోన దాసన్నకు థ్యాంక్స్‌ అని చెప్పుకొంటున్నారట. ఇటు కూనను అభినందిస్తున్నారట. మొత్తానికి దాసన్నమాట  సిక్కోలు టీడీపీకి చద్దన్నం మూటలా మారిందనే చర్చ జోరందుకుంది. మరి.. ఈ టీడీపీలో ఈ ఐక్యతారాగం ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.