అందానికి అందం... శ్రీదేవి

అందానికి అందం... శ్రీదేవి

శ్రీదేవి అన్న పేరు వింటే చాలు తెలుగువారి మది పులకించిపోతుంది. ఇక శ్రీదేవిని తలచుకుంటే చాలు ఈ నాటికీ ఆమె అభిమానులు ఆనందంతో ఊగిపోతారు. శ్రీదేవి బొమ్మను చూసిన మనసులు  మధురస్మృతుల్లోకి జారుకుంటాయి. అందానికి అందం అన్న తీరున ఉండేది శ్రీదేవి. బాలనటిగానే భళా అనిపించిన శ్రీదేవి పదహారేళ్ళు  దాటకముందే పరువాల పాపగా మురిపించింది. ఈ నాటికీ నాటి ముగ్ధమనోహర రూపాన్ని తలచుకొని పులకించిపోయేవారెందరో? 

దర్శకేంద్ర జాలంలో శ్రీదేవి

బాలనటిగా పలు చిత్రాల్లో నటించి అలరించింది శ్రీదేవి. ఇక టీనేజ్ లో అడుగు పెట్టగానే 'అనురాగాలు'లో రెండో నాయికగా నటించేసింది. 'దేవుడులాంటి మనిషి'లో రాజబాబుకు జోడీగా నటించింది. ఆ సమయంలోనే కృష్ణ, విజయనిర్మల దంపతులు శ్రీదేవి తల్లికి హితబోధ చేశారు. ఏది పడితే అది దొరికింది కదా అని అమ్మాయిని నటింపచేయవద్దు. శ్రీదేవికి మంచి భవిష్యత్ ఉంది, ఏదైనా హీరోయిన్ వేషం అయితేనే అంగీకరించు అని సలహా ఇచ్చారు. శ్రీదేవి తల్లి కూడా వారి మాటను తు.చ. తప్పక పాటించింది. అదే సమయంలో దాసరి నారాయణరావు 'మా బంగారక్క' తీస్తూ అందులో శ్రీదేవిని నాయికగా పరిచయం చేశారు. ఆ సినిమాతో శ్రీదేవికి మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రం తరువాతే తమిళంలో 'పదునారు వయదినిలై'లో శ్రీదేవి అందం మురిపించింది. ఆ సినిమాను కె.రాఘవేంద్రరావు తెలుగులో 'పదహారేళ్ళ వయసు' పేరుతో రీమేక్ చేశారు. ఇందులోనూ శ్రీదేవి నాయికగా నటించింది. అలా అనడం కంటే దర్శకేంద్రుని మాయాజాలంతో మరింత అందంగా కనిపించింది అనడం సబబు. 

తాతతో మనవరాలు

అలా సాగుతున్న శ్రీదేవిని రాత్రికి రాత్రి స్టార్ గా మార్చింది కూడా రాఘవేంద్రరావే. యన్టీఆర్ తో రాఘవేంద్రరావు రూపొందించిన 'వేటగాడు'లో శ్రీదేవిని నాయికగా ఎంచుకున్నారు. అంతకు ముందు ఏడేళ్ళ క్రితం అంటే 1972లో యన్టీఆర్ 'బడిపంతులు'లో ఆమె మనవరాలుగా నటించింది. తాతయ్య  సరసన మనవరాలు నాయిక అంటే చూస్తారా? అన్న సందేహం కలిగింది. అయినా ధైర్యం చేసి రామారావుతో చెప్పారు రాఘవేంద్రరావు. ఆయన కూడా 'గో ఎ హెడ్' అన్నారు. తత్ఫలితంగా రూపొందిన 'వేటగాడు' సూపర్ డూపర్ హిట్ అయింది. యన్టీఆర్, శ్రీదేవి జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. రామారావు- శ్రీదేవి నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. వరుసగా నాలుగు సంవత్సరాలు ఈ జంట నటించిన చిత్రాలే తెలుగునాట బ్లాక్ బస్టర్స్ గా నిలవడం విశేషం. 

'పదహారేళ్ళ వయసు'ను హిందీలో 'సోల్వా సావన్' పేరుతో రీమేక్ చేశారు. అందులోనూ శ్రీదేవి నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో శ్రీదేవి హిందీ సినిమాలకు పనికిరాదనీ భావించారు. అయితే తెలుగులో విజయం సాధించిన 'ఊరికి మొనగాడు' చిత్రాన్ని హిందీలో కృస్ణ, ఆయన సోదరులు 'హిమ్మత్ వాలా' పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీదేవిని ఉత్తరాదివారుమెచ్చేలా మ్యాజిక్ చేశారు రాఘవేంద్రరావు. ఆ సినిమా తరువాత శ్రీదేవి ఇటు ఉత్తరాదిన, ఇటు దక్షిణాదిన సూపర్ హీరోయిన్ గా జయకేతనం ఎగురవేసింది. టాప్ స్టార్స్ అందరితోనూ చిందేసి కనువిందు చేసింది. ఎందుకనో శ్రీదేవిలోని ఉత్తమ నటిని ఎవరూ అంతగా ఉపయోగించుకోలేదనే చెప్పాలి. అందరూ ఆమె గ్లామర్ కే జై కొట్టారు. రామ్ గోపాల్ వర్మ తన 'క్షణ క్షణం'లో శ్రీదేవితో ఓ వైవిధ్యమైన పాత్రను పోషింప చేశారు. ఈ చిత్రం ద్వారా శ్రీదేవికి ఉత్తమనటిగా నంది అవార్డు లభించింది. 

పెళ్ళయ్యాకే... 

వివాహం అయిన తరువాత కొన్నాళ్ళు  కెమెరాకు దూరంగా ఉన్న శ్రీదేవి మళ్లీ 'ఇంగ్లిష్ వింగ్లిష్'తో జనం ముందు నిలచింది. ఆ సినిమా విశేషాదరణ చూరగొనడంతో శ్రీదేవికి మళ్ళీ అవకాశాలు మొదలయ్యాయి. రాజమౌళి తన 'బాహుబలి'లో తొలుత శ్రీదేవిని శివగామి పాత్రకు ఎంచుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పాత్ర శ్రీదేవి చేజారిపోయింది. తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన 'పులి'లో శ్రీదేవి నటించింది. ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది.  తరువాత 'మామ్'గా నటించి మెప్పించింది. ఆ సినిమాతో శ్రీదేవికి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు లభించింది. 2013లో శ్రీదేవికి పద్మశ్రీ అవార్డు దక్కింది. దేశం కాని దేశంలో శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న అనుమానస్పద రీతిలో కన్నుమూసింది. భౌతికంగా శ్రీదేవి మన మధ్య నేడు లేకపోయినా, ఆమె నటించిన చిత్రాలతోనే అభిమానులు ఆనందిస్తున్నారు.