భారత్‌పై తగ్గని కరోనా పంజా..లక్షన్నర దాటిన కేసులు

భారత్‌పై తగ్గని కరోనా పంజా..లక్షన్నర దాటిన కేసులు

దేశంలో కరోనా రక్కసి మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. అయితే, గడచిన 6 రోజులతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే... దీంతో, దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షన్నర దాటింది... కొత్త కేసుల సంఖ్య తక్కువగా నమోదయినా... మరణాలు మాత్రం రోజురోజూకు పెరుగుతుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 170 మంది కరోనా బారినపడి మృతిచెందారు. దీంతో.. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  1,51,767కి చేరింది...ప్రస్తుతం 83,004 యాక్టివ్ కేసులు ఉండగా వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు..64,425 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 4,337కు పెరిగింది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం.. లాక్‌డౌన్‌ సడలింపులతో అంతా రోడ్లపైకి వచ్చేస్తుండగా.. కరోనా కొత్త కేసులు టెన్షన్ పెడుతున్నాయి...