నారాయణను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశారా?

నారాయణను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశారా?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పేరు మార్మోగిపోయేది. ఆయన అనుచరులు సైతం ఓ రేంజ్‌లో సందడి చేసేవారు. అలాంటి నాయకుడిని.. ఆయన అనుచరులను ఒకే ఒక్క ఓటమి సోదిలో లేకుండా చేసింది. నోరెత్తితే ఒట్టు అన్నట్టు రాజకీయం నడుస్తోంది. గోరుచుట్టుపై రోకలిపోటులా ఇప్పుడు పార్టీ పదవులు కూడా రాకపోవడంతో పూర్తిగా డీలా పడ్డారట ఫాలోవర్స్‌. ఇంతకీ ఎవరా నాయకుడు? ఎవరా అనుచరులు? 

నెల్లూరు జిల్లాకు వచ్చినా సైలెంట్‌గా వెళ్లిపోతున్న నారాయణ!

రాష్ట విభజన తర్వాత మున్సిపల్ శాఖతోపాటు అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర వహించారు మాజీ మంత్రి పి. నారాయణ. నెల్లూరు అభివృద్ధిలో తన మార్కు చూపించారు. అలాంటి నాయకుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సింహపురికి చుట్టం చూపుగా వస్తుపోతున్నారు. అది కూడా కేవలం తన విద్యా సంస్థల పరిధిలోనే ఉంటున్నారు. అవసరం అనుకుంటే అనుచరులతో మాట్లాడటం లేదంటే తన పని ఏదో చూసుకుని సైలెంట్‌గా వెళ్లిపోతున్నారట నారాయణ. 

పార్టీ పదవి రాక నారాయణ అనుచరుడు పట్టాభి తీవ్ర నిరాశ!

మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉంటే.. నారాయణ అనుచరుల రాజకీయ భవిష్యత్‌ మరింత దారుణంగా ఉందనే టాక్‌ వినిపిస్తోంది. ఆయన ముఖ్య అనుచరుల్లో పట్టాభిరామిరెడ్డి ఒకరు. టీడీపీ నెల్లూరు సిటీ ఇంఛార్జ్‌ పదవి కోసం చాలా సీరియస్‌గా ప్రయత్నించారు పట్టాభి. కానీ.. ఆవేశం, దూకుడు  బాగా ఉన్న  నుడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి  పార్టీ అవకాశం కల్పించింది. అసలే రోజులు బాగోలేదు. ఇప్పుడు పార్టీ పదవి కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందారట పట్టాభి. ఆ సమయంలోనే ఆయన పార్టీ మారిపోతారని ప్రచారం జరిగింది. ఏమనుకున్నారో ఏమో కానీ.. మాజీ మంత్రి పుట్టినరోజు వేడుకలకు హాజరైన పట్టాభి టీడీపీలోనే ఉంటానని ప్రకటన చేసి ఊహాగానాలకు తెరదించారు.

టీడీపీలో పక్కన పెట్టారనే అభిప్రాయంలో నారాయణ వర్గం!

అయితే.. ఈ సంతోషం ఎంతో కాలం లేదు.  నారాయణ వర్గం టీడీపీకి దూరం జరుగుతున్నట్టు మళ్లీ ప్రచారం మొదలైంది. మాజీ మంత్రి సిఫారసు చేసిన వ్యక్తికి TNSF పదవి ఇవ్వకపోవడంతో అనుచరులంతా పునరాలోచనలో పడ్డారట. నెల్లూరు పార్లమెంట టీడీపీ అధ్యక్ష పదవి అయినా పట్టాభికి వస్తుందని లెక్కలు వేసుకున్నారట. ఆ పదవి సైతం మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు  ఇవ్వడంతో టీడీపీలో తమను పూర్తిగా పక్కనపెట్టారనే అభిప్రాయానికి వచ్చేసిందట నారాయణ వర్గం. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పార్టీ నిర్వహించిన నిరసనల్లోనూ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలవకుండా వేరుగానే నిర్వహించి మమ అనిపించారు. ఇప్పుడు అది కూడా లేదు. 

గంటా ఎటు మొగ్గు చూపితే నారాయణ వర్గం అటు వెళ్తుందా? 

నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనుండటం, నారాయణ కూడా పూర్తిగా ఇనాక్టివ్‌గా మారడంతో మనకెందుకులే అనుకున్న అనుచరులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో టీడీపీ కార్యక్రమాలంటే అబ్దుల్‌ అజీజ్‌, కోటంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్రలే కనిపిస్తున్నారు. గతంలో నెల్లూరు సిటీలో పట్టుకోసం ప్రయత్నించిన నారాయణ వర్గం ఊసే ఎవరూ ఎత్తడం లేదు. పైగా గంటా ఎటు మొగ్గు చూపితే అటు మాజీ మంత్రి అనుచరుల అడుగులు వేయొచ్చనే టాక్‌ వినిపిస్తోంది.  మరి.. ఈ సైలెన్స్‌ను నారాయణ బ్రేక్‌ చేస్తారో లేక.. అనుచరులకు దారి చూపిస్తారో కాలమే చెప్పాలి.