అచ్చెన్న అరెస్టుతో టెక్కలిలో స్పీడు పెంచిన దువ్వాడ...

అచ్చెన్న అరెస్టుతో టెక్కలిలో స్పీడు పెంచిన దువ్వాడ...

పార్టీ అధికారంలో ఉంటే.. ఎన్నికల్లో ఓడిన అభ్యర్థుల చేతికి ఆటోమెటిక్‌గా పవర్‌ వచ్చేస్తుంది. టెక్కలిలోనూ అదే జరుగుతోంది. నియోజకవర్గంలో అన్నీ తన కనుసన్నల్లోనే నడవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారట వైసీపీ ఇంఛార్జ్‌. అలా జరక్కపోతే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? 

ముగ్గురు కాళింగలను ప్రయోగించినా అచ్చెన్నదే గెలుపు!

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో టెక్కలి నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఇక్కడ టీడీపీదే ఆధిపత్యం. మొన్నటి ఎన్నికల్లో అచ్చెన్నాయుడిని ఓడించడానికి వైసీపీ అనేక ప్రయోగాలు చేసింది. బలమైనా కాళింగ నేతలైన దువ్వాడ శ్రీనివాస్‌, పేరాడ తిలక్‌, కిల్లి కృపారాణిలను తెరపైకి తెచ్చింది వైసీపీ. అయినా ఆ ఎన్నికల్లో అచ్చెన్నాయుడే గెలిచారు. ఓడినా ఓవరాల్‌గా అధికారం వైసీపీదే కావడంతో ముగ్గురు కాళింగ నేతలు ఆధిపత్యం కోసం వర్గ పోరుకు తెరతీశారు. అచ్చెన్న ఎమ్మెల్యే అయినా.. ఈ ముగ్గురు అనధికార ఎమ్మెల్యేల మాదిరి పెత్తనం చేశారు.

దువ్వాడను ఇంఛార్జ్‌ చేశాక పరిస్థితులు మారిపోయాయా?

సమస్య అంతకంతకూ ముదురు పాకాన పడటంతో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ జోక్యం చేసుకుని దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలి వైసీపీ ఇంఛార్జ్‌గా ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోయాయని అధికార పార్టీలోనూ.. అధికార వర్గాల్లోనూ ఒకటే టాక్‌ నడుస్తోంది.

అధికారులకు వార్నింగ్‌లు ఇస్తున్న దువ్వాడ?

 ESI స్కామ్‌ కేసులో అచ్చెన్నాయుడు అరెస్టయిన తర్వాత దువ్వాడ మరింత స్పీడ్‌ పెంచారట. టెక్కలిలో అంతా తానే అనేలా రిబ్బన్‌ కటింగ్‌లు, ప్రారంభోత్సవాలు, పోస్టింగ్‌లు, బదిలీలు, సమావేశాలు, సమీక్షలు ఒకటేమిటి అన్నింటిలోనూ వేలు పెడుతున్నారట. గతంలో తన మాట వినని పోలీసులు, ఇతర శాఖల అధికారులు బదిలీ చేయించారట. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మాట వినని  అధికారులకు వార్నింగ్‌లు ఇస్తున్నట్టు సమాచారం. దీనిపైనే ఇప్పుడు టెక్కలిలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. 

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే దగ్గరకు ఎందుకెళ్లారు? అని నిలదీత!

వారం క్రితం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యవసాయ అధికారులతో నిమ్మాడలో సమీక్ష నిర్వహించారు. వర్షాలు సరిగా పడక.. నాట్లు ఆలస్యం కావడం, సాగునీటి సరఫరా తదితర అంశాలపై  ఓ నివేదిక కావాలని అధికారులను ఎమ్మెల్యే కోరారట. ఈ సమీక్ష గురించి తెలుసుకున్న దువ్వాడ ఆగ్రహంతో ఊగిపోయారట. మీటింగ్‌కు వెళ్లి  వ్యవసాయశాఖ అధికారులను ఇంటికి పిలిపించుకుని క్లాస్‌ తీసుకున్నారట. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాల్సిన పనేంటి? ఆయన రమ్మంటే వెళ్లిపోవడమేనా? ఉద్యోగం కావాలంటే తాను చెప్పినట్టు నడుచుకోవాలి... లేదంటే ఇంకో పని చూసుకోవాలని గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారట దువ్వాడ. 

అధికారులను మందలించినట్టు సోషల్‌ మీడియాలో దువ్వాడ పోస్ట్‌లు!

ఈ హెచ్చరికలకు బిత్తరపోయారట అధికారులు. మారు మాట్లాడకుండా ఆయన చెప్పినదానికి తలాడించి కామ్‌గా అక్కడ నుంచి వెళ్లిపోయారట. పైగా ఇదేదో ఘనకార్యమన్నట్టు .. అధికారులను పిలిచి తీవ్రంగా మందలించాననే విషయాన్ని స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు దువ్వాడ. అయితే దువ్వాడ ముందు తలాడించిన అధికారులు ఇప్పుడు రుసరుసలాడుతున్నారట. ఆయనేమైనా ఎమ్మెల్యేనా? ఆయనేం చెప్పినా జీ హుజూర్‌ అనాలా? ఇదేం ఖర్మరా బాబు అని అనుకుంటున్నారట. 

ఇంత దూకుడు అవసరమా అని పార్టీలోనూ చర్చ!

ఈ పరిణామాలపై పార్టీలోనూ చర్చ సాగుతోందట. సహజంగానే దూకుడుగా ఉండే దువ్వాడ మరింత దూకుడుగా వెళ్తే ఎలా అని వైసీపీలోనూ చర్చ సాగుతోందట. మొన్నటి ఎన్నికల్లో అచ్చెన్నను ఓడించలేక చతికిలపడ్డ నేత ఈస్థాయిలో పవర్‌ చూపెట్టడం అవసరమా అని కామెంట్స్‌ చేస్తున్నారట. మరి.. దువ్వాడ తీరు రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో చూడాలి.