కలవని రైలు పట్టాలను సీఎం జగన్ కలపాలని చూస్తున్నారా ?

కలవని రైలు పట్టాలను సీఎం జగన్ కలపాలని చూస్తున్నారా ?

రైలు పట్టాలు కలవవు. కలపాలని ప్రయత్నిస్తే ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు. ఇలాంటి ప్రయత్నమే గతంలో ఓసారి టీడీపీ చేసింది. ఇప్పుడు వైసీపీ కూడా చేస్తోంది. అదే ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కండువా లేకుండా ఆహ్వానిస్తున్నారు గానీ.. వాళ్లు చేరాక లోకల్‌ లీడర్స్‌తో ఇమడలేకపోతున్నారు. ఏదో అధిష్ఠానం కోసం నవ్వులు పులుముకుంటున్నా.. ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. 

చేతులు కలిపినా సజీవంగానే గన్నవరం ఎపిసోడ్‌!

ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా అధికార పార్టీకి జై కొట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరామ్‌. ఈ ఎమ్మెల్యేల రాక బాగానే ఉన్నా.. వీరి చేతిలో ఎన్నికల్లో ఓడిన వైసీపీ నాయకులు ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి. గన్నవరంలో వంశీతో ఢీ అంటే అంటున్నారు యార్లగడ్డ వెంకట్రావు. ఆ మధ్య పునాదిపాడులో సీఎం జగన్‌ చొరవ తీసుకుని వంశీ, యార్లగడ్డ చేతులు కలిపారు. దీంతో సమస్యకు చెక్‌ పడిందని అనుకున్నా.. యార్లగడ్డకు ఇది రుచించలేదని సమాచారం. యార్లగడ్డ ఇంతవరకూ ఎక్కడా బయటపడకపోవడంతో.. వంశీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరని ఆయన అనుచరులు చెబుతున్నారు. సో.. గన్నవరం ఎపిసోడ్‌ ఇంకా సజీవంగానే ఉంది. 

చీరాలలో ఆమంచి, కరణం వర్గాల మధ్య సఖ్యత కుదిరేనా?

చీరాలలో ఆమంచి కృష్ణమోహన్‌, కరణం బలరామ్‌ వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయ్‌. సందర్భం వస్తే పరోక్ష వ్యాఖ్యలతో నాయకులే వేడి పుట్టిస్తున్నారు. నెలక్రితం జరిగిన వైఎస్‌ఆర్‌ వర్థంతి కార్యక్రమంలో రెండు వర్గాలు బాహా బాహీకి దిగడం పార్టీ వర్గాలను కలవర పర్చింది.  రెండు వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. ఆ మధ్య చీరాలను కరణం బలరామ్‌కు అప్పగించి.. ఆమంచిని చీరాల పక్కనే ఉన్న పర్చూరుకు పంపుతారని వైసీపీలో ప్రచారం జరిగింది. దానికి  ఆమంచి ఒప్పుకోలేదని.. చీరాలలో సొంత కేడర్‌ ఉండటంతో కదలడానికి  ఇష్టపడటం లేదని సమాచారం. దీంతో ఈ పంచాయితీని ఎలా కొలిక్కి తెస్తారన్నది పెద్దగా ప్రశ్నగా ఉండిపోయింది. 

వైసీపీలోని ప్రత్యర్థులతో వంశీ నిత్యం పోరాటం!

టీడీపీని వీడి వైసీపీ పంచన చేరిన మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌కుమార్‌ నియోజకవర్గాల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత, వర్గ పోరు లేదు. కానీ.. గన్నవరం, చీరాల నియోజకవర్గాలు మాత్రం నిత్యం కుతకుతలాడుతూనే ఉన్నాయి. ఎవరెప్పుడు.. ఏ విధంగా బరస్ట్‌ అవుతారో తెలియదు. అది ఎటు నుంచి ఎటు దారితీస్తుందో అర్థం కాదు. గన్నవరంలో ఎమ్మెల్యే వంశీకి, పార్టీ నేత దుట్టా రామచంద్రరావుకు పడదు. అలాగే వంశీకి, యార్లగడ్డ వెంకట్రావుకు పడదు. పార్టీ పెద్దలు ఏదో ఆశిస్తే.. క్షేత్రస్థాయిలో మాత్రం మూడు వర్గాలు తయారయ్యాయి. అధిష్ఠానం ఆశీసులు ఉండటంతో వంశీ పైకి గంభీరంగా కనిపిస్తున్నా.. గన్నవరంలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. వైసీపీకి జై కొట్టినప్పటి నుంచీ ఆయన వైసీపీలోని తన ప్రత్యర్థులను ఢీకొట్టడమే సరిపోతోంది. తన ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు చాటుకోవాల్సిన దుస్థితి ఉందని అంటున్నారు. 

చీరాలలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు?

వైసీపీకి జై కొట్టినా ఆమంచి రూపంలో గట్టి ప్రతిఘటన ఎదురవుతుండటంతో కరణం బలరామ్‌ ఎప్పటికప్పుడు పైఎత్తులు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కరణంపై పలు అంశాల మీద పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు ఆమంచి. వీటికి పోటీగా కరణం శిబిరం నుంచి కూడా ఫిర్యాదులు వెళ్తున్నాయట. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని వేచి చూస్తున్నా.. విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయే గానీ.. నేతలు ఎక్కడా సానుకూలపడటం లేదు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టు నేతల వైఖరి ఉంది. మరి.. పార్టీ పెద్దలు ఈ గొడవలకు మంత్రమే వేస్తారో.. కాయకల్ప చికిత్సే చేస్తారో చూడాలి.