ముందు నుయ్యి వెనుక గొయ్యి గా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే పరిస్థితి !

ముందు నుయ్యి వెనుక గొయ్యి గా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే పరిస్థితి !

అధికార పార్టీకి జైకొట్టాలని ఆ టీడీపీ ఎమ్మెల్యేపై చాలా ఒత్తిడి ఉంది. వీటి నుంచి ఎలా బయటపడాలా అని అనుకుంటున్న సమయంలో పార్టీ అప్పగించిన కొత్త బాధ్యతలు షాక్‌ ఇచ్చాయట. ఇలాంటి సమయంలో టీడీపీ ఎందుకు పార్టీ బాధ్యతలు అప్పగించింది? ఇదే పార్టీలో జరుగుతున్న చర్చ.

వ్యాపారాలు కాపాడుకోలేక సతమతం

ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంగా మారిందట. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎమ్మెల్యే నలిగిపోతున్నారట. ఒకపైపు రాజకీయ భవిష్యత్‌.. మరోవైపు వ్యాపారాలు కాపాడుకోలేక సతమతం అవుతున్నారట. 

అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేపై ఒత్తిళ్లు

ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఏలూరి సాంబశివరావు 2013లో పర్చూరు నుంచి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశర్వరరావు పైనా విజయం సాధించారు. అయితే టీడీపీ అధికారానికి దూరం కావడంతో పరిస్థితి మారిపోయింది. అధికారపార్టీ నుండి ఎమ్మెల్యేపై ఒత్తిళ్లు ఉన్నాయట. 

టీడీపీ పెద్దలు ఆర్థిక భరోసా కల్పించారట!

ఎమ్మెల్యేకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ అమ్మకాలు ఏపీల నిలిచిపోయాయట. వ్యాపారం కాపాడుకునే క్రమంలో సాంబశివరావు వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసిన తరువాత యూటర్న్ తీసుకున్నారు. చేజారి పోతున్న ఎమ్మెల్యేకు టీడీపీ పెద్దలు ఆర్థిక భరోసా కల్పించినట్టు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో టాక్ నడుస్తోంది. ఆ తర్వాత నుంచి ఏలూరి పార్టీ జంప్‌ వార్తలు తగ్గిపోయాయి. ఇక వైసీపీ ఆయన్ను పట్టించుకోదు అని ఆయనా.. ఆయనతోపాటు అంతా అనుకున్నారు.  కామ్‌గా పనిచేసుకు పోదామని ఎమ్మెల్యే అనుకున్నారట.  వివాదాలకు పోయి హైలెట్‌ కావడం వైసీపీ దృష్టిలో పడటం ఎందుకనుకున్నారో ఏమో సైలెంట్‌ అయిపోయారు. 

కొత్తగా బాపట్ల పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు!

అయితే టీడీపీలో కొత్తగా ఇచ్చిన బాధ్యతలు ఏలూరికి ఇబ్బందిగా మారాయట. ఎమ్మెల్యే సైకిల్ దిగి వెళ్లిపోకుండా ఇటీవల బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలోనే టీడీపీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు. వీరిపై కూడా పార్టీ మారాలనే ఒత్తిళ్లు ఉన్నాయి. 
 
అనగాని, గొట్టిపారి జారిపోకుండా చూసే బాధ్యత కూడా ఏలూరికే!

కొన్ని నెలలుగా ఏలూరి, అనగాని, గొట్టిపాటి ముగ్గురూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట. ఇప్పుడు ఏలూరుకి పదవి ఇచ్చి మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు చేజారి పోకుండా చూడాల్సిన బాధ్యతలు కూడా టీడీపీ అధిష్టానం ఆయనకే అప్పగించిందట. ఈ విషయం చెప్పినప్పటి నుంచి ఆయనకు కంటిపై కునుకు లేదట. మళ్లీ వైసీపీ నుంచి ఒత్తిళ్లు వస్తాయోమోనని భయపడుతున్నారట. ఒక్క దెబ్బకి మూడు పిట్టలు అన్నట్టు టీడీపీ అధిష్టానం వేసిన ఈ స్కెచ్‌పై పార్టీ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. మరి.. వ్యూహం ఎంత వరకు ఫలితం ఇస్తుందో వేచి చూడాలి.