సొంత పార్టీపైనే అసంతృప్తితో రగిలిపోతున్న వైసీపీ ఎమ్మెల్యే

సొంత పార్టీపైనే అసంతృప్తితో రగిలిపోతున్న వైసీపీ ఎమ్మెల్యే

పేరుకే అధికార పార్టీ.. గెలిచింది భారీ మెజారిటీతో.. అయితే మాత్రం ప్రయోజనం ఏముందీ అని నిట్టూరుస్తున్నాడట ఆ ఎమ్మెల్యే. అధికారులు చెప్పిన మాట వినరు...అనుకున్న పనులు కావు.. ఎందుకొచ్చిన పదవి అనుకుంటున్నారట.. చివరికి మంత్రులకు ఫిర్యాదు కూడా చేశారట.. 
ఆ ఎమ్మెల్యేలో అసంతృప్తి ఎందుకు? అధికార పార్టీలో ఉన్నా పనులు కావటం లేదా? నామినేటెడ్‌ పదవులపై కూడా అసంతృప్తి ఉందా? ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారిందట. నియోజక వర్గంలో అనుకున్న పనులు కావడం లేదని జిల్లా మంత్రులపై అన్నా రాంబాబు గుర్రుగా ఉన్నారట. నియోజక వర్గంలో తాను చెప్పిన వారికి కాకుండా ఇతరులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంపై కూడా అన్నా రాంబాబు ఆగ్రహంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. సివిల్ కాంట్రాక్టర్ అయిన అన్నా రాంబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గిద్దలూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన అన్నా రాంబాబు  ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అన్నా రాంబాబు 82 వేల భారీ మెజారిటీతో రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారీ మెజారిటీతో గెలుపొందడంతో అన్నా రాంబాబు నియోజక వర్గంలో తిరుగులేదని భావించాడు. కానీ నియోజక వర్గంలో అలాంటి సీన్‌ కనిపించటం లేదట. 
నియోజక వర్గంలో అన్నా రాంబాబు చెప్పిన పనులు చేయడానికి అధికారులు సహకరించడం లేదట. దీనిపై జిల్లా మంత్రి బాలినేనికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని  అన్నా అసంతృప్తిగా ఉన్నారట. దీంతో పాటు గిద్దలూరు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవి విషయంలో కూడా రాంబాబు చెప్పిన వారిని పక్కన పెట్టారని ఫీలైపోతున్నారట. కంభం మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి ఇవ్వాలని తన అనుచరుడి పేరు అన్నా రాంబాబు చెప్పారట. కానీ టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి జోక్యంతో ఆ పదవిని అన్నా రాంబాబుతో సంబంధం లేకుండా వెంకటేశ్వర్లు అనే మరో నాయకుడికి కట్టబెట్టారట. తన నియోజక వర్గంలో పదవులు కూడా పార్టీ నేతలే ఫిలప్ చేస్తే...నియోజక వర్గంలో ఇక తానెందుకని అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
మరోవైపు కరోనా చికిత్స కోసం మార్కాపురంలో ఉన్న అన్నా రాంబాబు కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీని అధికారులు వాడుకున్నారు. గిద్దలూరు నియోజక వర్గంలో కరోనా బారిన పడిన వారికి కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చికిత్స చేశారు. జిల్లాలో పాజిటివ్ పేషెంట్ల సంఖ్య తగ్గడంతో ఇటీవల కాలేజీని తిరిగి అన్నా రాంబాబుకి అప్పగించారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో కాలేజీ మొత్తం రిపేరు చేయించాల్సిన పరిస్థితి వచ్చిందట. దీనిపై జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కి చెప్పినా పట్టించుకోలేదని జిల్లా మంత్రి బాలినేని వద్ద అన్నా రాంబాబు వాపోయారట. అటు నియోజక వర్గంలో, పార్టీలో తనకు పనులు కావడం లేదని, ఆఖరికి కరోనా చికిత్స కోసం ఇచ్చిన కాలేజీని కూడా ధ్వంసం చేసి అప్పగించారని ఒంగోలులో జరిగిన డీఆర్సీ మీటింగ్ లో మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు ఎదుట అన్నా రాంబాబు తన ఆవేదన వ్యక్తం చేశారట. అన్నా రాంబాబు పరిస్థితి అర్థం చేసుకున్న జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి విశ్వరూప్, జిల్లా మంత్రి బాలినేని వెంటనే స్పందించి కాలేజీ పూర్తిగా రిపేరు చేయించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించారట.  ఓవరాల్‌ గా అధికార పార్టీలో భారీ మెజారిటీ తో గెలుపొందిన ఎమ్మెల్యే అయినా...నియోజకవర్గంలో ఎలాంటి పనులు కావటం లేదనే అభిప్రాయంలో పడిపోయారనే టాక్‌ పెరుగుతోంది.  జిల్లా మంత్రుల వద్ద సమస్యలు ఏకరువు పెట్టిన తరువాత అయినా అన్నా రాంబాబు పరిస్థితి మారుతుందో లేదో మరి..