ఆధిపత్య పోరాటం వల్లనే ఉండి లో నిత్యం గొడవలా?

ఆధిపత్య పోరాటం వల్లనే ఉండి లో నిత్యం గొడవలా?

ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీస్తే.. అక్కడ మాత్రం పార్టీ నేతలు వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కట్‌ చేస్తే ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. అయ్యిందేదో అయ్యింది.. వైసీపీ అధికారంలో ఉంది కదా.. ఇకనైనా కలిసి సాగుతున్నారా అంటే అదీ లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉందట. చివరకు ఉండీ లేనట్టుగా తయారైందట వైసీపీ నేతల పరిస్థితి. 

2014, 2019లో ఉండిలో వైసీపీ ఓటమి!

2019 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి రెండు నియోజకవర్గాలు చిక్కలేదు. అందులో ఒకటి ఉండి నియోజకవర్గం. ఇక్కడ టీడీపీకి, వైసీపీకి బలమైన కేడర్‌ ఉంది. పార్టీ బలంగా ఉన్నా.. వైసీపీ నేతల మధ్య సఖ్యత లేదన్నది బహిరంగ రహస్యం. ఒకరంటే ఒకరికి పడదు. 2014లో ఉండిలో ఓడినా గుణపాఠం నేర్చుకోకుండా దానిని 2019లో రిపీట్‌ చేశారని పార్టీ కేడర్‌ ఇప్పటికీ చెవులు కొరుక్కుంటుంది. 

2019లో సర్రాజును కాదని నరసింహరాజుకు టికెట్‌!

2004లో ఉండి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన పాతపాటి సర్రాజు 2009లో ఓడిపోయారు. 2014లో ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగినా ఫలితం దక్కలేదు. రెండుసార్లు వరసగా ఓడిన అభ్యర్థి వల్ల లాభం లేదని అనుకున్నారో ఏమో.. వైసీపీ అధిష్ఠానం 2019లో ప్లాన్‌ బీ అమలు చేసింది. సర్రాజును  కాదని.. వ్యాపారవేత్తగా ఉన్న PVL నరసింహరాజును తీసుకొచ్చి టికెట్‌ ఇచ్చింది వైసీపీ. అప్పటికి వైసీపీ గాలి బలంగా వీస్తుండటంతో ఉండిలో వైసీపీ పాగా వేస్తుందని భావించారు. కానీ.. అందరి అంచనాలు తప్పాయి. నరసింహరాజు ఓడిపోయారు. 

ఉండిలో రెండుగా విడిపోయిన వైసీపీ కేడర్‌!

ప్రస్తుతం ఉండి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్‌గా నరసింహరాజే ఉన్నారు. ఇక్కడ గెలవకపోయినా.. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో వైసీపీ నాయకులదే హవా. కానీ.. పార్టీ నేతలు వర్గాలను వీడలేకపోతున్నారు. నరసింహరాజు నాయకత్వాన్ని వ్యతిరేకించే వర్గం బలంగానే ఉంది. ఆయనకు వ్యతిరేకంగా గ్రామ స్థాయిలో దీక్షలు కూడా చేశారు. పైగా టీడీపీ నుంచి వచ్చిన వారికి నరసింహరాజు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో సర్రాజు, నరసింహరాజుకు పడటం లేదన్న వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. కేడర్‌ సైతం రెండు శిబిరాలుగా విడిపోయిందని టాక్‌. 

సంఘీభావ యాత్రలో కలిసి నడిచినా.. అది కలరింగేనా? 

నరసింహారాజు, సర్రాజులు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని పైకి చెప్పినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదన్నది కేడర్‌ మాట. పార్టీ అధికారంలో ఉండటంతో ఎవరికి వారు పెత్తనం చేయాలని చూస్తున్నారట.. అందుకే గ్యాప్‌ వస్తుందని అనుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిర్వహించిన సంఘీభావ యాత్రల్లో ఇద్దరు నాయకులు కలిసి నడిచి.. తమ మధ్య విభేదాలు లేవని కలరింగ్‌ ఇచ్చినా.. అది ఉత్తిదే అని అనేవాళ్లు ఉన్నారు. వీరిద్దరి మధ్య సయోధ్యకు కొందరు పార్టీ పెద్దలు ప్రయత్నించినా అవి ఫలించలేదట. 

ఉండిలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు? 

 సర్రాజు ఒకసారి ఎమ్మెల్యేగా చేసి ఉండటం.. రెండుసార్లు పోటీ చేసి ఓడిపోవడంతో ఆయనకు నియోజకవర్గంలో సంబంధాలు బలంగానే ఉన్నాయి. నరసింహరాజు 2019లోనే పోటీ చేశారు. పట్టు నిలుపుకోవాలని సర్రాజు.. పట్టుసాధించాలని నరసింహరాజు చేస్తున్న ప్రయత్నాలే హాట్ హాట్‌గా మారుతున్నాయట. ఇక్కడి విషయాలపై వైసీపీ పెద్దలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు సమాచారం. సరైన సమయంలో సరైన చికిత్స చేస్తారని అనుకుంటున్నారు. మరి  ఆ సరైన సమయం ఎప్పుడు వస్తుందో చూడాలి.