అధ్యక్షులు మారినా టీడీపీ పరిస్థితి మారడంలేదా...?

అధ్యక్షులు మారినా టీడీపీ పరిస్థితి మారడంలేదా...?

కొత్త అధ్యక్షులు వచ్చారు. కొత్త ఉత్తేజం వస్తుందని ఆశించారు. కానీ.. ఆ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎప్పటిలానే ఉందట. చంద్రబాబు పిలుపిచ్చినా కదలిక లేదట. దీంతో అక్కడేం జరుగుతుందో తెలుగు తమ్ముళ్లకు అర్థం కావడం లేదట.

మాన్సాస్‌ హక్కులపైనే అశోక్‌ ఫోకస్‌!

టీడీపీ నుంచి కేంద్రమంత్రులుగా.. రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన సీనియర్‌ నాయకులు ఉన్న జిల్లా విజయనగరం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో జిల్లాలో పార్టీ పరిస్థితే మారిపోయింది. మాన్సాస్‌ ట్రస్ట్‌ నుంచి అశోక్‌గజపతి రాజును తొలగించడంతో... ఆ సమస్యతో పోరాటం చేయడానికే విజయనగరం రాజావారికి సమయం సరిపోవడం లేదు. దీంతో పార్టీ కార్యకలాపాలపై ఆయన దృష్టి పెట్టలేని పరిస్థితి. 

కిమిడి నాగార్జునకు బాధ్యతలు అప్పగించినా మార్పులేదా? 

గత ప్రభుత్వంలో మంత్రలుగా చేసిన కిమిడి మృణాళిని, సుజయకృష్ణరంగారావులు సైతం ఏమైపోయారో ఎవరికీ తెలియడం లేదు. మృణాళిని విశాఖ వదిలి రావడం లేదని కార్యకర్తలే విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడిగా మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జునకే బాధ్యతలు అప్పగించారు. అయినా జిల్లాలో పార్టీ పరిస్థితి మారలేదట. నాగార్జున సైతం విశాఖకే పరిమితమయ్యారట. 

అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిరసనలు లేవు!

అరకు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలు సంధ్యారాణి సైతం పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదట. ఆ మధ్య అమరావతి ఉద్యమం 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ శ్రేణులను చంద్రబాబు ఆదేశించారు. అయినా జిల్లాలో ఏ ఒక్క సీనియర్‌ కనీసం రోడెక్కలేదు. అధికారంలో ఉన్నప్పుడు అయినదానికీ.. కానిదానికీ హాజరైన పార్టీ నాయకులు... ఇప్పుడు చంద్రబాబు చెప్పినా తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారట. 

కరువు మండలాల్లో పర్యటనల్లేవు!

అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇటు టీడీపీని, అటు ప్రజలను పట్టించుకోకపోతే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీ పదవులు దక్కకపోతే నిరసన తెలిపే  నాయకులు.. జిల్లాలో  24 మండలాల్లో కరువు పరిస్థితి ఉన్నా.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను పలకరించడం లేదట. 

టీడీపీ కేడర్‌ డీలా పడుతోందా?

కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారట. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఆందోళన చేస్తున్నా వెళ్లి పలకరించడం లేదట. పార్టీ కొత్త వారికి బాధ్యతలు అప్పగించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో కేడర్‌ సైతం డీలా పడుతోందట. మరి.. టీడీపీలో .. టీడీపీ నేతల్లో చలనం రావాలంటే చంద్రబాబు జోక్యం చేసుకోవాలని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారట. మరి.. తెలుగు దేశంపార్టీ అధినేత ఆ మేరకు చొరవ తీసుకుంటారో లేదో చూడాలి.