విజయవాడ ముస్లిం మైనారిటీ నేతలను పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారా...?

విజయవాడ ముస్లిం మైనారిటీ నేతలను పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారా...?

పదవి వస్తుందని ఆమె కూడా ఊహించలేదు. జాబితాలో పేరు చూసిన తర్వాత ఎవరామె అని ఆరా తీశారు పార్టీ నేతలు. ఇక్కడే అసలు చిక్కు వచ్చిందట. జెండాలు మోస్తున్న మాకేంటి అని ఆమె వైరివర్గం ప్రశ్నిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో బిజీగా ఉన్న అధికారపార్టీ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? అసంతృప్తులను బుజ్జగించేది ఎలా?  

కరీమున్నీసా పేరు ప్రకటించడంతో పార్టీ నేతలు ఆశ్చర్యం!

ఏపీలో ఇటీవల ఆరుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశాలు ఇచ్చింది అధికార వైసీపీ. ఆ జాబితాలో ఉన్న కొన్న పేర్లు పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచాయట. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు కావడంతో ఒక్కటే చర్చ జరుగుతోంది. వివిధ సమీకరణాల్లో భాగంగా విజయవాడ సిటీలో మాజీ కార్పొరేటర్‌ కరీమున్నీసాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ. పెద్దగా ప్రచారంలో లేని నాయకురాలు కావడంతో పార్టీ వర్గాలతోపాటు బెజవాడలోని ముస్లిం సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేతలను ఈ నిర్ణయం ఆశ్చర్యపరిచిందట. 

మా సంగతేంటని ప్రశ్నిస్తున్న వైసీపీలోని ముస్లిం నేతలు!

పార్టీ కరీమున్నీసా పేరు ప్రకటించినంత వరకు బాగానే ఉన్నా.. ఈ నిర్ణయం రుచించని వైసీపీలోని ముస్లిం నేతలు ఇప్పుడిప్పుడే నిరసన రాగాలు అందుకుంటున్నట్టు సమాచారం. ఇంట్లో కూర్చున్న మహిళా నేతను పిలిచి అవకాశం ఇచ్చారు సరే.. మరి ఇన్నాళ్లు జెండా పట్టుకుని రోడ్డెక్కి పనిచేసిన మాకేంటి అని హైకమాండ్‌ను అడుగుతున్నారట. కొందరైతే మమ్మల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు బెజవాడలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల వ్యూహంలో వైసీపీ నేతలు తలమునకలై ఉంటే.. మరోవైపు ఈ కొత్త రగడపై కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. 

బుగ్గకారులాంటి హోదా కలిగిన పదవి కోరుతున్నారా? 

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం సామాజికవర్గం జనాభా ఎక్కువ. ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తుంటారు. అందుకే ఇక్కడి ముస్లిం సామాజికవర్గాన్ని పార్టీలు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. పైగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలే వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంక్‌గా ఉండటంతో.. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారట పార్టీ పెద్దలు. ఈ సందర్భంగా తమ మనసులోని కోరికలను.. తమ డిమాండ్లను ఏకరువు పెడుతున్నారట స్థానిక లీడర్లు. మాకు కూడా ఓ బుగ్గకారులాంటి హోదా కలిగిన పదవి ఇవ్వండి అని  సుతిమెత్తగా డిమాండ్‌ చేస్తున్నారట. 

బలమైన ముస్లిం నేత ఒకరికి పదవిపై హామీ ఇస్తారా?

అసలే మున్సిపల్‌ ఎన్నికల కాలం.. ఈ సమయంలో కాదు.. కూడదు.. కుదరదు.. చూస్తాం.. చేస్తాం అని అనలేని పరిస్థితి. అందుకే పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతంలో ముస్లిం సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్న ఒకరికి పదవిపై హామీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరి.. ఇక్కడి అసంతృప్త నేతలకు ఎలాంటి ఎలాంటి పదవి ఇస్తారో చూడాలి.