టీఎస్ఆర్టీసీ అధికారుల్లో ఆధిపత్య పోరు? అసలు కారణం అదేనా ?

టీఎస్ఆర్టీసీ అధికారుల్లో ఆధిపత్య పోరు? అసలు కారణం అదేనా ?

తెలంగాణ ఆర్టీసీలో ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందా? ఓ కీలక పదవీ కోసం తెరవెనక లాబీయింగ్ మొదలు పెట్టారా? బస్ భవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?

ఆర్టీసీలో ఈడీ-ఏ పోస్టుకోసం పైరవీలు!

మూడు సమ్మెలు, ఆరు ధర్నాలతో ఎప్పుడు చర్చల్లో ఉండే తెలంగాణ ఆర్టీసీలో అధికారుల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు అనేక మలుపులు తిరుగుతోందట. బస్ భవన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మిన్‌గా విధులు నిర్వర్తించే టి.వెంకటేశ్వరరావు కొద్ది నెలల క్రితం మరణించారు. ఆ అడ్మిన్ పోస్టు కోసం మిగతా ఈడీలు పైరవీలు చేస్తున్నారట. ప్రస్తుతం ఈడీ-ఏగా మరో అధికారికి ఇంచార్జ్‌ భాద్యతలు అప్పగించారు. పూర్తిస్థాయి ఆఫీసర్‌ను నియమించకపోవడంతో అడ్మిన్ పోస్టు పై అధికారుల్లో ఆశలు చిగురించాయి. 

పూర్తి స్థాయి ఎండీ లేకపోవడంతో ఈడీ-ఏ పోస్ట్‌కు డిమాండ్‌

ఆర్టీసీలో ఈడీ-ఏ పోస్టుకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. కార్పొరేషన్ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించే బాధ్యత ఈడీ-ఏ పైనే ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి పూర్తి స్థాయి MD లేరు. ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ సునీల్ శర్మకు మరికొన్ని శాఖలకు కూడా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎప్పుడో ఒకసారి తప్ప.. ఆయన బస్ భవన్‌కు రారు. దీంతో బస్ భవన్‌లో ఈడీ-ఏ ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తారు. ప్రొటోకాల్ ప్రకారం అన్ని అధికారాలు అడ్మిన్‌కు ఉండటంతో ఆ పోస్టు కోసం వెంపర్లాట కొనసాగుతోంది.

ఈడీ పోస్టుల సంఖ్య ఏడుకు పెంచేందుకు కూడా యత్నం!

ఇదిలా ఉండగానే సంస్థలో ఈడీ పోస్టుల పెంపు మరో చర్చకు కారణమైంది. తెలంగాణ ఆర్టీసీలో ప్రస్తుతం ఐదు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. కొత్తగా మరో రెండు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పోస్టులు ఏర్పాటు చేయడానికి సంస్థ సిద్ధమైంది. సంస్థలోని ఇద్దరు సీనియర్‌ అధికారులకు పదోన్నతి ద్వారా వాటిని కేటాయించనున్నట్టు బస్ భవన్ వర్గాలు తెలిపాయి. సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈడీ పోస్టుల సంఖ్య పెంచటం సరికాదన్న భావన కొందరు అధికారుల్లో వ్యక్తమవుతోంది. 

ప్రతి పనినీ ఈడీలు సాగదీస్తున్నారని కార్మికుల ఆగ్రహం!

పైగా ఆర్టీసీలో చిన్న సమస్యలను కూడా ఈడీలు పెద్దగా చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బస్ భవన్‌లోని ఈడీలు ఎవరి పరిధిలోని పనులు వారు పరిష్కరించలేక చేతులెత్తేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ పనిని సాగదిస్తూ... సంస్థ నష్టాలకు పరోక్షంగా కారణం అవుతున్నారు.

ఈడీలది రాజభోగమంటూ కార్మికుల సెటైర్లు!

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఆర్టీసీపై పెద్దగా అవగాహన లేదని.. దాంతో ఈడీలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. కార్మికులు త్యాగాలు చేస్తుంటే ఈడీలు రాజభోగాలు అనుభవిస్తూన్నారని బస్ భవన్‌లోనే చర్చ జరుగుతోంది. మరి.. ఈ ఆధిపత్య పోరు ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.