బీజేపీ విమర్శలపై తెరాస మౌనం వ్యూహాత్మకమా...?

బీజేపీ విమర్శలపై తెరాస మౌనం వ్యూహాత్మకమా...?

బీజేపీ విమర్శలకు కౌంటర్లు వేయడంపై టీఆర్‌ఎస్‌ ఎటూ తేల్చుకోలేకపోతుందా ? తెలంగాణ భవన్‌లో షెడ్యూల్ మీడియా సమావేశం ఎందుకు రద్దయింది? ప్రస్తుతం వ్యూహాత్మక మౌనమే మంచిదని గులాబి పార్టీ భావిస్తోందా? 

గతంలోలా బీజేపీపై టీఆర్‌ఎస్‌ విమర్శలేవి?

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు ఓ రేంజ్‌లో పేలాయి. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఆ తర్వాత కూడా కొంత వేడి కొనసాగింది.  మధ్యలో కొంత గ్యాప్‌ వచ్చినా.. బీజేపీ  విమర్శలకు కౌంటర్లు వేశారు అధికార పార్టీ నాయకులు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది. మునుపటిలా కాషాయ పార్టీపై విమర్శలు చేయలేని పరిస్థితి ఉందట. షెడ్యూల్‌ కార్యక్రమాలు కూడా చివరి క్షణంలో రద్దయిపోతున్నాయి. దీంతో పార్టీ నేతలకు, కేడర్‌కు ఏం అర్థం కావడం లేదన్నది తాజాగా జరుగుతున్న చర్చ.

వరంగల్‌లో నిరసన శిబిరం చివరిక్షణంలో రద్దు!

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. ఆ భేటీలపై కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంది టీఆర్‌ఎస్‌. అవి రాజకీయ భేటీలు కాదని.. రాజ్యాంగ పరిధిలో జరిగిన సమావేశాలుగా తేల్చింది అధికారపార్టీ. బీజేపీ మాత్రం దూకుడు తగ్గించలేదు. టీఆర్‌ఎస్‌ నుంచి ఆ స్థాయిలో కౌంటర్లు రావడం లేదు. ఆ మధ్య వరంగల్‌లో  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపడదామని భారీ ఏర్పాట్లు చేసి వెనక్కి తగ్గారు గులాబీ నేతలు. ఆ ఘటన మర్చిపోకుండానే ఇప్పుడు ఇంకో అంశం తెరపైకి వచ్చింది. 

అప్పటికప్పుడు మీడియా సమావేశం రద్దు!
 
తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఖమ్మం పర్యటనలో మంత్రి పువ్వాడ అజయ్‌పైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు. పువ్వాడను ఉద్దేశించి ఆయన పరుష పదజాలమే ఉపయోగించారు. ఈ విమర్శలపై కౌంటర్‌ ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు రెడీ అయ్యారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు మీడియాకు సమాచారం ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత  నామా నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్‌లు మీడియాతో మాట్లాడతారని ఆ సందేశంలో ఉంది. అయితే ఆ వెనువెంటనే మీడియాకు మరో సందేశం వచ్చింది. మీడియా సమావేశం రద్దయిందని ఆ సందేశంలో ఉంది.  ఇదే కొత్త చర్చకు దారితీస్తోంది. మీడియా సమావేశం ఎందుకు పెట్టారు. ఎందుకు రద్దు చేశారన్నది మిస్టరీగా మారిందట. 

టీఆర్‌ఎస్‌ది వ్యూహాత్మక మౌనమా? 

బీజేపీ నుంచి వస్తోన్న విమర్శలను తిప్పికొట్టే విషయంలో టీఆర్‌ఎస్‌ నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారా? అన్న చర్చ మొదలైంది. వ్యూహాత్మక మౌనమే కరెక్ట్‌ అని టీఆర్‌ఎస్‌ భావిస్తోందా? సమయం చూసి దీటుగా బదులివ్వాలని అనుకుంటుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. మరి.. ఏంటన్నది టీఆర్‌ఎస్‌ స్పందన బయటకొస్తే గానీ స్పష్టం కాదు.