తెలంగాణాలో యూనివర్సిటీ వీసీల నియామకానికి బ్రేక్.. అసలు కారణం ఇదే...!

తెలంగాణాలో యూనివర్సిటీ వీసీల నియామకానికి బ్రేక్.. అసలు కారణం ఇదే...!

ఎన్నికల కోడ్‌ రావడంతో తెలంగాణలో వీసీల నియామకానికి బ్రేక్‌ పడింది. కానీ ఈ ప్రక్రియ ఆగడానికి ముందు జరిగిన హైడ్రామా మాత్రం ఆసక్తిగా మారింది. వివిధ వర్గాల్లో జరిగిన ప్రచారం.. ఉద్యోగులు తీసిన ఆరాలు కొందరిని కలవరపెట్టాయట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఆగిన వీసీ నియామకం!

తెలంగాణలో యూనివర్సిటీలకు వీసీలు లేక ఏడాదిన్నర దాటింది. వైస్‌ఛాన్స్‌లర్లను నియమించాలని ప్రభుత్వంపై ఒత్తిడికి కూడా ఉంది. దాంతో ఉపకులపతుల నియామక ప్రక్రియ స్పీడైంది. సెర్చ్ కమిటీల మీటింగ్‌లు జరిగాయి.  ఏడు యూనివర్సిటీలకు చెందిన సెర్చ్‌ కమిటీ మీటింగ్‌ సైతం పూర్తయింది. ముగ్గురు పేర్ల చొప్పున ప్రభుత్వానికి సిఫారసులు వెళ్లాయని సమాచారం. దాంతో రేపోమాపో వీసీల ప్రకటన ఉంటుందని అంతా భావించారు. ఇంతో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. 

విద్యాశాఖ వర్గాల్లో ఉపకులపతుల పేర్లపై చర్చ!

ఇప్పట్లో వీసీల నియామకం ఉండదు. అయితే ఎన్నికల కమిషన్‌ ఆమోదం తీసుకుని నియామకం చేపడతారని తెలుస్తోంది. ఈసీ అనుమతి కోసం ఫైల్‌ వెళ్లిందని చెబుతున్నారు. ఈసీ ఓకే చెప్పగానే ఆమోదించే విధంగా ఒక ఫైల్‌ గవర్నర్‌ ఆఫీస్‌కు వెళ్లినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇలా ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నారు కానీ..  ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత లేదు. ఈసీ నుంచి  ఎలాంటి సమాధానం వస్తుందో ఏమో.. విద్యాశాఖ వర్గాల్లో మాత్రం ఉప కులపతుల పేర్లపై చాలా చర్చ జరుగుతోంది. 

విద్యాశాఖలో వీసీల పేర్లపై  లీకులు ఇచ్చే పరిస్థితి లేదా? 

ఆశావహుల్లో మాత్రం చాలా టెన్షన్‌ ఉందట. ఒకరినొకరు ఫోన్లు చేసుకుని పరామర్శించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఫలానా యూనివర్సిటీకి పేరు ఫైనల్‌ అయిందట కదా అని ఒకరు చెబుతుంటే.. నీ పేరు ఫలానా వర్సిటీకి సిఫారసు చేశారంట కదా అని ఆరా తీస్తున్నారట. ఇలా ఎవరికి వారు చీకట్లో బాణాలు వేస్తున్నారు కానీ.. అసలు విషయం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. తమ పేరు ఉందని ఎవరన్నా చెప్పినా నమ్మాలా వద్దా అన్న మీమాంస ఆశావహుల్లో ఉందట.  ఇన్ని రోజులూ సెర్చ్‌ కమిటీ మీటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా? ఎప్పుడు పేర్లు అనౌన్స్‌ చేస్తారా అని  అంతా ఎదురు చూశారు. వాస్తవానికి జాబితాలో ఉన్న పేర్లు.. కాబోయే వీసీల విషయం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే తెలుసు.  అందుకే విద్యాశాఖ వర్గాలు సైతం దీనిపై లీకులు ఇచ్చే పరిస్థితి లేదు. 

వీసీ వస్తున్నారని ఒక వర్సిటీలో స్వాగత ఏర్పాట్లతో హడావిడి!

యూనివర్సిటీలలో మాత్రం కొత్త చర్చ మొదలైంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే ఫలానా వ్యక్తి VCగా వస్తున్నారని ప్రచారం చేస్తూ.. వాళ్లకు ఫోన్లు చేస్తున్నారట. ఎప్పుడొస్తున్నారు.. ముందుగానే శుభాకాంక్షలు అని ఫోన్లు దంచేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి ఫోన్లు రిసీవ్‌ చేసుకున్నవారికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదట.  నవ్వి ఊరుకుంటున్నట్టు సమాచారం. కొందరైతే ఇంకా పేర్లు ప్రకటించలేదు కదా.. మాకే తెలియదు.. ఇక మీకేం క్లారిటీ ఇస్తామని ముఖం మీదే చెప్పేస్తున్నారట. ఒక వర్సిటీలో అయితే.. ఫలానా రోజున.. ఫలానా వ్యక్తి ఉప కులపతిగా వస్తున్నారని సిబ్బందిని అలర్ట్‌ చేశారట. స్వాగత సత్కారాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. చివరకు ఎవరూ రావడం లేదని తెలుసుకుని కామ్‌ అయ్యారట. మొత్తానికి  వీసీలు వచ్చే వరకు ఉద్యోగ, అధ్యాపక వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చ కొత్త పుంతలు తొక్కుతుందనే చెప్పాలి.