మరి కొత్త సీసీఎల్‌ఏ వస్తారా? రేస్‌లో ఎవరున్నారు?

మరి కొత్త సీసీఎల్‌ఏ వస్తారా? రేస్‌లో ఎవరున్నారు?

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తోంది ప్రభుత్వం. మరి.. కీలకమైన ఈ విభాగాన్ని చూసే CCLA పరిస్థితి ఏంటి? కొన్నాళ్లుగా CCLA లేరు. ఇప్పుడు కొత్త వారు రావాల్సిందేనా? అయితే ఈ సీటులో కూర్చునే సీనియర్‌ ఐఏఎస్‌ ఎవరు? 

చాలా రోజులుగా ప్రత్యేకంగా  సీసీఎల్‌ఏ లేరు!

భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌గా ఎవరు పనిచేసినా.. తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారే అనే నానుడి చాన్నాళ్లుగా ఉంది. చీఫ్‌ సెక్రటరీ తర్వాత CCLAకు అంతటి డిమాండ్‌.. ప్రాధాన్యం ఉంది. ఒకటి రెండు సందర్భాలలో మినహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అయినవారు CCLAగా చేసినవారే. అయితే తెలంగాణలో చాలా రోజులుగా CCLA లేరు.  రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌కో..  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సీఎస్‌ సోమేష్‌ కుమారే భూపరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్‌ బాధ్యతలు కూడా చూస్తున్నారు. 

రెవెన్యూ ప్రక్షళాన సందర్భంగా సీసీఎల్‌ఏను నియమిస్తారా?

ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తోంది. రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. అందుకే రెగ్యులర్‌ CCLAను నియమిస్తారన్న చర్చ జోరందుకుంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వారికి  ఆ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. దీంతో ఆ ఛాన్స్‌ దక్కేదెవరికి అన్న కోణంలో సచివాలయ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. CCLAలో ముగ్గురు IASలు పనిచేస్తున్నారు. వీరిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లే అధికారి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సన్నిహితంగా మెలిగే వ్యక్తి ఎవరన్నది తేలాల్సి ఉంది. 

రేస్‌లో  సీనియర్‌ ఐఏఎస్‌ సునీల్‌ శర్మ!

ప్రస్తుతం రేస్‌లో సీనియర్ ఐఏఎస్‌ సునీల్‌ శర్మ ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రభుత్వం అనుకున్న లైన్‌లో వెళ్తారనే ముద్ర ఉంది. అదీకాకుండా ఆర్టీసీ సమ్మె సమయంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే PMOలో పనిచేసి ఇటీవలే రాష్ట్ర కేడర్‌కు వచ్చిన మరో సీనియర్‌ IAS శేషాద్రి పేరు కూడా నలుగుతోంది. శేషాద్రి గతంలో రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో తలెత్తిన భూ  సమస్యల్లో  భూములు ప్రభుత్వానికి  దఖలు పడేలా చేసేవారని అంటారు. ఆయన పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ శేషాద్రిని CCLAగా చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోందట. మరి వీరిద్దరిలో ఒకరు భూ పరిపాలనా ముఖ్య కమిషనర్‌ అవుతారో.. లేక మరో అధికారిని తెరపైకి తీసుకొస్తారో చూడాలి.