తెలంగాణ బీజేపీలో కొత్త చర్చకు దారితీసిన ఎమ్మెల్సీ ఎన్నికలు...

తెలంగాణ బీజేపీలో కొత్త చర్చకు దారితీసిన ఎమ్మెల్సీ ఎన్నికలు...

ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ బీజేపీలో సరికొత్త చర్చకు తెరతీశాయి. ఎంతోమంది పార్టీ పాత నేతలు టికెట్‌ ఆశిస్తుంటే.. అనూహ్యంగా కొత్త పేరు చర్చలోకి వచ్చింది. దీంతో ఆశ్చర్యపోవడం కమలనాథుల వంతు అయిందట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా చర్చ?

బీజేపీ ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చ!

తెలంగాణలో త్వరలో జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీలు వ్యూహ రచన మొదలుపెట్టాయి. అభ్యర్థుల ఖరారుపై వడపోతలు, కసరత్తులు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. బీజేపీ నాయకులైతే సిట్టింగ్‌ స్థానమైన హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ సీటును కాపాడుకుంటూనే ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు చూస్తున్నారు. సిట్టింగ్‌ స్థానంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు తిరిగి పోటీ చేస్తుండగా.. రెండో స్థానంలో పోటీ చేసే  బీజేపీ అభ్యర్థిపైనే ఆసక్తికర చర్చ మొదలైంది. 

ఎమ్మెల్సీగా పోటీ చేయడానికే వారంతా అనేక ఏళ్లుగా ఎదురు చూపులు!

ఖమ్మం-నల్లగొండ- వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా  ప్రకటించకపోయినా.. మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి పేరు తెరపైకి రావడం కమలనాథులను ఆశ్చర్యంలో పడేసింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కరుడుగట్టిన బీజేపీ నేతలు  ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు కాసం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి తదితరులు టికెట్‌ ఆశించిన వారిలో ఉన్నారు. వీరిలో ఒకరిద్దరైతే ఇక్కడ పోటీ చేయడానికే  అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. 

'బ్యాడ్‌..! యు ఆర్‌ టూ లేట్‌' అని సమాధానం!

మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి టీడీపీని వీడి ఈ మధ్యే బీజేపీలో చేరారు. అలాంటి నేత పేరును ఎమ్మెల్సీ  ఎన్నికల్లో పరిశీలనలోకి తీసుకోవడంతో ఆశవాహులు కంగుతిన్నారట. పైగా పార్టీ కూడా దాదాపుగా ఆయన పేరును ఫైనల్‌ చేసినట్టు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. టికెట్‌ ఆశించిన నేతలు సంఘ్‌ పరివార్‌ పెద్దల ఆశీసుల కోసం వెళ్తుంటే.. 'బ్యాడ్‌..! యు ఆర్‌ టూ లేట్‌' అని సమాధానం ఇస్తున్నారట.  దీంతో  పెద్దిరెడ్డి పేరును పార్టీ ఏ విధంగా పరిగణనలోకి తీసుకుందా అని ఆరా తీస్తున్నారట. 

పెద్దిరెడ్డికి పరిచయాలు కలిసి వస్తాయని లెక్కలు!

బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ప్రకారం పార్టీకి ఖమ్మంలో అంత పట్టు లేదు. పెద్దిరెడ్డి అభ్యర్ధి అయితే ఆ జిల్లాలోని టీడీపీ కేడర్‌ ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని లెక్కలు వేశారట. టీడీపీ నాయకుడిగా.. మంత్రిగా.. కార్మిక సంఘం నేతగా పెద్దిరెడ్డి చాలా మందికి తెలుసునని.. ఆ పరిచయాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి వస్తాయని అనుకుంటున్నారట. పైగా టికెట్‌ ఆశిస్తున్న బీజేపీ నేతల్లో చాలా మంది ప్రజలకు అంతగా పరిచయం లేరనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. అందుకే పార్టీలో పాత కాపులను కాదని.. కొత్త వ్యక్తికి టికెట్‌ ఇవ్వాలని బీజేపీ డిసైడ్‌ అయినట్టు చర్చ జరుగుతోంది. 

మరి.. పార్టీ నేతలను కాదని.. కొత్తగా వచ్చిన వారిపై బీజేపీ పెట్టుకున్న ఈ హోప్స్‌ ఎంతవరకూ ఫలితాన్నిస్తాయో.. పెద్దిరెడ్డి పేరు అధికారికంగా ప్రకటించే సమయంలో ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.