ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నేతల టెన్షన్‌!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నేతల టెన్షన్‌!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలనాథులు టెన్షన్‌ పడుతున్నారా? ఇక్కడ ఒకే.. అక్కడెలా అని వడపోతలు మొదలుపెట్టారా? పట్టభద్రుల విషయంలో బీజేపీ లెక్కలేంటి? కలవరపెడుతున్న అంశాలేంటి? 

పట్టభద్రులు ఆదరిస్తారన్నది బీజేపీ లెక్క!

తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న పోలింగ్‌ జరుగుతుంది.  ప్రధాన పార్టీల క్యాండిడేట్స్‌.. స్వతంత్ర అభ్యర్థులు తీరిక లేకుండా ప్రచారం చేస్తున్నారు. రెండు చోట్లా భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ బహుముఖ పోటీలో ముందు నిలిచేందుకు.. మొదటి ప్రాధాన్య ఓటును ఒడిసిపట్టేందుకు ప్రధాన పార్టీలు వేగంగానే పావులు కదుపుతున్నాయి. రెండుచోట్లా అభ్యర్థులను పోటీలోకి దించిన బీజేపీకి.. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌  సిట్టింగ్‌ స్థానం. ఇక్కడ గ్రాడ్యుయేట్స్‌ బీజేపీకి అనుకులంగా ఉంటారన్నది కమలనాథుల లెక్క. 

ప్రేమేందర్‌రెడ్డి బరిలో ఉన్నచోట ఎలా అని మథనం!

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో ఎలాంటి ఢోకా ఉండబోదని ముందునుంచీ అనుకుంటున్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈసారి కూడా బయటపడతారన్న గట్టి ధీమాతోనే ఉన్నాయి పార్టీ శ్రేణులు. పైకి నవ్వుతూ కనిపించినా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ల నుంచి పోటీ తీవ్రంగానే ఉందని ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందట. ఓటర్ల నమోదు దగ్గర నుంచి... తమకు కలిసి వచ్చే వివిధ అంశాలను దగ్గర పెట్టుకుని లెక్కలతో కుస్తీ పడుతున్నారు.  అయితే నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాతావరణం అనుకున్నంత తేలికగా అయితే లేదని బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. దీంతో ఇప్పటి వరకు హైదరాబాద్‌ స్థానంపై ఫోకస్‌ పెట్టిన కమలనాథులు.. అటు కాన్‌సన్‌ట్రేషన్‌ చేయబోతున్నట్టు సమాచారం...spot...

పార్టీ కేడర్‌, సంఘ్‌ పరివార్‌ క్షేత్రాలు ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వలేదా?

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో ఓటర్లను నమోదు చేయించలేదన్నది బీజేపీ నేతలు చెప్పేమాట. పైగా ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రభావం చూపేవారు కావడంతో పార్టీ క్యాండిడేట్‌ ప్రేమేందర్‌రెడ్డిని ఎలా గట్టెక్కించాలో అర్థం కాక తలపట్టుకుంటున్నట్టు సమాచారం. మూడు ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభావం చూపించగల బీజేపీ నేతలు లేకపోవడం కూడా మైనస్‌గా భావిస్తున్నారట. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్నా.. పార్టీ కేడర్‌, సంఘ్‌ పరివార్‌ క్షేత్రాలు ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదని చెప్పుకొంటున్నారు. దీంతో ఈ స్థానంలో పార్టీకి ఊపు తీసుకురావాలంటే ఏం చేయాలన్న దానిపై  మేధోమథనం చేస్తున్నారట. 

ఇకపై ప్రేమేందర్‌రెడ్డికి మద్దతుగా ముఖ్యనేతల ప్రచారం?

ఇకపై జరిగే ప్రచారంలో బండి సంజయ్‌తోపాటు డీకే అరుణ తదితర రాష్ట్రాస్థాయి నాయకులు నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇతర ముఖ్య నేతలు  టూర్‌ సైతం ఎక్కువగా అక్కడే షెడ్యూల్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఈ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. అధికార పార్టీ పక్కా ప్రణాళికతో ప్రచారం చేస్తోంది. లెఫ్ట్‌పార్టీ అభ్యర్థితోపాటు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తదితరులు ప్రశ్నించే గొంతుకల పేరుతో ఫీల్డ్‌లో ఉన్నారు. ఇలాంటి వాతావరణంలో బీజేపీ వేస్తున్న ప్లాన్‌ ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.