ఈసారైనా చివరి వరకు ఉంటారా?

ఈసారైనా చివరి వరకు ఉంటారా?

ఆయనది రెండు పడవల ప్రయాణం. ఆ పార్టీనేమో ఆయన్నే నమ్ముకున్నట్టుంది. అంతకు ముందు ఉత్తరాది పార్టీ అని.. పాచిపోయిన లడ్డూ ఇచ్చారని బీజేపీ మీద ధ్వజమెత్తిన ఆయన ఇప్పుడు అదే పార్టీతో కలిసిపోయారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు. అలాంటి నాయకుడు... ఈసారైనా... కొత్త మిత్రపక్షంతో చివరి వరకు కలిసే ఉంటారా? ఉండగలరా?

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో పవన్‌ చెట్టపట్టాల్‌!

ప్రశ్నించడానికంటూ.. పవన్ కల్యాణ్ నేతృత్వంలో 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఎన్నికల ముందు పార్టీ పెట్టిన పవన్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని... అన్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం చేయగలిగింది బీజేపీ, టీడీపీ కూటమేనని ఒక్క సీటూ తీసుకోకుండా ఆ కూటమికి మద్దతు ఇచ్చారు జనసేనాని. ఆ తర్వాత ఆ రెండు పార్టీలతో కొన్నాళ్లపాటు చెట్టపట్టాల్ వేసుకుని తిరిగారు. తర్వాత హటాత్తుగా ముందు టీడీపీకి, ఆ తర్వాత బీజేపీకి దూరం అయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వస్తే... రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వెళ్లింది. ఆ విధంగా ఆ రెండు పార్టీలు విడిపోయాయి.

ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూగా అభివర్ణించిన పవన్‌!

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తీరును తీవ్రంగా తప్పుపట్టిన పవన్ కల్యాణ్... ప్రత్యేక ప్యాకేజీ అంటూ పాచిపోయిన లడ్డూ ఇచ్చారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంతేకాదు.... దక్షిణాది.. ఉత్తరాధి అంటూ కొత్త పాయింట్ తీసి కొన్నాళ్లపాటు దంచేశారు. దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ వివక్ష చూపిస్తోందన్నది పవన్ అభ్యంతరం, అభిప్రాయం. 

పవన్‌తో కలిసి ఉండేందుకు చివరి వరకూ ప్రయత్నించిన బీజేపీ, టీడీపీ!

ఇక టీడీపీతోనూ పవన్ విభేదించారు. టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించిన పవన్ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆ రెండు పార్టీలు పవన్‌తో కలిసి ఉండేందుకు చివరి వరకు ప్రయత్నించాయి. అనేక రాయబారాలు నడిపాయి. మధ్యలో విడిపోయిన పవన్‌ను ఎన్నికల నాటికి తిరిగి కలుపేసుకునేందుకు గట్టి ప్రయత్నాలే టీడీపీ చేసింది. చాలా వరకు చర్చలు ఫలపద్రం అయినా... చివరకు పొత్తు పొడవకుండానే ముగిసింది.

పవన్‌ నమ్ముకున్న కామ్రేడ్లకు ఒక్క సీటూ రాలేదు!

టీడీపీ, బీజేపీలతో విభేదించిన పవన్ కల్యాణ్ కమ్యూనిస్టులతో కలిసిపోయారు. వారితో కలిసి అనేక ఆందోళనలు చేశారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీలతోనే కలిసి పోటీ చేశారు. జనసేనకు ఒకే ఒక్క సీటు వస్తే... పాపం పవన్‌ను నమ్ముకుని పోటీ చేసిన కామ్రెడ్లకు ఒక్క సీటూ కూడా రాలేదు. తప్పో ఒప్పో ఆయన్నే నమ్ముకుని ఉన్న కామ్రెడ్లకు ఒక్క మాట కూడా చెప్పకుండా రాం రాం చెప్పేశారు జనసేనాని. సినిమాలకు మళ్లీ వెళ్లనే వెళ్లనని పూర్తికాలం రాజకీయాలేనని... చెప్పిన పవన్ మళ్లీ సినిమాల్లో నటించేస్తున్నారు. రెండు మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.

ఎన్నికల తర్వాత మారిన పవన్‌ వైఖరి.. బీజేపీతో స్నేహం!

ఎన్నికల తర్వాత హఠాత్తుగా పవన్ వైఖరి మారిపోయింది. బీజేపీతో చేతులు కలిపేశారు. బలీయమైన శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తామంటున్నారు. బీజేపీతో కలిసి ఉమ్మడి పోరాటాలు... చేస్తామని అందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెబుతున్నారు. అన్న చిరంజీవి కూడా తమ్ముడి పెట్టుకున్న కొత్త కూటమికి మద్దతు ఇచ్చేశారు. మీరు గట్టిగా ట్రై చెయ్యండి... మీ వెనుక నేనున్నాను అని బీజేపీ ఏపీ కొత్త చీఫ్‌ సోము వీర్రాజుకు హామీ ఇచ్చేశారు. ఇదంతా బాగానే ఉంది. వదిలేసిన పార్టీని పవన్ మళ్లీ ఎందుకు పట్టుకున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఏపీకి ద్రోహం చేసిన పార్టీగా బీజేపీని తిట్టిపోసిన పవన్ ఇప్పుడు ఏ పాజిటివ్ పాయింట్‌తో ఆ పార్టీని వెనుకేసుకు వస్తున్నారో అంతుచిక్కడం లేదు. 

మూడు రాజధానులపై బీజేపీని పల్లెత్తు మాట అనలేదు పవన్‌!

మూడు రాజధానుల విషయంలో వైసీపీ, టీడీపీలను తప్పుపట్టిన జనసేనాని.. రాజధాని మార్పులో మా ప్రమేయం ఏమీ ఉండదన్న బీజేపీని పల్లెత్తు మాట అన్నలేదు. ఇలా మనసు మార్చుకునే పవన్ కల్యాణ్ బీజేపీతోనైనా కొనసాగుతారా? కనీసం 2024 ఎన్నికల వరకైనా వారితో కలిసి ఉంటారా? అన్న సందేహాలు లేకపోలేదు. అటు బీజేపీ ఏమో.... ఆయన మీదే నమ్మకం పెట్టుకుంది.