ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య శత్రుత్వం లేనట్టేనా..?

ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య శత్రుత్వం లేనట్టేనా..?

ఎన్నికల సమయంలో ఆ మున్సిపాల్టీలో ఓ రేంజ్‌లో హైడ్రామా నడిచింది. సీన్‌ కట్‌ చేస్తే.. మొదటి సమావేశంలోనే సినిమా చూపించాయి రెండు పక్షాలు. మనం మనం బరంపురం అని కొత్త రాగం ఆలపించాయి. ఆ మున్సిపాలిటీ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

తొలి కౌన్సిల్‌ సమావేశంలోనే సినిమా చూపించారు!

శ్రీకాకుళం జిల్లా పలాస. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు ఒకఎత్తు అయితే..  పలాసలో జరిగిన నాటకీయ పరిణామాలు మరోఎత్తు. అలాంటి ఎన్నికలు కాగానే స్థానిక వైసీపీ, టీడీపీ లీడర్స్‌ ట్రెండ్ మార్చేశారు. ఏదో జరిగిపోతుందని.. మిన్ను విరిగి మీదపడుతుందని అనుకున్న పార్టీల నేతలకు సినిమా చూపించారు. దానిపైనే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. 

ఐదేళ్లు రణరంగమే అని అనుకున్నారు!

పలాస మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలు కత్తులు దూసుకున్నాయి. నామినేషన్ల ఉససంహరణ ముందు అధికారపార్టీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌.. టీడీపీ క్యాంపు రాజకీయాలు రక్తికట్టించాయి. నలుగురు టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు రాత్రికి రాత్రి మంత్రి సీదిరి అప్పలరాజు శిబిరంలో చేరిపోయి వైసీపీకి జై కొట్టడంతో.. మిగిలిన అభ్యర్థులను జాగ్రత్తగా దాచుకుంది టీడీపీ.  ఎన్ని ఎత్తులు వేసినా.. పలాసలో టీడీపీ 8 వార్డుల దగ్గరే ఆగిపోయింది. ఈ సీన్లు చూసిన వారంతా కౌన్సిల్‌లో వైసీపీ, టీడీపీ మధ్య పొడ గిట్టదని.. ఒకరిపై మరొకరులు విరుచుకుపడతారని భావించారు. రానున్న ఐదేళ్లు పలాస మున్సిపాలిటీలో రణరంగమే తప్ప మరో దృశ్యం కనిపించదని రెండు పార్టీల శిబిరాలు ఊహించాయి. కానీ.. అందరి అంచనాలను తప్పని నిరూపించారు వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు. 

ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు!

ఇటీవల జరిగిన పలాస మున్సిపాలిటీ తొలి కౌన్సిల్‌ సమావేశానికి సభ్యులంతా హాజరయ్యారు. ఏం జరుగుతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ దగ్గర నుంచి కౌన్సిలర్లు అంతా ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకోవడమే సరిపోయింది. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు ఒకరినొకరు తెగ కీర్తించుకున్నారు. మంత్రి అప్పలరాజు మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన 18 అంశాలతోపాటు సమస్యలేవీ పట్టించుకోకుండా ఊసులాడుకోవడంతోనే తొలి సమావేశం ముగిసిపోయింది. 

మనం మనం బరంపురం అని కలిసిపోయిన కౌన్సిలర్లు!

అసలు విషయం తాపీగా తెలుసుకున్న జనాలు.. ఔరా అని ఆశ్చర్యపోయిన పరిస్థితి. టీడీపీ కౌన్సిలర్‌గా ఉన్న వజ్జ బాబూరావు గతంలో మున్సిపల్‌ ఛైర్మన్‌గా చేశారు. ప్రస్తుతం వైసీపీ నుంచి మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన బల్ల గిరిబాబు ఒకప్పుడు బాబూరావు శిష్యుడే. ఇంకేముంది ఒకరినొకరు కౌన్సిల్‌ సమావేశంలో మరోసారి చూసుకోగానే రాజకీయ గొడవలు పక్కనపెట్టి భలేవాడివి బాసు అన్నట్టు మాటలు కలిపేశారు. మనం మనం బరంపురం అని కొత్త చర్చకు ఆస్కారం ఇచ్చారు. బాబూరావు మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే గిరిబాబును కోఆప్షన్‌ మెంబర్‌గా ఎన్నుకున్నారు. అలాంటి గురుశిష్యులు అండర్‌ స్టాండింగ్‌కు వచ్చేశారట. 

ఎన్నికల్లో మాటల తూటాలు.. గెలిచాకా సరదా కబుర్లు!

కౌన్సిల్‌లో సన్నివేశాలను చూసిన వారు... ఎన్నికల నాటి ఆవేశాలు ఏమైయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కూన రవికుమార్‌, గౌతు శిరీష, మంత్రి అప్పలరాజు, ఇతర వైసీపీ నేతల మధ్య పేలిన మాటల తూటాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు బాబూరావు ఏం చెబితే మిగిలిన వారు దానికి తందానా అంటున్నారట. మొత్తానికి పలాస పొలిటికల్ సీన్‌ మరో టర్న్‌ తీసుకోవడం చూసి.. రాజకీయాల్లో అంతేగా.. అంతేగా అని అనుకుంటున్నారట.