ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ధాన్యం కొనుగోలు వ్యవహారం...

ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ధాన్యం కొనుగోలు వ్యవహారం...

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందా? వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు విపక్షం నుంచే కాకుండా.. స్వపక్షం నుంచి కూడా వస్తున్నాయా? ఈ సమస్యను సెట్‌ చేయడం సర్కార్‌కు తలకు మించిన భారంగా తయారైందా? 

ధాన్యం కొనుగోళ్లపై అధికార పార్టీలోనూ విమర్శలు!

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వ పెద్దలు ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం.  రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సర్కార్‌  చర్యలు తీసుకుంటుంటే.. దీనికి పూర్తి విరుద్ధంగా సింహపురి జిల్లాలో అక్రమాలు జరుగుతున్నాయట. ఇదేదో కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలే కాదు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా ధాన్యం కొనుగోళ్లల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తోన్న పరిస్థితి ఉంది. 

వీలైనంత త్వరగా సెట్‌ చేయడానికి సర్కార్ ఫోకస్‌!

ఈ సమస్య రాజకీయ రంగు పులుముకోవడంతో తొలుత ప్రభుత్వ పెద్దలు పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయం అంతా ధాన్యం కొనుగోళ్లల్లో జరిగిన అక్రమాల చుట్టూ తిరుగుతోంది. ముఖ్యంగా సొంతపార్టీ నుంచి ఇదే రకమైన విమర్శలు వస్తుండడంతో దీన్ని వీలైనంత త్వరగా సెట్‌ చేసేందుకు సర్కార్‌ ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం.

4 లక్షల ఎకరాల్లో వరిసాగు.. రికార్డుల్లో 2.25 లక్షల ఎకరాలే నమోదు!

నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది భారీ వర్షాలు పడడంతో గతానికంటే ఎక్కువగా సుమారు 4 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. ఇక్కడ నుంచే మిల్లర్లు.. అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 2.25 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైందంటూ క్షేత్రస్థాయిలోని వ్యవసాయ శాఖ అధికారులు తప్పుడు లెక్కలు పంపించారనే విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చిందట. దీనివెనక నెల్లూరు జిల్లాకే చెందిన కొందరు అధికార పార్టీ నేతలు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

పుట్టికి 260 కిలోలు అదనంగా ఇవ్వాలా?

ధాన్యాన్ని దాచుకునేందుకు గోదాములను సిద్ధం చేయకపోవడం.. కొనుగోళ్ల విషయంలో పెడుతున్న ఇబ్బందులపై లెక్కలతో సహా ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.  తేమ శాతం ఎక్కువగా ఉందని.. పుట్టికి 260 కిలోలు అదనంగా ఇవ్వాలని అధికారులు షరతు పెడుతున్నారట. అలా ఇవ్వడం ఇష్టం లేకుంటే మిల్లర్లకు అమ్ముకోవాలని సూచిస్తున్నారట. 

మిల్లర్లకు అమ్మినా మరోరకంగా దందా? 

ఒకవేళ మిల్లర్లకు ఇస్తే పుట్టకి 9 వేల రూపాయలే రైతలుకు ముట్ట చెబుతున్నారట. అలాగే  అధికారుల సాయంతో ధాన్యం కేంద్రంలోనే అమ్మినట్టు రైతుల పేర్లు నమోదు చేయిస్తున్నారట. ఇది మరోరకం దందాగా గుర్తించారట ప్రభుత్వ పెద్దలు. అధికార పార్టీ నేతల అండతోనే ఇలా జరుగుతుందనే అనుమానాలు బలపడుతున్నాయట. 

రాజకీయంగా ముడిపడి ఉండటంతో మంత్రులకు ఏమీ పాలుపోవడం లేదా?

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులు, తెరవెనక ఉన్న వైసీపీ నేతల పాత్రపై సర్కార్‌ పెద్దలు ఇప్పటికే ఆరా తీశారట. పైగా నెల్లూరు జిల్లా రాజకీయానికి ముడిపడిన అంశం కావడంతో  సంబంధిత శాఖ మంత్రులకు కూడా ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారట. అందుకే ప్రభుత్వం దీనికి ఎలాంటి పరిష్కారం సూచిస్తుందా అని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.