నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత రూటు మార్చేశారా...?

నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత రూటు మార్చేశారా...?

అప్పట్లో ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ. పదవుల్లోనే కాదు.. అప్పటికి.. ఇప్పటికీ ఆ నేత పంథాయే మారిపోయింది. నెలలో ఐదురోజులపాటు జిల్లాలోనే పర్యటించాలని నిర్ణయించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఏమా కథ? 

ఎంపీ కవిత ఎమ్మెల్సీ అయ్యాక చాలా తేడా ఉందా? 

కల్వకుంట్ల కవిత. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. గతంలో నిజామాబాద్‌ ఎంపీ. మొన్నటి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్నా.. ఇప్పుడు గేర్‌ మార్చేశారు. ఎంపీగా ఉన్న కవితకు.. ఇప్పటి ఎమ్మెల్సీ కవితకు చాలా తేడా ఉందని చెవులు కొరుక్కుంటోంది పార్టీ కేడర్‌. జిల్లాలోని అధికార పార్టీ నేతలు.. ప్రజల మధ్య ఇదే అంశంపై చర్చ కూడా జరుగుతోంది. 

ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం!

నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న సమయంలో బిజీగా ఉండేవారు కవిత. జిల్లా పర్యటనకు ఇప్పటిలా ఎక్కువ రోజులు వచ్చేవారు కాదన్నది గులాబీ శ్రేణుల మాట. ఇలాంటి వైఖరి వల్లే గత ఎన్నికల్లో ఇబ్బంది పడ్డామని గ్రహించారో ఏమో.. ఇప్పుడు పూర్తిగా  రూటు మార్చేశారు కవిత. ప్రస్తుతం జిల్లా వాసులను, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిత్యం కలిసి మాట్లాడేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చొరవ చూపుతున్నారు. దీంతో కవిత ఆఫీస్‌ కిటకిటలాడుతోంది. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట. 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీలతో భేటీ!

2019 ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం తెరమీదకు రావడంతో రెండోసారి ఎంపీగా కవిత ఓడిపోయారు. గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఆమె ఘనవిజయం సాధించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం భరోసా ఇచ్చారని టాక్‌. ఇటీవల స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలు అయిన వారితో సమావేశాలు నిర్వహించిన కవిత.. నిధులు, విధులపై చర్చించారు. త్వరలో అంతా కలిసి సీంఎ కేసీఆర్‌తో మాట్లాడాలని నిర్ణయించారట. 

నెలలో ఐదు రోజులపాటు జిల్లాలోనే మకాం!

జిల్లాలోని బీసీ కులాల వారికి వీలైనంత ఎక్కువ లబ్ధి చేకూర్చడంపై కవిత దృష్టి పెడుతున్నారట. ఇటీవల బీసీ సంక్షేమ శాఖ మంత్రిని జిల్లాకు రప్పించి బీసీ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సావిత్రిబాయి పూలే భవన్‌ పేరుతో జిల్లా బీసీభవన్‌.. ఉద్యోగార్ధుల కోసం బీసీ స్టడీ సర్కిల్‌కు ప్రత్యేక భవన నిర్మాణానికి నిధులు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఎస్సీ ఉప కులాల ప్రతినిధులతోనూ కవిత సమావేశమయ్యారు. దీంతో ఓటమి తర్వాత వ్యూహం మార్చేశారని అంతా అనుకుంటున్నారు. నెలలో ఐదు రోజులపాటు జిల్లాలోనే ఉండాలని నిర్ణయించారట. అంతేకాదు.. కవిత రీ ఎంట్రీ తర్వాత జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు సైతం అలర్ట్‌ అయినట్టు సమాచారం. జిల్లాలోనే ఆమె ఎక్కువ రోజులు ఉంటుండటంతో..వారు కూడా ప్రజలతో.. ప్రజా సమస్యలపై ఆచి తూచి స్పందిస్తున్నట్టు సమాచారం. మరి.. మారిన పంథా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.