చూస్తుండగానే కాంగ్రెస్ కంచుకోట కరిగిపోయింది...

చూస్తుండగానే కాంగ్రెస్ కంచుకోట కరిగిపోయింది...

ఒకప్పుడు ఎన్నికలేవైనా కాంగ్రెస్‌ పార్టీదే ఆ జిల్లాలో హవా. ఇప్పుడు ఎన్నికలేవైనా మూడోస్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్థితి. కంచుకోట చూస్తుండగానే కరిగిపోయింది. తాజా ఎన్నికల్లోనూ అదే జరిగింది. ఆ పార్టీ  ప్లేస్‌ను బీజేపీ భర్తీ చేస్తోంది. ఇందూరు జిల్లాలో రంగుమారుతున్న రాజకీయం అనేక మంది నేతల మనుగడ ప్రశ్నార్థకం చేస్తోందట. 

నేతల కళ్లముందే జిల్లాలో కాంగ్రెస్‌ పతనం!

నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస పార్టీ అంటూ ఒకటి ఉందనే విషయాన్ని జనం మర్చిపోయే పరిస్థితి ఎదురవుతోందని రాజకీయ వర్గాలు కామెంట్స్‌ చేస్తున్నాయి. వరుస పరాజయాలు.. నేతల జంపింగ్‌లు వెరిసి జిల్లాలో ఉన్న పార్టీ ఆఫీస్‌కు తాళాలు వేసుకునే దుస్థితి ఉందట. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నుంచి మొదలైన పార్టీ పతనం.. లేటెస్ట్‌గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీక్‌కు వెళ్లిందని టాక్‌. కళ్ల ముందే పరిస్థితి దిగజారుతున్నా.. పార్టీ నాయకులెవ్వరూ గాడిన పెట్టే ప్రయత్నాలు చేయకపోవడం కేడర్‌ను నిరుత్సాహ పరుస్తోందట. 

డిపాజిట్‌ దక్కాల్సిన చోట.. క్రాస్‌ ఓటింగ్‌తో ఆశలు గల్లంతు!

జిల్లాలో ఉన్న నాయకులు.. తమకు పార్టీతో సంబంధమే లేదన్నట్టుగా  ఉంటున్నారట. ఎవరి తీరు వారిదే.. ఎవరి దారి వారిదే. ఉనికిలో ఉన్నాం అని చెప్పుకోవడానికి అడపాదడపా మీడియా ముందుకు రావడం.. ప్రెస్‌మీట్‌ పెట్టి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోతున్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటూ కాంగ్రెస్‌ గెలవలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా డిపాజిట్‌ కోల్పోయింది. తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బలం పుంజుకోలేదు. వారంతా ఓటు వేస్తే గెలుపు సంగతి  ఎలా ఉన్నా.. డిపాజిట్‌ అయినా దక్కేది. కానీ.. పోలింగ్‌ నాటికి అంతా మారిపోయింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ది థర్డ్‌ ప్లేస్‌!

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి 143కు గాను కేవలం 29 మందే ఓటు వేశారు. బీజేపీ నుంచి కూడా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినా.. ఆ పార్టీకి కనీసంగా కనీసం 56 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ థర్డ్‌ ప్లేస్‌కు పడిపోయింది. 

పార్టీ పతనావస్థను కళ్లారా చూస్తున్నారు.. పట్టించుకోవడం లేదా? 

నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వారెవ్వరూ పార్టీని పట్టించుకున్న పరిస్థితి లేదు. మధుయాష్కీ గౌడ్‌ ఎక్కడున్నారో తెలియదు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు  మానాల మోహన్‌రెడ్డి ఉన్నా లేనట్టే అన్న విమర్శలున్నాయి. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సైలెంట్‌ అయిపోయారు.  ఇలా ఏ నేతను తీసుకున్నా.. పార్టీ పతనావస్థను కళ్లారా చూస్తున్నారే కానీ.. కాపాడే ప్లానింగ్‌ లేదు. 

రెండోస్థానం కోసం బీజేపీ యత్నం!

ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్లేస్‌ను ఆక్యుపై చేయడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చాల ప్రాంతాల్లో బలం పెంచుకునేందుకు ఫోకస్‌ పెట్టింది.  మరి... రానున్న రోజుల్లో ఇందూరు జిల్లాలో కాంగ్రెస్‌, బీజేపీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో.. ఎవరు ఉనికిలో ఉంటారో.. ఎవరు కనుమరుగవుతారో చూడాలి.