ఆ జిల్లాలో అధికారులకు ప్రజా ప్రతినిధులకు అస్సలు పడటం లేదా.. ?

ఆ జిల్లాలో అధికారులకు ప్రజా ప్రతినిధులకు అస్సలు పడటం లేదా.. ?

ఆ జిల్లాలో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అస్సలు పడటం లేదట.  సమావేశాల్లోనూ ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. ఈ తగువుతో అభివృద్ధి అటకెక్కిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల అజెండా పక్కకెళ్లి.. మొక్కుబడిగా మీటింగ్స్‌ సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ప్రజా ప్రతినిధులు, అధికారుల మధ్య గ్యాప్‌ ఎందుకొచ్చింది? 

మొక్కుబడిగా జడ్పీ సమావేశాలు!

అధికార పార్టీ ప్రజా ప్రతినిధులంటే అధికారులు అగ్గగ్గలాడుతూ పనులు చేస్తారని అనుకుంటాం. కానీ.. నాగర్‌కర్నూలు జిల్లాలో సీన్‌ రివర్స్‌. ప్రజా ప్రతినిధులు.. చివరకు అమాత్యులు ఏం చెప్పినా యంత్రాంగం పెడచెవిన పెడుతోందనే అభిప్రాయం జనాల్లోకి కూడా వెళ్లిపోయిందట. ఇదే విషయాన్ని జడ్పీ సమావేశం వేదికగా ప్రజాప్రతినిధులు  వెల్లడించడంతో అంతా అవాక్కయ్యారట. అధికారుల నుంచి  సహకారం లేకపోవడంతో జడ్పీ సమావేశాలన్నీ మొక్కుబడిగానే సాగుతున్నాయని టాక్‌. పలువురు ఉన్నతాధికారులైతే మీటింగ్స్‌కే రావడం లేదట. 

మీడియా లేకపోవడంతో బయటపడ్డ ప్రజాప్రతినిధుల ఆవేదన!

ఇటీవలే నాగర్‌కర్నూలు జడ్పీ సమావేశం నిర్వహించారు. ఛైర్‌పర్సన్‌ పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌కు ఎంపీ రాములు, విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కలెక్టర్‌ శర్మన్‌, సీఈవో ఇతర అధికారులు వచ్చారట. కరోనా కారణంగా మీడియాకు నో ఎంట్రీ అని చెప్పారు. ఆ సమావేశంలో మీడియా లేదని అనుకున్నారో.. ఏమో కానీ.. తమ కడుపులో గూడుకట్టుని ఉన్న ఆవేదనంతా జడ్పీటీసీలు, ఎంపీపీలు బయటపెట్టేశారట. ప్రొటోకాల్ మొదలుకొని.. నిధులు, ప్రభుత్వ విధులు, పలురకాల పనుల విషయంలో యంత్రాంగం తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారట ప్రజాప్రతినిధులు. 

చెప్పకుండా నిధులు ఖర్చు చేశారని వైద్యసిబ్బందిపై ఎమ్మెల్యేల ఆగ్రహం!

మిషన్‌ భగీరథ, RWS, పంచాయతీరాజ్‌, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై గత సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగినా.. వాటిని పరిష్కరించకుండా.. మళ్లీ వాటినే అజెండాలో చేర్చడంతో ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారట. అధికారుల తీరు వల్లే సంక్షేమ పనులు ముందుకు సాగడం లేదని అంతా ఆరోపించారట. కరోనా సమయంలో నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యేలకు  తెలియకుండా నిధులు ఖర్చు చేయడంపై వైద్య ఆరోగ్య సిబ్బందిపై ఫైర్‌ అయ్యారని సమాచారం.  అంతేకాదు.. నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను డిమాండ్‌ చేశారట. 

ఆ నోటా ఈ నోటా ఈ విషయాలు బయటకు రావడంతో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మధ్య ఎందుకీ గ్యాప్‌ వచ్చిందని అంతా చర్చించుకుంటున్నారట. మరి..  ప్రభుత్వ పెద్దలు ఈ దూరాన్ని తగ్గిస్తారో.. లేక మౌనంగానే ఉండిపోతారో చూడాలి.