నాగార్జున సాగర్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఎవరు...?
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? జిల్లా మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరిని ప్రతిపాదిస్తున్నారు? టీఆర్ఎస్ అధిష్ఠానం మదిలో ఏముంది? అభ్యర్థిని ఫైనల్ చేయడానికి హైకమాండ్ ఏం చేస్తోంది?
అభ్యర్థి కోసం ఇప్పటికే రెండు మూడు సమావేశాలు!
నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. డిసెంబర్ ఒకటిన ఆయన అనారోగ్యంతో చనిపోయారు. శాసనసభ స్థానం ఖాళీ అయ్యి నెలన్నర కావడంతో ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. సీనియర్ నేత జానారెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ ఖరారు చేయడంతో టీఆర్ఎస్ కూడా క్యాండిడేట్ ఎంపికపై దృష్టి పెట్టింది. దుబ్బాకలో ఓటమి, జీహెచ్ఎంసీలో అనుకున్న ఫలితం రాకపోవడంతో ఆచితూచి అడుగువేస్తోంది టీఆర్ఎస్. ఇప్పటికే రెండు మూడు సమావేశాలు జరిగినా అభ్యర్థిపై తుది నిర్ణయానికి రాలేదు. షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించేందుకు టిఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది.
తండ్రి పేరు కలిసి వస్తుందని భగత్ లెక్కలు!
నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ TRS తనకే సీటు ఇస్తుందని భావిస్తున్నారు. హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న భగత్.. తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో పర్యటించేవారు. నేతలతో సత్సంబంధాలు, తన తండ్రికి ఉన్న మంచి పేరు కలిసొస్తుందని భగత్ యాదవ్ హైకమాండ్‌కు చెప్పుకుంటున్నారట.
టికెట్ ఆశిస్తోన్న నోముల బంధువు బాలరాజు!
నోముల కుటుంబం నుంచే ఆయన బంధువు కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. నోముల నర్సింహయ్య బంధువు.. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత బాలరాజు యాదవ్... ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. ఉద్యమంలో తన పాత్రను, తన భార్య సామాజికవర్గాన్ని, తన సామాజికవర్గాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారట.
కోటిరెడ్డి పేరు సూచిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి!
నాగార్జునసాగర్ ఉపఎన్నికపై జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి తన మనసులోని మాట అధిష్ఠానం పెద్దలకు చెప్పేశారు. స్థానికంగా ఉంటున్న అడ్వకేట్ ఎంసీ కోటిరెడ్డి పేరును పరిశీలించాలని సూచించారు. నోముల కుటుంబం కంటే మెరుగైన అభ్యర్థిగా కోటిరెడ్డికి పేరుందనేది మంత్రి అభిప్రాయం. ఒకప్పుడు జానారెడ్డికి అనుచరుడిగా ఉన్న కోటిరెడ్డి.. మంత్రి జగదీష్‌కి క్లాస్మేట్ కూడా. జిల్లా ప్రజాప్రతినిధులు కోటిరెడ్డికి మద్దతు తెలిపేలా జగదీష్‌రెడ్డి మంత్రాంగం చేస్తున్నట్టు తెలుస్తోంది.
వారంలో అభ్యర్థిని ప్రకటిస్తారా?
ఉపఎన్నికలో జానారెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును కూడా టీఆర్ఎస్ హైకమాండ్ పరిశీలిస్తోందట. మంత్రి పదవి ఆశించి.. మండలి చైర్మన్ అయిన గుత్తా.. పార్టీ అధిష్ఠానం ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. అయితే పోటీ చేయాలని తనకు లేదని, అలాంటి ప్రతిపాదన పార్టీ నుంచి రాలేదని చెబుతున్నారు గుత్తా. ఒకవేళ గుత్తాను వద్దని అనుకుంటే.. మరోనేత తేరా చిన్నపరెడ్డి అభ్యర్థిత్వంపై కూడా పార్టీ చర్చిస్తోందట. చిన్నపరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండటంతో ప్రస్తుతం ఆయన్ని కదపాలా వద్దా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ వారంలోనే అభ్యర్థిని ఫైనల్ చేయాలని పార్టీ అధినేత కేసియార్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు నల్లగొండ జిల్లా నేతలతో కేటీఆర్ మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)