రాజకీయాల్లో ఆనం హవాకు గట్టి బ్రేకులు పడ్డట్టా..?

రాజకీయాల్లో ఆనం హవాకు గట్టి బ్రేకులు పడ్డట్టా..?

ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. సొంత పార్టీతో టచ్‌ మీ నాట్‌ అన్నట్టు ఉంటారు. ఇప్పుడు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో అందరి దృష్టీ ఆయనపై పడింది. అసంతృప్తితో రగిలిపోతున్న ఆ ఎమ్మెల్యే.. కీలకమైన ఈ సమయంలో ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారన్నది చర్చగా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? 

ఏదో ఎమ్మెల్యేగా ఉన్నారంటే ఉన్నారనే పరిస్థితి!

ఆనం రామనారాయణరెడ్డి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే. మాజీ మంత్రి.  జిల్లాలో సీనియర్‌ రాజకీయ కుటుంబానికి పెద్ద. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ కష్టాలు వెన్నాడుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడి టీడీపీలోకి వెళ్లారు.. మొన్నటి ఎన్నికల సమయంలో టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా.. ఏదో ఉన్నారంటే ఉన్నారు అని అనుకునే పరిస్థితి. ఇంతకుముందులా జిల్లాలోని నాయకులు ఆయనకు గౌరవం ఇవ్వడం లేదట. జిల్లా అంతా ఆనం కుటుంబానికి  అనుచరగణం ఉన్నా.. వెంకటగిరి దాటి దాటి బయటకు రావడం లేదు. 

ఆనం కుటుంబం సత్తా చాటతామని సవాల్‌!

ఆ మధ్య నెల్లూరు మాఫియా అని కామెంట్స్‌ చేసి వైసీపీలో కలకలం రేపారు ఆనం. ఆ ఎపిసోడ్‌లో సీఎం జగన్‌తో భేటీ అయిన తర్వాత మౌనం దాల్చారు. కొన్నాళ్ల తర్వాత సోదరుడు ఆనం వివేకానందరెడ్డి జయంతికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నెల్లూరు మున్సిపల్‌ సిబ్బంది తొలగించడంతో భగ్గుమన్నారు ఈ మాజీ మంత్రి. ఆ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్‌పై ఇప్పటికీ జిల్లాలో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆనం కుటుంబం సత్తా చూపిస్తామని సవాల్‌ చేశారు. వివేకా మరణంతో నెల్లూరు నగరానికి దూరం కాలేదని.. సిటీలోని ప్రతికుటుంబంలో తమకు అభిమానులు ఉన్నారని తెలిపారు ఆనం. 

ఉపఎన్నిక సన్నాహక సమావేశానికి అలా వచ్చి ఇలా వెళ్లారు!

పార్టీతో.. సొంత పార్టీ నాయకులతో ఇలా అంటీముట్టనట్టు ఉన్న సమయంలోనే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక వచ్చింది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకటగిరి కూడా ఉంది. కిందటి ఎన్నికల్లో ఆయనకు మంచి మెజారిటీ రావడంతోపాటు.. వైసీపీ లోక్‌సభ అభ్యర్థికి కూడా ఓట్లు భారీగానే పడ్డాయి. పైగా సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట నియోజవర్గాల్లో సైతం ఆనం అభిమానులు ఉన్నారు. ఇటు చూస్తే ఆనం యాక్టివ్‌గా లేరు. ఆ మధ్య జరిగిన ఉప ఎన్నిక సన్నాహక సమావేశానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు ఆనం రామనారాయణరెడ్డి. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి నామినేషన్‌ కార్యక్రమంలోనూ వచ్చానంటే వచ్చానన్నట్టు కనిపించారట. 

ఆనం మౌనం పార్టీకి ఇబ్బందేనని చర్చ!

2019 ఎన్నికల కంటే ఈ దఫా ఎంపీ అభ్యర్థికి ఇంకా ఎక్కువ మెజారిటీ రావాలని పార్టీ అధినేత, సీఎం జగన్‌ ఎమ్మెల్యేలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. అంటే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మరింత ఎఫర్ట్‌ పెట్టాలి. ఇటు చూస్తే ఆనం అంతరంగం అర్ధం కావడం లేదట. ఆయన యాక్టివ్‌గా లేకపోతే పార్టీకి ఎలాంటి నష్టం చేకూరుస్తుందో అన్న చర్చ సాగుతోంది. ఎన్నికల తర్వాత ఎవరెలా పనిచేశారో వ్యక్తిగతంగా పార్టీ లెక్కలు తీసే వీలుంది. మరి.. అసంతృప్త వాదిగా మారిన ఆనం ఏం చేస్తారో చూడాలి.