ఒక్కసారిగా సైలెంట అయిన మంత్రి గంగుల!

ఒక్కసారిగా సైలెంట అయిన మంత్రి గంగుల!

మొన్నటి వరకు దూకుడుగా వెళ్లిన ఆ మంత్రి ఎందుకు సైలెంట్‌ అయ్యారు?  మంత్రి మౌనంపై ఆ జిల్లాలో జరుగుతోన్న చర్చ ఏంటి? ప్రత్యర్థులు విమర్శలకు పదును పెట్టినా.. ఎందుకు చలనం లేదు? ఇంతకీ ఎవరా మంత్రి? ఎందుకా మౌనం?

మంత్రి గంగుల మౌనంపై హాట్‌ టాపిక్‌!

గంగుల కమలాకర్‌. తెలంగాణ మంత్రి. కేబినెట్‌లో చేరిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులపై ఓ రేంజ్‌లో విరుచుకుడు పడిన ఆయనలో ఇప్పుడా ఫైర్‌ ఏమైందో తెలియడం లేదు. జిల్లాలో తనకు రాజకీయంగా సవాల్‌ విసురుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో మొదటి నుంచి పడదు. అప్పట్లో సంజయ్‌ ఏదైనా అంటే  అంతెత్తున లేచేవారు గంగుల. ఇప్పుడు ఎన్ని విమర్శలు చేసినా.. రెచ్చగొట్టేలా మాట్లాడినా.. చీమకుట్టినట్టు అయినా లేదట ఈ మంత్రిగారికి. ఇప్పడిదే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఆ గంగుల .. ఈ గంగుల ఒక్కటేనా?

టీడీపీలో ఉన్నప్పుడు కానీ.. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత కానీ ప్రత్యర్థులను విమర్శించాలంటే ముందు వరసలో ఉండేవారు గంగుల. ఇప్పుడు ఆయన్ని చూసిన వారంతా ఆ గంగుల.. ఈ గంగుల ఒక్కటేనా అని ప్రశ్నిస్తున్నారట. జిల్లాలో ఆయనతోపాటు మంత్రులుగా ఈటల రాజేందర్‌,  కొప్పుల ఈశ్వర్‌ ఉన్నారు. బీజేపీని విమర్శించాల్సి వస్తే ఈటల, కొప్పుల ఏ మాత్రం తగ్గడం లేదు. వీరికి పూర్తిగా భిన్నంగా  కనిపిస్తున్నారు కమలాకర్‌. సంజయ్‌ చేతిలో ఓడిన వినోద్‌ కుమార్‌ సైతం  ఘాటైన పదజాలమే ఉపయోగిస్తున్నా.. ఈ మంత్రిగారికి ఏమైందని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 

లైంగిక ఆరోపణల తర్వాత మార్పు వచ్చిందా? 

జిల్లాకు సంబంధం లేకపోయినా ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆ మధ్య మంత్రి గంగుల ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో సుమన్‌ పక్కనే కూర్చున్నారు గంగుల. వినోద్‌కుమార్‌ పర్యటనలోనూ పక్కనే ఉన్నారు. ఆ రెండు సందర్భాలలోనూ పెదవి విప్పితే ఒట్టు. ఈ సందర్భంగా గంగుల మౌనంపై టీఆర్‌ఎస్‌లో ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేస్తున్నారు. ఆ మధ్య మంత్రిపై  పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వచ్చాయి. పార్టీల్లోనూ, ప్రజల్లోనూ విస్తృత చర్చకు దారితీశాయి ఆ ఆరోపణలు. అప్పటి నుంచి మంత్రిలో మార్పు వచ్చిందన్నది కొందరు చెప్పేమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా మాట్లాడితే రాజకీయ ప్రత్యర్థులు ఆ అంశాన్ని అస్త్రంగా చేసుకోవచ్చనే భయం గంగులలో ఉందట. అందుకే మౌనంగా ఉంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

తనకు, పార్టీకి ఇబ్బంది రాకుండా నోరు కుట్టేసుకున్నారా?

ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో నోరు విప్పితే అది రాజకీయంగా గంగులకు.. పార్టీకి ఇబ్బందిగా మారొచ్చన్నది కొందరు చెప్పేమాట. ఆ విషయం తెలిసే ఆయన నోరు కుట్టేసుకున్నట్టు భావిస్తున్నారు. అయితే రాజకీయాల్లో టైమ్‌ బ్యాడ్‌ అంటే ఇదేనని ఇంకొందరు  గంగులను ఉద్దేశించిన కామెంట్స్‌ చేస్తున్నారట. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయారు అని కొందరు..  ఇక పొలిటికల్ కెరీర్‌ ముగింపునకు వచ్చిందని ఇంకొందరు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చర్చించేసుకుంటున్నారు. మరి.. తన టైమ్‌ వచ్చే వరకు గంగుల ఎదురు చూస్తారో ఈ లోగానే కమలాకర్‌ కమాల్‌ చేస్తారో చూడాలి.