మంత్రి అవంతి శ్రీనివాస్ అలిగారా?

మంత్రి అవంతి శ్రీనివాస్ అలిగారా?

ఆ మంత్రిగారు అలకపాన్పు ఎక్కారట. పార్టీ నిర్ణయాన్ని కాదలేక.. మనసుకు సర్దిచెప్పుకోలేక నలిగిపోతున్నారట. వద్దనుకున్న వ్యక్తులకు కండువాలు కప్పితే తన విలువేంటని మథన పడుతున్నారని భోగట్టా. ఎన్నికల వేళ ఇంతగా కలవరపడుతున్న ఆ అమాత్యుడు ఎవరు? ఎందుకీ పరిస్థితి వచ్చింది?

మంత్రి వైఖరి అలకబూనినట్టే ఉందా?

గ్రేటర్ విశాఖపీఠం లక్ష్యంగా వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తోంది వైసీపీ. టీడీపీని బలహీనపరచడమే లక్ష్యంగా వలసలకు గేట్లు ఎత్తేసింది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌తో ప్రారంభమైన ఆపరేషన్ ఆకర్ష్.. చోటా మోటా నాయకుల వరకు కొనసాగుతోంది. రోజూ వందల మందిని పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం మంత్రి అవంతి శ్రీనివాస్ మనసుకు బాధ కలిగించిందనే ప్రచారం జరుగుతోంది. అమాత్యుడు వైఖరి కూడా అదేవిధంగా ఉండటంతో ఆయన అలకబూనారనే చర్చ మొదలైంది. 

కాశీవిశ్వనాథం చేరికను వ్యతిరేకించిన అవంతి!

రాజకీయ వలసలు మొదలైనప్పటి నుంచి జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు. జాయినింగ్స్ విషయంలో హుషారుగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలోనే అవంతి శ్రీనివాస్‌కు షాక్ ఇచ్చే పరిణామం జరిగింది. బిల్డర్ కాశీవిశ్వనాథం వైసీపీ కండువా కప్పేసుకున్నారు. కాశీవిశ్వనాథంతో మంత్రికి పోటీ లేదు. కానీ, కాశీ చేరడాన్ని మంత్రి వ్యతిరేకించారని ఆ దిశగా పెద్ద పంచాయితీనే జరిగిందని భోగట్టా. కాశీ విషయంలో మంత్రికి ఉన్న ప్రధాన అభ్యంతరం ఆయన మాజీమంత్రి గంటా అనుచరుడు కావడమే. 

కాశీ విశ్వనాథం జాయినింగ్‌కు రాని మంత్రి అవంతి!

జిల్లాలో మాజీ మంత్రి గంటాతో రాజకీయ వైరం నడుపుతున్నారు అవంతి శ్రీనివాస్. గంటా పార్టీ మారతారనే ప్రచారం వస్తే చాలు అమాత్యుడు అలర్ట్ అవుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా రాజకీయ విమర్శలు గుప్పించి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. అవంతి చర్యలకు హైకమాండ్ మద్దతు కూడా లభించడంతో వైసీపీలోకి గంటా ప్రవేశం దాదాపు అసాధ్యమనే భావనే రాజకీయవర్గాల్లో ఏర్పడింది. పార్టీలో అవంతి బలం పెరుగుతుందనే అంచనాలు ఉండగా.. ఇప్పుడు అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చర్చించుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇంతలో కాశీ జాయినింగ్ అట్టహాసంగా జరిగింది. ఇంఛార్జ్‌ మంత్రి కన్నబాబు, ఎంపీ ఎంవీవీ వచ్చారు. కానీ, మంత్రి అవంతి రాలేదు. అదే సమయంలో ఆయన నగరంలోని దొండపర్తిలో ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవానికి వెళ్లారు. 

పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టత ఇచ్చారా? 

నాలుగు నెలల క్రితం భీమిలి బీచ్ రోడ్డులో కాశీ విశ్వనాథం నిర్వహిస్తున్న గోకార్టింగ్‌ను రెవెన్యూ యంత్రాంగం కూల్చి వేసింది. రాజకీయకక్షలో భాగంగానే ఈ చర్యకు పాల్పడ్డారని అప్పట్లో టీడీపీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు గంటా ముఖ్య అనుచరుడైన కాశీవిశ్వనాథంను వైసీపీలో చేర్చుకోవడం సరైంది కాదని అవంతి వ్యతిరేకించినట్టు సమాచారం. కానీ ఆ అభ్యంతరాలేవీ పార్టీ ఖాతరు చేయలేదట. భారీ ర్యాలీగా వెళ్లి విజయసాయిరెడ్డి సమక్షంలో కండువా కప్పేసుకున్నారు కాశీవిశ్వనాథం. అయితే మంత్రి గైర్హాజరు ప్రస్తావనకు వచ్చిందట. వ్యక్తుల అభిప్రాయంకంటే పార్టీ ప్రయోజనమే ముఖ్యమనే స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే మంత్రి అవంతి ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు కాశీవిశ్వనాథం. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసినట్టేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి.. మంత్రిగారి తదుపరి యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.