తెలంగాణ కాంగ్రెస్ లో హీటెక్కిస్తున్న ఆ నాయకుడెవరు...?
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో బాటసారి సిద్ధమవుతున్నారా? ఇప్పటి నుంచే రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారా? అన్ని దారులు అటే వెళ్తాయా? నా దారి రహదారి అంటోన్న ఆ నాయకుడు ఎవరు? కాంగ్రెస్‌లోని ఇతర నాయకులు కలిసి వస్తారా? లెట్స్ వాచ్!
పాదయాత్రకు సిద్ధమవుతున్న భట్టివిక్రమార్క?
ముందస్తు ఎన్నికల కంటే ముందే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేయడానికి పోటీపడ్డారు. అప్పట్లో వారి రోడ్స్‌ను పార్టీ క్లోజ్ చేసింది. ఇప్పుడు నాగార్జునసాగర్ ఎన్నికలకు తోడు... రైతుల పక్షాన ఆందోళన బాటకు కాంగ్రెస్ నిర్ణయించడంతో నాయకులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత రైతులతో ముఖాముఖీ చేపట్టబోతున్నట్టు ప్రకటించిన సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క దానికి పాదయాత్రను కూడా జోడించబోతున్నారట. అదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
మధిర టు నాగార్జునసాగర్.. దాదాపు 175 కి.మీ. పాదయాత్ర?
రైతు ముఖాముఖికి సంబంధించిన పనులను తన సన్నిహితులకు పురమాయించారట భట్టివిక్రమార్క. అలాగే తన నియోజకవర్గం మధిర నుంచి పాదయాత్ర చేయబోతున్నారట. మధిర నుంచి నాగార్జున సాగర్ వరకు ఈ యాత్ర సాగుతుందని సమాచారం. దాదాపు 175 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది. యాత్రలో భాగంగానే ఊరూరా రైతులతో ముఖాముఖి పెడితే ఎలా ఉంటుందని ఆయన ఆరా తీస్తున్నారట. ఇటు సమస్య హైలైట్ కావడంతోపాటు నాగార్జునసాగర్ ఉపఎన్నికకు కూడా యాత్ర కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నట్టు టాక్.
పాదయాత్ర రూట్ మ్యాప్ ఏంటి?
ఈ పాదయాత్రపై పార్టీ నాయకులు.. మాజీ మంత్రి జానారెడ్డితో మాట్లాడిన తర్వాత ఫైనల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మధిర నుంచి నాగార్జునసాగర్ వరకు పాదయాత్రకు ఎన్ని రోజులు పడుతుంది? రూట్‌మ్యాప్ ఏంటి? రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడవాలి? పాదయాత్ర ముగింపు అట్టహాసంగా ఉండాలంటే ఏం చేయాలి అన్నదానిపై తీవ్రంగానే భట్టి చర్చిస్తున్నట్టు సమాచారం.
భట్టిని వ్యతిరేకించేవారు పాదయాత్రకు మద్దతిస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకరు ఔనంటే ఇంకొకరు కాదంటారు. మరి.. భట్టి సిద్ధం చేస్తున్న ఈ ప్రతిపాదనకు ఏ మేరకు పార్టీలో మద్దతు లభిస్తుందన్నది ఇప్పుడు ఎవరూ చెప్పలేని పరిస్థితి. పీసీసీకి కొత్త చీఫ్ ఎంపిక ప్రక్రియ మొదలైన తర్వాత పార్టీలో నెలకొన్న పరిణామాలు వేరు. పార్టీ చీలకలు.. పేలికలుగా ఉంది. భిన్నాభిప్రాయాలు కాస్తా భేదాభిప్రాయాలుగా మారాయి. రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ధర్నా చౌక్‌లో నిర్వహించిన దీక్షలోనే భట్టి ప్రకటించారు. ఇప్పుడు ఆ కార్యక్రమానికి పాదయాత్రను జోడిస్తే.. కాంగ్రెస్ పార్టీ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందనే చర్చ సాగుతోంది. అలాగే పార్టీలో ఆయన్ని వ్యతిరేకించేవారు మద్దతు ప్రకటిస్తారా లేదా అన్నది కూడా అనుమానమే.
ఎన్నికల ముందు పాదయాత్రకు రాహుల్‌గాంధీ బ్రేక్!
గతంలోనే పాదయాత్రకు వెళ్దామని భట్టితోపాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి భావించారు. అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు రాలేదు. పైగా ఎన్నికల ముందు తలోదారి అంటే కుదరదని నాడు రాహుల్‌గాంధీ ఒప్పుకోలేదు. దాంతో ఎవరి జిల్లాలో వాళ్లు పాదయాత్ర చేసుకుంటే బెటర్ అని చర్చ జరిగింది. అలాంటిది ఇప్పుడు తన జిల్లాను దాటి పాదయాత్ర చేస్తానంటున్నారు భట్టి విక్రమార్క. మారిన రాజకీయ పరిణామాలతో యాత్రకు అనుమతి సాధించి ఏ మేరకు ఆయన సక్సెస్ అవుతారో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)