వైరా మున్సిపాలిటీ లో ఏం జరుగుతుంది...?

వైరా మున్సిపాలిటీ లో ఏం జరుగుతుంది...?

ఆ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి 30 నెలలు అయ్యింది. ఇప్పటికే ఎనిమిది మంది కమిషనర్లు మారారు. ఒకరి తర్వాత మరొకరు.. అక్కడికి వస్తున్నారు, వెళ్తున్నారు ? ఆ మున్సిపాలిటీని చక్కదిద్దడానికి ఓ IAS అధికారి చేసిన ప్రయత్నాలు కూడా కొలిక్కిరాలేదు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది ?

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఇది. ముప్పై నెలల క్రితం.. మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇక్కడ తొలిసారి జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ.. తన జెండా ఎగరేసింది. ఇంకేముంది.. అధికారంలో ఉన్న పార్టీ, కొత్తగా మున్సిపాలిటీ అయింది. ఇక వైరా అభివృద్ధి చెందుతుందని సంబరపడ్డారు ఇక్కడి ప్రజలు. అయితే వారి ఆశలు నెరవేరలేదు. ఎందుకంటే.. ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన ఇంఛార్జ్‌ కమిషనర్లు.. పట్టుమని మూడు నెలలు కూడా ఉండలేదు. ఇప్పటికే ఏడుగురు మారిపోయారు. ఇప్పుడు మణుగూరు కమిషనర్‌గా పనిచేసిన వెంకటస్వామి..వైరాకు ఎనిమిదో కమిషనర్‌గా వచ్చారు. ఆయనైనా ఎంతకాలం ఇక్కడ పనిచేస్తారో అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.

2018 ఆగస్టులో వైరా మున్సిపాలిటీగా అవతరించినప్పటికీ.. ఇంతకాలం ఇంఛార్జ్‌ కమిషనర్లే ఉన్నారు. పంచాయతీల్లో పనిచేసేవారినే.. మున్సిపాలిటీకి అలాట్‌ చేశారు. మొదట జాకీర్‌ హుస్సేన్‌, ఆ తర్వాత MRO సంజీవ్‌, అనంతరం AEకి పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత రాంచంద్రరావు, విజయానంద్, శ్రీనివాస రావు, వెంకటపతి రాజులను ఇంఛార్జ్‌లుగా నియమించారు. అసలు ఇంతమంది మారిపోవడానికి కారణం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక్కడి మున్సిపాలిటీలో ఉద్యోగుల తీరు, రాజకీయాల వల్లే ఎవరూ తమ పని చేసుకోలేకపోతున్నారట. ఇక్కడి వ్యవహారాలను సరిదిద్దడానికి ఓ IAS అధికారి కూడా ప్రయత్నించి.. ఆ తర్వాత చేతులు ఎత్తేశారట.

ఇక్కడ 80 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారి కోసం ప్రతి నెలా పది లక్షలకు  పైగా ఖర్చు అవుతోంది. ఇంతమంది ఉద్యోగులు.. పెద్ద మున్సిపాలిటీల్లో కూడా ఉండకపోవచ్చు. మరోవైపు ఇక్కడ జరుగుతున్న అభివృద్ది పనుల వ్యవహారంలో కాంట్రాక్టర్లకు, వార్డు సభ్యులకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఆ సమస్యను పరిష్కరించడంలో కూడా ఇంఛార్జ్‌ కమిషనర్లు విఫలమయ్యారు. పైగా  మున్సిపాలిటీయై 30నెలలైనా.. వైరాకు రెగ్యులర్‌ కమిషనర్‌ ఎలాట్‌మెంట్‌ జరగలేదు. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన వైరాకు.. ఒక్క మేనేజర్‌ను మాత్రమే అపాయింట్‌ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఇంతకాలం ఇంచార్జి కమిషనర్ల పాలనతో కాలం వెళ్లదీశారు. దీంతో వైరా అభివృద్ధి అనేది ఆమడదూరంలో నిలిచిపోయింది.