ఆ జిల్లా మహిళా ప్రజాప్రతినిధిని మండలానికే పరిమితం చేశారు...?

ఆ జిల్లా మహిళా ప్రజాప్రతినిధిని మండలానికే పరిమితం చేశారు...?

జడ్పీ చైర్‌పర్సన్‌ అంటే జిల్లా అంతటికీ ప్రజాప్రతినిధిగా భావిస్తారు. కానీ.. ఆ జిల్లాలో మాత్రం ఆ మహిళా ప్రజాప్రతినిధిని మండలానికే పరిమితం చేశారట. ఇద్దరు మంత్రులు ఉండగా ఓ మహిళా ప్రజా ప్రతినిధి విషయంలో ఎందుకిలా జరుగుతోంది? అధికార పార్టీలో ఇప్పుడిదే చర్చ!

మంత్రుల మధ్య వార్‌లో నలిగిపోతున్న జడ్పీ చైర్‌పర్సన్‌!

కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు ఎప్పుడెలా ఉంటాయో ఎవరికీ అర్థం కాదు. గంగుల కమలాకర్‌కు మంత్రి  పదవి వచ్చిన తర్వాత మరో మంత్రి ఈటల రాజేందర్‌ కరీంనగర్‌ రావడమే మానేశారు. అధికారిక సమీక్షల్లో తప్ప ఏడాదిగా ఇద్దరూ కలిసి కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు.  ఆ మధ్య ఒకే కారులో ప్రయాణించి తమ మధ్య గ్యాప్‌ లేదని చెప్పినా.. ఇద్దరినీ బ్యాలెన్స్‌ చేయలేకపోతున్నారట లోకల్‌ ప్రజాప్రతినిధులు. ఈ జాబితాలో కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ ఉన్నారని సమాచారం. 

అధికారిక కార్యక్రమాలకు జడ్పీ చైర్‌పర్సన్‌కు ఆహ్వానాలు లేవా? 

మంత్రి ఈటల వర్గానికి చెందిన నేతగా విజయకు గుర్తింపు ఉంది. జడ్పీ చైర్‌పర్సన్‌ హోదాలో ఆమె జిల్లా అంతా పర్యటించే అవకాశం ఉంది. అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ ప్రకారం ముందు వరసలో ఉంటారు. అయినా విజయకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. జిల్లాలోని ఇతర జడ్పీటీసీలు సైతం అధికారిక కార్యక్రమాలకు జడ్పీ చైర్‌పర్సన్‌ను ఆహ్వానించడం లేదట.  కరీంనగర్‌కు కేటీఆర్‌ లేదా మంత్రులెవరైనా వస్తేనే విజయ కనిపిస్తున్నారట. మిగిలిన సమయంలో మండలం దాటి రావడం లేదు. 

అంతా వెళ్లిపోయాక కోవిడ్‌ టెస్ట్‌ సెంటర్‌కు వచ్చిన జడ్పీ చైర్‌పర్సన్‌!

కరీంనగర్‌ సివిల్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ టెస్ట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం జరిగింది. మంత్రి గంగుల కమలాకర్‌, వినోద్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పటికే మంత్రులు వస్తే చెప్పండి అని మూడుసార్లు ఆస్పత్రికి సూపరింటెండెంట్‌కు విజయ ఫోన్‌ చేశారట. కానీ.. ప్రారంభోత్సవం అయిపోయినా జడ్పీ చైర్‌పర్సన్‌కు ఫోన్‌ చేయలేదట ఆస్పత్రి వర్గాలు. ఆ విషయం తెలియని ఆమె అంతా వెళ్లిపోయాక వచ్చారట. దీంతో అవమానంగా భావించిన ఆమె ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలలో జడ్పీ చైర్‌పర్సన్‌ను పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. 

ఈటల, గంగుల మధ్య వైరం వల్లే గౌరవం ఇవ్వడం లేదా?

కరీంనగర్‌లో ఐటీ టవర్‌ ప్రారంభించేందుకు మంత్రి  కేటీఆర్‌ రాగా.. పార్టీ వర్గాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎక్కడా విజయ ఫొటో లేదని సోషల్‌ మీడియాలో ప్రచారం ఓ రేంజ్‌లో సాగింది. జడ్పీ సమావేశాల్లోనూ అధికారులు గౌరవం ఇవ్వడం లేదని విజయే స్వయంగా ఆగ్రహం వ్యక్తంచేసిన సందర్భాలు ఉన్నాయి. విజయ విషయంలో ఎందుకిలా జరుగుతుంది అని ఆరా తీసిన వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయట. మంత్రులు ఈటల, గంగుల మధ్య ఉన్న వైరం వల్లే జడ్పీ చైర్‌పర్సన్‌కు గౌరవం ఇవ్వడం లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

మండలంలోనే ఉండిపోతున్నట్టు బదులిచ్చిన విజయ!

ఆ మధ్య మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ కరీంనగర్‌ వచ్చారు. అక్కడికి వచ్చిన  జడ్పీ చైర్‌పర్సన్‌ను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి  కనిపించడం లేదేంటి మేడమ్‌ అని ప్రశ్నించారు. ఏం వస్తాంలే అన్నా.. నా మండలంలోనే ఉంటున్నా అని విజయ బదులిచ్చారు. దీంతో ఏదో జరుగుతోందని ఆరా తీయగా.. ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయట. ఇప్పటికే దీనిపై సోషల్‌ మీడియాలో ఓ వర్గం ఏకిపారేస్తోంది. మరి.. పార్టీ పెద్దలు ఈ సమస్యను పరిష్కరిస్తారో లేదో చూడాలి.