ఎమ్మెల్యే కంటే అనుచరులదే పెత్తనమా? క్యాంపు ఆఫీస్ అడ్డాగా మారిందా?

ఎమ్మెల్యే కంటే అనుచరులదే పెత్తనమా? క్యాంపు ఆఫీస్ అడ్డాగా మారిందా?

అక్కడ ఎమ్మెల్యే కంటే అనుచరుల పెత్తనమే ఎక్కువట. క్యాంప్‌ ఆఫీసునే అడ్డాగా చేసుకుని.. పైరవీలు చేయడంలో.. కమీషన్లు పిండుకోవడంలో ఆరితేరిపోయారని ప్రజల టాక్‌. ఇవన్నీ ఎమ్మెల్యేకు తెలిసే చేస్తున్నారా? లేక అనుచరులను కట్టడి చేయలేక ఆయన మౌనంగా ఉండిపోతున్నారో కానీ వివాదాలు మాత్రం ఏ రేంజ్‌లో ముసురుతున్నాయి. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

అనుచరుల వైఖరితో నిత్యం వివాదాల్లో ఎమ్మెల్యే కందాల!

ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కార్యాలయం మధ్యవర్తుల ఆగడాలకు  కేంద్రంగా మారిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎమ్మెల్యే మెతక వైఖరని క్యాష్‌ చేసుకోవడంలో అనుచరులు ఏమాత్రం వెనకాడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ వైఖరే ఎమ్మెల్యేను నిత్యం వివాదాల్లో ఉండేలా చేస్తుందని చెవులు కొరుక్కుంటున్నారు జనం. ఒక మహిళా కౌలు రైతు ఆత్మహత్యాయత్నంతో కందాలతోపాటు ఆయన అనుచరులు మరోసారి చర్చల్లోకి వచ్చారు. 

జనాలతో ఎప్పడూ రద్దీగా ఎమ్మెల్యే ఆఫీసు!
 
గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కందాల ఉపేందర్‌రెడ్డి.. మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్‌ కోసం  ప్రయత్నించి విఫలం అయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కరుణించడం.. కందాల పోటీ చేయడం.. గెలుపొందడం చకచకా జరిగిపోయాయి. ఎంత వేగంగా ఎమ్మెల్యే అయ్యారో.. అంతే వేగంగా కాంగ్రెస్‌ కండువా తీసేసి... టీఆర్‌ఎస్‌ కండువా కప్పేసుకున్నారు కందాల. ఆయన ఆఫీసు ఎప్పుడు జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎవ్వరు ఏది అడిగినా సంబంధిత శాఖకు అప్పటికప్పుడే ఫోన్‌ చేసి మాట్లాడతారు ఎమ్మెల్యే. 

శ్రుతి మించుతున్న పైరవీలు.. చిక్కుల్లో కందాల!

ఇంత వరకు బాగానే ఉన్నా.. అనుచరులు మాత్రం ఎమ్మెల్యే కందాలకు తలనొప్పిగా మారినట్టు చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసు మధ్యవర్తులకు కేంద్రంగా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. నేలకొండపల్లి, కూసుమంచి మండలాలకు చెందిన నాయకులు  పైరవీలకే ప్రాధాన్యం ఇస్తున్నారట. ఈ లాబీయింగ్‌లు  శ్రుతిమించి వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు కందాల. 

కమీషన్లు పిండుకోవడంలో ఆరితేరిన అనుచరులు!

పోలీస్‌ స్టేషన్‌ కంటే ఎమ్మెల్యే కందాల క్యాంప్‌ ఆఫీస్‌ పవర్‌ఫుల్‌ అన్న ప్రచారం ఉంది. డీలింగ్స్‌ అన్నీ ఇక్కడ నుంచే సాగుతాయట. గ్రామ పంచాయతీలో ఏ పనులు చేపట్టాలో ఆదేశాలు క్యాంప్‌ ఆఫీస్‌ నుంచే వెళ్తాయట. వివాదాల పరిష్కరించి.. కమీషన్లు పిండుకోవాలని అనుచరులు చూపించే ఆత్రుత ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇటీవల జరిగిన ఘటనే అద్దం పడుతుందని చెబుతారు. 

ఎన్నికల్లో ఎమ్మెల్యేకు సాయపడిన వ్యక్తికే వార్నింగ్‌!

నేలకొండపల్లి మండలం బోదులబండలోని ఓ పంటపొలంలో ఇద్దరు కూలీలు చనిపోయారు. పొలం యజమాని 6 లక్షల పరిహారం చెల్లించాలన్న తగువు క్యాంప్‌ ఆఫీసుకు వచ్చింది. రైతు అంత ఇచ్చుకోలేని చెబితే.. ఈ సమస్యకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిని ఆ మొత్తం ఇవ్వాలని ఆదేశించారట ఎమ్మెల్యే అనుచరులు. సదరు మధ్యవర్తి ఎన్నికల్లో కందాల గెలుపుకోసం పనిచేసిన వ్యక్తుల్లో ఒకరు. అయినా ఎమ్మెల్యే అనుచరులు హెచ్చరికలకు ఆయన ఆశ్చర్యపోయారట. ఈ వివాదంలో వేధింపులు తాళలేక మహిళా రైతు ఎమ్మెల్యే ఎదురుగానే పురుగుల మందు తాగడంతో అంతా బిత్తరపోయారట. 

క్యాంప్‌ ఆఫీసు వేదికగా జరుగుతున్న ఈ పంచాయితీలు, సెటిల్మెంట్లు ఎమ్మెల్యే కందాలకు తెలిసే జరుగుతున్నాయా లేక అనుచరులను ఆయన కట్టడి చేయలేకపోతున్నారా అన్న చర్చ కూడా మొదలైంది. మరి.. వీటికి ఎమ్మెల్యే ఏం సమాధానం చెబుతారో చూడాలి.