టీడీపీ పార్టీ పూర్వ వైభవం జూనియర్ ఎన్టీఆర్ తో సాధ్యమేనా..?

టీడీపీ పార్టీ పూర్వ వైభవం జూనియర్ ఎన్టీఆర్ తో సాధ్యమేనా..?

మళ్ళీ అదే చర్చ. జూనియర్ ఎన్టీఆర్‌ టీడీపీలోకి రావాలని.. పార్టీ తరఫున ప్రచారం చేయాలనే డిమాండ్ తెరపైకి తెచ్చారు తెలుగు తమ్ముళ్లు. కుప్పం కంచుకోటలోనే అధినేత ఎదుట జూనియర్ రావాలంటూ చేసినా నినాదాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. మరికొందరు లోకేష్‌ను పంపాలని అధినేతకు అడుగడుగునా  అడ్డుతగిలారు. టీడీపీ లేవాలంటే జూనియర్‌ రావాల్సిందేనా? పార్టీని నడపటానికి చినబాబు.. ప్రచారానికి ఎన్టీఆర్ కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? 

జూనియర్ ఎన్టీఆర్‌  ప్రచారానికి రావాలని తమ్ముళ్ల డిమాండ్‌!

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పల్లెపోరులో అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చామని ప్రతిపక్ష పార్టీ చెబుతున్నప్పటికీ.. టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనన్న వాదన పార్టీలో ఒక వర్గం ముందుకు తెస్తోంది. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆ పార్టీ కార్యకర్తలు చేసిన నినాదాలే నిదర్శనం. కుప్పం అసెంబ్లీ పరిధిలో మెజార్టీ పంచాయతీలను కైవశం చేసుకున్న వైసీపీ.. చంద్రబాబుకు షాకిచ్చింది. దీంతో ఫలితాలు వచ్చిన వారంలోపే కుప్పం వచ్చిన టీడీపీ అధినేత మూడు రోజులపాటు పర్యటించారు. ఈ పర్యటనలో చంద్రబాబుకు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఊహించని అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ప్రచారానికి రావాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతీ ఫ్లెక్సీలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కనిపించాయి. గతంలో ఇంత ప్రముఖంగా కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్‌ ఫొటోలను ఫ్లెక్సీలపై, బ్యానర్లపై టీడీపీ శ్రేణులు వినియోగించిన సందర్భాలు లేవు. ఈసారి మాత్రం.. చంద్రబాబు, లోకేష్, బాలయ్య ఫొటోలతో పాటు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను ఏర్పాటు చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది.

2009లో టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్‌ ప్రచారం!

కేడర్ మాట ఎలా ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు. గతంలో మహాకూటమి తరఫున జూనియర్ ఊరూరా పర్యటించి తనదైన శైలిలో ప్రసంగాలు దంచికొట్టారు. రాజకీయ ప్రసంగాల్లో జూనియర్ ఎన్టీఆర్ స్టైల్‌ అప్పట్లో బాగానే సక్సెస్‌ అయింది. అయితే అవన్నీ 2009 ఎన్నికలకు మాత్రమే పరిమితం అయ్యాయి. 2014, 2019 ఎన్నికలలో ప్రచారానికి దూరంగానే ఉన్నారు జూనియర్. కుటుంబంలో తలెత్తిన విబేధాల వల్లే ఎన్టీఆర్ దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అప్పట్లో కేవలం ప్రెస్‌మీట్ పెట్టిన ఎన్టీఆర్‌..తాను టీడీపీతోనే ఉన్నానని చెప్పారే తప్ప ప్రచారానికి రాలేదు. 

చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారా?
కార్యకర్తల డిమాండ్‌పై ఒక్క మాట మాట్లాడలేదు!

ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలతోపాటు పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో టీడీపీ శ్రేణులు కొంత డీలా పడ్డాయి. పార్టీ పరిస్థితి చెప్పుకోదగ్గ విధంగా లేని ప్రతి సందర్భంలోనూ జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా తెరపైకి వస్తోంది. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జూనియర్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. జూనియర్ వస్తారని కానీ.. రారని కాని సంకేతాలివ్వడం లేదు. కుప్పం పర్యటనలో మాత్రం జూనియర్  సేవలను వినియోగించుకునేందుకు ఇంకా సమయం ఉందన్నట్టుగా చంద్రబాబు హావభావాలు స్పష్టం చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ రావాలని కార్యకర్తలు నినాదాలు చేసిన సందర్భంలో.. ఆ నినాదాలు చంద్రబాబు చెవిన పడినప్పటికీ తలూపారే తప్ప ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇదే టూర్‌ను ముగిస్తున్న సందర్భంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జూనియర్ రీఎంట్రీ ఇప్పట్లో ఉండదని స్పష్టం చేశాయి. అవసరమైతే మళ్లీ మళ్లీ వస్తానని, లోకేష్ కూడా వస్తారని చెప్పిన చంద్రబాబు ఎన్టీఆర్‌ పేరును మాత్రం ప్రస్తావించలేదు. టీడీపీ వారసత్వం ప్రస్తుతానికి లోకేష్‌దేనన్న స్పష్టతను కుప్పం సాక్షిగా చంద్రబాబు పార్టీ శ్రేణుల్లోకి పంపడం విశేషం. 

టీడీపీకి పూర్వవైభవం జూ.ఎన్టీఆర్‌తో సాధ్యమని కొందరి అభిప్రాయం!

ఎన్టీఆర్‌ రావాలని అధినేత వద్ద డిమాండ్ చేయడానికి గల కారణాలు గట్టిగానే చెబుతున్నారు తమ్ముళ్లు. ప్రత్యర్థి పార్టీలకు సరైనా కౌంటర్ ఇవ్వడంలో ఇప్పుడు నేతల సరిపోవడం లేదన్నది వారి ప్రధాన మాటగా తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ ఉన్నా.. వారిని మంత్రి కొడాలి నాని లాంటి నేతలు ఒక ఆట ఆడుకుంటున్నారు. గతంలో పలుచోట్ల ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత ఎన్టీఆర్ అవసరం పార్టీకి చాలా ఉందని కొంతమంది  కామెంట్‌ చేశారు. పార్టీకి పూర్వవైభవం ఎన్టీఆర్‌తోనే సాధ్యమని చెప్పారు కూడా. కానీ ఈ డిమాండ్లపై అటు ఎన్టీఆర్ గానీ.. ఇటు చంద్రబాబుగానీ స్పందించలేదు. 

చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు కొన్ని శక్తుల యత్నమా?

అయితే ఇదంతా నిజంగా టీడీపీ కేడర్‌లో ఉన్న అభిప్రాయమా లేక ఒకవర్గం పనికట్టుకుని చేస్తున్న ప్రచారమా అని పార్టీ అధిష్ఠానం అంచనా వేస్తోంది. పార్టీకి ఇబ్బందులు వచ్చిన ప్రతిసారీ జూనియర్‌ పేరు తెరపైకి తెచ్చి చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని టీడీపీ సీనియర్లు అంటున్నారు.  ఇప్పుడు కుప్పం పరాజయాన్ని కూడా అలాంటి అవకాశంగానే మార్చుకున్నారని.. దీనికి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని  చంద్రబాబు సన్నిహితులు చెబుతున్నారు.