జైలు పక్షిలా మారిన జేసీ ప్రభాకర్ రెడ్డి !

జైలు పక్షిలా మారిన జేసీ ప్రభాకర్ రెడ్డి !

కలలో కూడా ఊహించని విధంగా.. 54 రోజుల జైలు జీవితం చూశారు.  బెయిల్‌ వచ్చిన 24 గంటల్లోనే మళ్లీ అరెస్ట్‌ అయ్యారు. ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికే వెళ్లారు. నాటి ఘీంకారాలు ఇప్పుడు వినిపించడం లేదు. భయపడ్డారా? బెదిరిపోయారా?  వేడుకోలు.. విజ్ఞప్తుల దాకా వచ్చారా? 
 
54 రోజులు కడప జైలులో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి!

జేసీ దివాకర్‌రెడ్డి సోదరుల పరిస్థితి కుడితిలోపడ్డ ఎలుకలా తయారైంది. అధికారంలో ఉండగా మేము ఏ తప్పు చేయలేదు.. దమ్ముంటే విచారణ చేయించుకోవాలని మొన్నటి వరకు సవాళ్లు విసిరారు. ఆ సవాళ్ల ఫలితమో ఏమో కానీ.. జైలు బాట పడుతున్నారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో JC ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు జూన్ 13న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. దాదాపుగా 54 రోజులుపాటు కడప సబ్‌ జైలులో ఉన్నారు. JC సోదరులు ఊహించినట్లుగానే ఆర్థిక మూలాలపై దెబ్బపడింది. కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. దాదాపు 30కిపైగా కేసులు ఉన్నట్లు సమాచారం.
 
కొత్త కేసులో 24 గంటల్లో అదే జైలుకు వెళ్లక తప్పలేదు!

రాజకీయాల్లో కొన్ని లెక్కలు, ఫార్ములాలు ఉంటాయి. అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క.. లేనప్పుడు మరో లెక్క ఉంటుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేసీ బ్రదర్స్ మాత్రం ఈ ఫార్ములా మిస్ అయ్యారనేది టాక్‌. దశాబ్దాలుగా ఒంటి చేత్తో రాజకీయాలను శాసిస్తున్న ఈ సోదరులకు 2019ఎన్నికలు బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చాయి. ఎన్నికల్లో ఓడినా అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలానే వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో ఒక కేసు నుంచి కోలుకునే లోపు మరో కేసు ఇలా వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 54రోజుల తర్వాత బెయిల్‌పై వచ్చినా.. 24గంటల్లోనే తిరిగి మరో కొత్త కేసులో అదే జైలుకు వెళ్లక తప్పలేదు. 
 
ఆ ఘటన జరుగుతున్నప్పుడే అంతా ఊహించారు!

టీడీపీ హాయంలో నేరుగా జగన్ టార్గెట్ చేస్తూ మాట్లాడమే ఈ పరిణామాలకు కారణమనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. బెయిల్ వచ్చిన తర్వాత కడప నుంచి తాడిపత్రి వరకు అనుచరులు భారీ కాన్వాయి ఏర్పాటు చేశారు. కోవిడ్ ఉందని.. ర్యాలీ వద్దని పోలీసులు హెచ్చరించినా JC అనుచరులు లెక్క చేయలేదు. ఇదే సమయంలో బొందలదిన్నెలో జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అంతేనా..  కావాలంటే కేసులు పెట్టుకో.. మళ్లీ జైలుకు పంపుతారా పంపుకో అంటూ ప్రభాకర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఆ ఘటన జరుగుతున్నప్పుడే అంతా ఊహించారు.  మళ్లీ ప్రభాకర్‌రెడ్డి మీద కేసు అవుతుందని.
 
అసలు విషయం బోధ పడని ప్రభాకర్‌రెడ్డి పోలీసులపై ఫైర్‌ అయ్యారా?

అసలే JC ఫ్యామిలీ అంటేనే YCP నేతలు మండిపడుతున్నారు.  అధికారంలో ఉండగా JC బ్రదర్స్‌ చేసిన కామెంట్స్‌ అలాంటివి మరి.  దానికి తగ్గట్టే అక్రమ రిజిస్ట్రేషన్ల కేసును  పోలీసులు తవ్వి తీశారు.  జైలుకు పంపారు. అయినా అసలు విషయం బోధ పడని ప్రభాకర్‌రెడ్డి.. తనదైన శైలిలో పోలీసుల మీద ఫైర్‌ అయ్యారు.  కట్‌ చేస్తే.. మళ్లీ కేసులు, మళ్లీ జైలు. SC, ST అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపించేశారు. 
 
దెబ్బ బాగానే తగిలినట్టుంది అని అనుకున్నారా?  

బాబాయ్‌ అరెస్ట్‌తో అబ్బాయి పవన్‌రెడ్డి షాక్‌కు గురయ్యారు. అరెస్ట్‌ అన్యాయం అక్రమం అంటూనే కరోనా సమయంలో ఈ అరెస్ట్‌లు ఏంటి? ప్రభుత్వం, ప్రజలు ఆలోచించాలి అంటూ బీద పలుకులు పలికారు.  పవన్‌ తీరు చూసిన వాళ్లు.. దెబ్బ బాగానే తగిలినట్టుంది అని అనుకున్నారట.  ఒకప్పుడు JC అంటే పొలిటికల్‌గా బ్రాండ్‌. ఇప్పుడు అదే బ్రాండ్‌ మసకబారిపోతోంది.  ఇంత జరుగుతున్నా పెద్ద JC నోరు విప్పడం లేదు. అప్పుడెప్పుడో తమ్ముడు అరెస్ట్‌ అయినప్పుడు కనిపించిన దివాకర్‌రెడ్డి ఆ తర్వాత మళ్లీ కనిపించినైనా లేదు.  జరుగుతున్న పరిణామాలను చూసే దివాకర్‌రెడ్డి సైలెంట్‌ అయ్యారని అంటున్నారు.  పాపం అన్న దివాకర్‌రెడ్డి టాక్టీస్‌.. తమ్ముడికి వంటబట్టినట్టు లేదు. అందుకే మళ్లీ జైలు బాటపట్టారని అనుకుంటున్నారు ఆయన ప్రత్యర్థులు.