టైం బ్యాడ్ గా ఉన్న జేసీ బ్రదర్స్ తగ్గడం లేదా...?

టైం బ్యాడ్ గా ఉన్న జేసీ బ్రదర్స్ తగ్గడం లేదా...?

రాజకీయాల్లో బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్‌ అయితే.. ఎంతటి ఉద్దండులైనా చిక్కుల్లో పడతారు. దానికి ఆ సోదరులే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం విపక్షంలో ఉన్న ఆ బ్రదర్స్‌.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నంతలోనే కేసుల మీద కేసులు వచ్చి పడుతున్నాయి. రాజకీయవర్గాల్లోనూ చర్చకు కారణం అవుతున్నారు. ఇంతకీ ఎవరా సోదరులు? ఏంటా కేసులు? 

కన్నెత్తి చూసినా... నోరు విప్పి మాట్లాడినా కేసే!

JC బ్రదర్స్‌. పెద్దగా పరిచయం అక్కర్లేని నాయకులు. వీళ్లు ఏం చేసినా.. ఏం మాట్లాడినా డిఫరెంట్‌గానే ఉంటుంది. ప్రస్తుతం వరసగా కేసుల్లో ఇరుక్కుంటున్న JC బ్రదర్స్‌ తీరు కూడా అంతే వినూత్నంగా ఉంది. JC సోదరుల్లో ఒకరైన దివాకర్‌రెడ్డి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి అంతే. రాయలసీమలో ఫ్యాక్షన్‌ గడ్డ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వీళ్ల తీరు రొటీన్‌ పొలిటికల్‌ లీడర్స్‌ కంటే భిన్నంగా ఉంటుంది. ఒకప్పుడు అనంతపురం జిల్లాను కనుసైగలతో శాసించారు ఈ ఇద్దరు సోదరులు. అలాంటిది ఇప్పుడు కన్నెత్తి చూసినా... నోరు విప్పి మాట్లాడినా క్షణాల్లో కేసుల్లో బుక్కయిపోతున్నారు. 

అప్పట్లో దివాకర్‌రెడ్డి వర్సెస్‌ పోలీస్‌ అధికారుల సంఘం!

విపక్ష నాయకులు కాబట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసులు పెడుతున్నారని అనుకున్నా.. వాటిల్లో కొన్ని జేసీ సోదరుల స్వయంకృతం కూడా ఉన్నాయి. పోలీసులు అడ్డుకుంటే చాలు సర్రున లేస్తారనే ముద్ర ఉంది. ఆ క్రమంలో వచ్చి పడుతున్న కేసులు.. అరెస్ట్‌లు కామనైపోయాయి. రెండేళ్ల క్రితం ప్రబోధానంద ఆశ్రమం దగ్గర గ్రామస్తులు, భక్తులకు మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు దివాకర్‌రెడ్డి. ఆ ఎపిసోడ్‌లో కొన్నాళ్లపాటు JC వర్సెస్‌ పోలీసు అధికారుల సంఘం మధ్య  మాటల యుద్ధం నడిచింది. కాలం గిర్రున తిరిగొచ్చే సరికి నాడు దివాకర్‌రెడ్డిపై మీసం మెలేసి సవాల్‌ చేసిన CI గోరంట్ల మాధవ్‌ నేడు వైసీపీ ఎంపీ అయ్యారు. దివాకర్‌రెడ్డి మాజీగా మిగిలారు.  

ప్రభాకర్‌రెడ్డిని రెండుసార్లు అరెస్ట్‌ చేసి కడప జైలులో వేశారు!

పార్టీ అధికారంలో లేదు. చేతిలో పవర్‌ లేదు. అయినా వెనక్కి తగ్గితే బాగోదని అనుకున్నారో ఏమో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై విరుచుకుపడ్డారు దివాకర్‌రెడ్డి. నాడు ఆయన చేసిన ఆ వ్యాఖ్యలపై కేసు నమోదైంది. బెయిల్‌ కోసం గంటల కొద్దీ స్టేషన్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఆ దెబ్బతో కొంత కామై.. వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయారు. ఈసారి తమ్ముడు JC ప్రభాకర్‌రెడ్డి వంతు వచ్చింది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాడిపత్రి నుంచి తీసుకెళ్లి కడప జైల్లో వేశారు. 50 రోజుల తర్వాతగానీ బెయిల్‌ రాలేదు. బెయిల్‌ వచ్చిందన్న సంతోషంలో భారీ కాన్వాయ్‌తో తాడిపత్రి వెళ్లారు. కరోనా నిబంధనల ప్రకారం ర్యాలీకి అనుమతి లేదన్న CIతో వాగ్వాదానికి దిగారు ప్రభాకర్‌రెడ్డి. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన CIను దూషించడంపై SC ST అట్రాసిటీ కేసు పెట్టి ప్రభాకర్‌రెడ్డిని రెండోసారి అరెస్ట్‌ చేసి అదే కడప జైలుకు తరలించారు. 

దీక్షకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై దివాకర్‌రెడ్డి ఫైర్‌!

తాడిపత్రి తాజా ఎపిసోడ్‌తో రగిలిపోతున్న జేసీ బ్రదర్స్‌ దీక్ష చేయాలని అనుకుంటే... పోలీసులు అనుమతి ఇవ్వలేదు. జూటూరులోని ఫామ్‌ హౌస్‌ నుంచి బయటకొస్తున్న దివాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా పెద్ద రగడే జరిగింది. తమను దివాకర్‌రెడ్డి అసభ్య పదజాలంతో తిట్టారని ఏకంగా DSP ఆయనపై ఫైర్‌ అయ్యారు. పెద్దాయనపై కేసు పెట్టారు. ఈ పరిణామాలను చూసిన వారికి మాత్రం JC బ్రదర్స్‌కు వదల బొమ్మాళి అన్నట్టు కేసులు వెంటాడుతున్నాయని  కామెంట్స్‌ చేస్తున్నారు. విషయం ఏదైనా అది అటు తిరిగి ఇటు తిరిగి  కేసుల దగ్గరే ఎండ్‌ అవుతోంది. గ్యాప్‌ దొరికినంత సేపు పట్టడం లేదు కొత్త కేసు నమోదు కావడానికి. మరి.. ప్రస్తుత రాజకీయాల్లో ఇదే ఒరవడి కొనసాగిస్తారో.. టైమ్‌ మనది కాదని వెనక్కి తగ్గుతారో చూడాలి.