GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు కొత్త కష్టం..!

GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు కొత్త కష్టం..!

ఒకరి ఎత్తుగడ మరొకరి నెత్తిన పాలు పోస్తుంది. ఇంకొకరి నెత్తిన నీళ్లు కూడా పోస్తుంది. మహిళ అభ్యున్నతి, రాజకీయాధికారం పేరిట GHMCలో 50 శాతం టికెట్లు మహిళలకు ఇవ్వాలని TS సర్కార్‌ చట్టం చేయడంతో.. ప్రతిపక్షాలు ఇరుకునపడ్డాయి. మహిళా నేతలు దొరక్క.. భూతద్దాలు వేసి వెతుక్కుంటున్నాయి. చాలా మంది భర్తలు వాళ్ల భార్యలకు టికెట్లు ఇప్పించే పనిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌లోనూ భార్యల టికెట్ల కోసం భర్తలకు నానాపాట్లు తప్పడం లేదు. 

అధికార పార్టీ వ్యూహంపై రాజకీయవర్గాల్లో చర్చ!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. బలంగా ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ను ఈ ఎలక్షన్స్‌లో శక్తిమేరా ఢీకొట్టాలన్నది కాంగ్రెస్‌, బీజేపీల ఆలోచన. అయితే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చివరిక్షణంలో విసిరిన పాచిక ఆ రెండు పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. ఈ అంశంపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. 

మహిళలకు ఇచ్చే 50 శాతం సీట్లకు చట్టబద్ధత?

చట్ట ప్రకారం GHMCలో 33 సీట్లు మహిళలకు రిజర్వ్‌ చేయాలి. కానీ 2016లో జరిగిన GHMC ఎన్నికల్లో దాదాపు 50 శాతం సీట్లు మహిళలకు ఇచ్చారు ముఖ్యమంత్రి.  ఇప్పుడు ఆ 50 శాతం సీట్లకు చట్టబద్దత కల్పించడం ద్వారా కాంగ్రెస్‌, బీజేపీలను ఇరకాటంలో పడేస్తున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. అంటే 150 డివిజన్లు ఉన్న GHMCలో 75 డివిజన్లు మహిళలకే దక్కుతాయి.

డివిజన్లలో టీఆర్‌ఎస్‌కు బలమైన మహిళా నేతలు సిద్ధం!

ప్రస్తుతం GHMC కౌన్సిల్‌లో TRSకు 79 మంది.. MIMకు 19 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆలోచన తెలిసిన అధికార పార్టీ డివిజన్లలో బలమైన మహిళా నేతలను సిద్ధం చేసిందట. ఇప్పుడున్నవారిపై వ్యతిరేకత ఉంటే.. ఆమేరకు మరో శక్తిమంతమైన మహిళా నేతకు టికెట్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అదీ కాకుండా GHMC ఎన్నికల్లో రిజర్వేషన్ల వల్ల పోటీకి వీలుపడని నాయకులు... భార్య లేదా ఇతర కుటుంబ సభ్యులను రంగంలోకి దించేందుకు గ్రౌండ్ ప్రిపేర్‌ చేసుకుంటున్నారట. 

బీజేపీ, కాంగ్రెస్‌లకు బలమైన మహిళా అభ్యర్థులు ఉన్నారా? 

మరి.. బీజేపీ, కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటి? దాదాపు 75 మంది బలమైన మహిళా నేతలను ఎంపిక చేసుకోగలవా? అధికార పార్టీని ఢీకొట్టేంత ఆర్థిక, అంగబలం కలిగిన మహిళలు విపక్ష పార్టీలకు ఈ తక్కువ సమయంలో లభిస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయట. ఈ వ్యూహం తెలిసినప్పటి నుంచీ తమ దగ్గరా బలమైన మహిళా అభ్యర్థులు ఉన్నారని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు పైకి ప్రకటనలు చేస్తున్నా.. ప్రైవేట్‌ సంభాషణల్లో మాత్రం వారి మాటలు మరోలా ఉన్నాయట. బలమైన మహిళా అభ్యర్థుల కోసం దేవులాడాల్సిన పరిస్థితి ఉందని కామెంట్స్‌ చేస్తున్నారట. 

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు సింగిల్‌ డిజిట్‌!

ఈ ఇబ్బంది MIMకు కూడా ఉన్నా.. గత ఎన్నికల్లోనూ దీనిని కొంత మేరకు అధిగమించింది. ఇప్పుడు కూడా స్థానికంగా పేరు సంపాదించుకున్న వివిధ వర్గాల నేతలకు టికెట్లు ఇచ్చి బరిలో దింపుతుందని అనుకుంటున్నారు.  గత GHMC ఎన్నికల్లో అధికార పార్టీ వ్యూహం ముందు విపక్ష పార్టీలు చిత్తయ్యాయి. 99 సీట్లు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని గులాబీ శిబిరం లెక్కలు వేసుకుంటోంది. ఆ మేరకు డివిజన్ల వారీగా ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. నాటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ ఇస్తామన్న పార్టీలన్నీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యాయి. బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 3, టీడీపీ నుంచి ఒక కార్పొరేటర్‌ గెలిచారు. మరి.. ఇప్పుడు ఏ మేరకు శక్తిని కూడదీసుకుంటాయో.. లేక తాజా ఎత్తుగడలకు చిత్తవుతాయో చూడాలి.