గంటానే టీడీపీని వదిలేశారా? టీడీపీనే గంటాను పక్కనపెట్టిందా?

గంటానే టీడీపీని వదిలేశారా? టీడీపీనే గంటాను పక్కనపెట్టిందా?

ఆయన 20ఏళ్ల రాజకీయ జీవితం వడ్డించిన విస్తరి. పదవులు, పవర్ ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారు. స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా తాను అందరిపక్షం అని చెప్పుకొంటారు. అలాంటి నేత ఇప్పుడు నమ్మకం-అపనమ్మకం మధ్య చిక్కుకుపోయి నలిగిపోతున్నారట. ఇంతకీ ఆయన పార్టీని వదిలేశారా...!!. పార్టీనే ఆ మాజీ మంత్రిని పక్కకు పెట్టేసిందా..!!?

ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నానో చెప్పుకోలేని పరిస్థితి!

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచు వినిపించే పేరు. టీడీపీకి చెందిన ఈ సీనియర్ నేత పొజిషన్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా తన పేరు జనం నోట్లో నానాలని కోరుకుంటారు. రాజకీయం అవసరాలకు అనుగుణంగా పార్టీలు మారుస్తారనే విమర్శలు ఉన్నాయి. తన 20 ఏళ్ల పొలిటికల్ కెరీర్‌ను నల్లేరుపై నడకలా సాగించిన గంటాకు 2019 తర్వాత రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ హవాను సైతం ఎదుర్కొని నిలబడ్డ ఆయన ఇప్పుడు తాను ఏ పార్టీలో ఉన్నానో చెప్పుకోలేని పరిస్థితి. 

కొంతకాలం రాజకీయ ఊహాగానాలకు దూరం?

ఎన్నికల తర్వాత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరిపోతారని ప్రచారం జరిగింది. ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో వర్కవుట్ అయినప్పటికీ పలు ముహుర్తాలు దాటిపోయాయి. అనుకున్న పని ఆలస్యం అవడంతో కొంతకాలం రాజకీయ ఊహాగానాల నుంచి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నారట. 

టీడీపీ ఝలక్‌ ఇవ్వడంపై చర్చ!

కాలం కలిసివచ్చే వరకు రాజకీయాల్లోకి రాక ముందు షిప్పింగ్ కంపెనీ నడిపిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మళ్లీ కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టారు. విజయదశమి రోజున సొంత కంపెనీ ప్రారంభించి ఆ వ్యవహారాలను పర్యవేక్షించే పనిలో నిమగ్నమయ్యారు ఈ మాజీ మంత్రి. రాజకీయాల్లో ఎత్తులే కానీ పల్లాలు చూడని గంటాకు ఈ సమయంలో  టీడీపీ ఝలక్ ఇవ్వడం చర్చకు దారితీస్తోంది. 

రెండొందల మందితో వేసిన జంబో కమిటీలోనూ పేరు లేదు!

ఎమ్మెల్యే, ఎంపీ..మంత్రిగా గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే ఎక్కువ పదవులు అనుభవించారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కోవిడ్‌ తర్వాత పార్టీతో గ్యాప్‌ మరింత పెరిగింది. ఇంతకాలం టీడీపీకి గంటా గ్యాప్‌ మెయింటైన్‌ చేస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ.. ఇప్పుడు టీడీపీనే గంటాను దూరం పెట్టిందనే ప్రచారం మొదలైంది. ఇటీవల  ప్రకటించిన టీడీపీ కమిటీలలో వేటిల్లోనూ గంటాకు చోటు కల్పించలేదు. 221 మందితో వేసిన ఏపీ టీడీపీ జంబో కమిటీలోనూ ఈ మాజీ మంత్రికి చంద్రబాబు ఎందుకు అవకాశం ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. 

పదవి ఇచ్చాక పార్టీ మారితే అల్లరి అవుతామనుకున్నారా?

అడిగిన వారికీ అడగని వారికీ పార్టీ కమిటీలలో అవకాశాలు లభించాయి. ఉత్తరంలో గంటాకు చోటులేకపోయినా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు సహా ముగ్గురిని కమిటీలలోకి తీసుకుంది అధిష్ఠానం. టీడీపీతో గంటాకు పూర్తిస్థాయిలో బలహీనపడ్డ సంబంధాలకు ఇది నిదర్శనమనే అభిప్రాయం ఉంది.  ముందునుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ దోబూచులాడట౦.. పార్టీ మారతార౦టూ జరిగిన ప్రచారం.. ఒకవేళ పదవి ఇస్తే రేపొద్దున పార్టీని వీడితే అల్లరిపాలవుతామనే ఆలోచనలతోనే TDP అధిష్ఠాన౦ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. 

విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే సంఖ్య రెండుకు కుదింపు!

గంటా వంటి నేతలు పదవులు ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఉండే ప్రత్యేక జాబితా నాయకులనే విసుర్లు పసుపుపార్టీలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో తమ ఎమ్మెల్యేల సంఖ్యను రెండుకు కుదించుకున్న టీడీపీ.. ఈ ఊరుకి ఆ ఊరు ఎ౦త దూరమో.... ఆ ఊరుకి ఈ ఊరు అ౦తే దూరమనే సంకేతాలు పంపేందుకే గంటాను లైట్ తీసుకుందనే టాక్ నడుస్తోంది.