చిట్టి నోరు తెరిస్తే అంతే సంగతి..!

చిట్టి నోరు తెరిస్తే అంతే సంగతి..!

ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే. మంత్రులను ద్వేషిస్తారు... ఎంపీలను  పట్టించుకోరు. చివరకు తన వెంట ఉండే నాయకులు, కార్యకర్తలపై కూడా నోరు పారేసుకుంటారు. ఈ వైఖరి వల్లే అధిష్ఠానం అక్షింతలు వేసినా ఆయనలో మార్పు రాలేదట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథ? 

వైసీపీలో ఎమ్మెల్యే చిట్టిబాబు వైఖరిపై చర్చ!

కొండేటి చిట్టిబాబు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే. రాజకీయంగా ఎంత దూకుడుగా ఉంటారో.. ఆయన నోటి దురుసు కూడా అంతేనని అంటారు. ఈ వైఖరివల్లే అనేకసార్లు చిక్కుల్లో పడ్డారు కూడా. తన శైలి మార్చుకుంటే జనాలు మర్చిపోతారని అనుకున్నారో ఏమో.. పాత పద్ధతిలోనే వెళ్తున్నారట చిట్టిబాబు. ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ఈ అంశంపైనే హాట్‌ హాట్ చర్చ జరుగుతోందట.

మంత్రులు దుష్టశక్తులని ఎమ్మెల్యే కామెంట్స్‌!

ఆ మధ్య మామిడికుదురు మండలంలో నిర్వహించిన పాదయాత్రలో మహిళా వాలంటీర్‌పై  ఎమ్మెల్యే చిట్టిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం ఎమ్మెల్యేను టెన్షన్‌ను పెట్టిందట. ఇలా సామాన్యులనే కాదు.. చివరకు సొంతపార్టీ నాయకులను, ఎంపీలను, మంత్రులను కూడా వదిలి పెట్టడం లేదు చిట్టిబాబు. మంత్రులు తన పాలిట దుష్టశక్తులని ఆయన చేసిన కామెంట్స్‌ కలకలం రేపాయి. జిల్లా మంత్రి పినిపే విశ్వరూప్‌తో ఉన్న విభేదాల వల్లే చిట్టిబాబు అలా మాట్లాడి ఉంటారని అంతా అనుకున్నారు. మంత్రులపై ఈ రేంజ్‌లో విమర్శలు చేయడం వైసీపీలో చర్చకు దారితీసిందట. అయితే చిట్టిబాబు వాదన మరోలా ఉందట. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించకుండా మంత్రులు తనను ఏకాకిని చేస్తున్నట్టు ఆయన చెబుతున్నారు. 

అమలాపురం ఎంపీ సైతం చిట్టిబాబును దూరం పెట్టారా? 

అమలాపురం ఎంపీ చింతా అనురాధతో సఖ్యతగా ఉంటూ నిధులు తెచ్చుకోవాలని చిట్టిబాబు ప్రయత్నించారు. మొదట్లో ఎంపీ సహకరించినా.. తర్వాత ఆయన వ్యవహారశైలి నచ్చక.. కార్యకర్తలు ఇస్తోన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఆమె కూడా ఎమ్మెల్యేను పక్కన పెట్టేశారని చెబుతారు.  నేదునూరులో ప్రజలు సామాజిక అవసరాలకు వాడుకుంటోన్న స్థలంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే చిట్టిబాబు భూమి పూజ చేసి స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆ సందర్భంగా ముసలమ్మ గుడిని కూల్చివేయడంపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఎమ్మెల్యే నోటికి జడిసి కేడర్‌ వెళ్లిపోతోందా? 

ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కొండేటి చిట్టిబాబు వ్యవహారశైలి ఇలాగే ఉందట. దీంతో అన్నీ వివాదాలే. ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపుకోసం పనిచేసిన వారంతా.. ఆయన నోటికి జడిసి మంత్రి పినిపే వైపు  వెళ్లిపోతున్నారట. పైగా ఇటీవల ప్రకటంచిన బీసీ కార్పొరేషన్లలో ఎమ్మెల్యే అనుచరుల్లో ఒక్కరికీ చోటు దక్కలేదు. ఇదే కాదు.. జడ్పీటీసీ టికెట్‌ తన కుమారుడికి ఇస్తూ బీఫారం అందజేయడంతో అప్పట్లో పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. అప్పటికప్పుడు పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని బీఫారాలు మార్చారు. ఆ ఘటనతో కొన్నివర్గాలు చిట్టిబాబుకు దూరమైనట్టు చెబుతారు. అలాగే కుమారుడి పుట్టినరోజు వేడుకలను రోడ్డుపై పెట్టి ట్రాఫిక్‌ను ఆపేయడం దుమారమే రేపింది. ఇలాంటి ఘటనలపై పార్టీ అధిష్ఠానం చిట్టిబాబుకు చీవాట్లు పెట్టినా ప్రవర్తన మార్చుకోవడం లేదనే కామెంట్స్‌ వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో చిట్టి నోరు తెరిస్తే అంతే అన్న కామెంట్స్‌ పిగన్నవరంలో జోరందుకున్నాయి.