నవ్వుకే నవ్వు నేర్పిన ఘనుడు!

నవ్వుకే నవ్వు నేర్పిన ఘనుడు!

ఆనందం అధికమైనా, బాధ కలిగినా కన్నీళ్ళు వస్తాయి. మరి ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలియాలంటే ఆ కన్నీరు చిలికిన కళ్ళే చెప్పాలి. కన్నీళ్ళను చూసి అవి ఆనందభాష్పాలో, దుఃఖాశ్రువులో చెప్పడానికి అనుభవం కావాలి. మంటలు ఆర్పడానికి నీళ్ళు కావాలి. కానీ, పేదవాడి కన్నీటిలోనే మంటలుంటాయి. కళ్ళలో అలాంటి మంటలు మండిస్తూ, కడుపు మంటను చల్లార్చుకొనేందుకు ఓ ఐదేళ్ళ పసివాడు వచ్చీరాని పాటతో స్టేజీపై గళం విప్పాడు. నిజానికి రంగస్థలంపై అతని తల్లి పాట పాడాలి. పేదరికం అందించిన కానుకతో శక్తిలేక కుప్పకూలిన తల్లిని చూస్తూ, కడుపు నిండాలంటే పాట పాడాలి అన్న సత్యం తెలుసుకొని ఆ పసివాడు పాట పాడాడు. ఆ పాట అక్కడి ప్రేక్షకుల్లో ఎంతమందికి నచ్చిందో కానీ, ఐదేళ్ళ ప్రాయంలోనే సమయోచితంగా సాగిన ఆ పసివాడు జనానికి మాత్రం భలేగా నచ్చాడు. ఆ పసివాడే తరువాతి రోజుల్లో యావత్ ప్రపంచాన్నీ తన అభినయంతో ఆకట్టుకున్నాడు. నవ్వుల పువ్వులు పూయించి, హాస్యనట చక్రవర్తిగా జనం మదిలో ఈ నాటికీ నిలిచే ఉన్నాడు. అతనే చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. ఇలా అంటే ఎవరో అనుకోవచ్చు 'చాప్లిన్' అనగానే జనం ఇట్టే గుర్తు పట్టేస్తారు. 

వరల్డ్ నంబర్ వన్!

చార్లీ చాప్లిన్ గా జనం మదిని దోచిన ఆయన బహుముఖ ప్రజ్ఞ తెలిసి, ఈ నాటికీ ఆశ్చర్యపోయేవారెందరో! నవతరం బాలలను సైతం చాప్లిన్ చిత్రాలు నవ్విస్తాయి, కవ్విస్తాయి, కన్నీరూ పెట్టిస్తాయి. నటన, రచన, దర్శకత్వం, కూర్పు, స్వరకల్పన, చిత్రనిర్మాణం- ఇలా అన్నీ తానై చిత్రాలను రూపొందించిన చాప్లిన్ మూకీలతోనే మురిపించారు. ఇంగ్లండుకు చెందిన చాప్లిన్ బాల్యంలోనే పేదరికంతో అలమటించారు. అనుకోని పరిస్థితుల్లో రంగస్థలంపై పాటగాడిగా మారిన చాప్లిన్, తరువాతి రోజుల్లో కడుపు నింపుకోవడం కోసం స్టేజి షోస్ చేస్తూ సాగారు. కార్నో అనే నాటకసంస్థలో నటునిగా చేరిన చాప్లిన్ స్వదేశంలోనూ, అమెరికాలోనూ ప్రదర్శనలు ఇచ్చారు. చాప్లిన్ కు అమెరికాలోనూ అభిమానులు పోగయ్యారు. తరువాత సినిమాల్లో అవకాశాలు లభించాయి. చాప్లిన్ లఘు చిత్రాలు అందరినీ ఆకట్టుకోవడం మొదలెట్టాయి. దాంతో చాప్లిన్ ఆదాయమూ పెరిగింది. చాప్లిన్ తెరపై కనిపిస్తే చాలు అనుకున్నవారు ఆయన అడిగినంతా పారితోషికం ఇచ్చారు. మెల్లమెల్లగా చాప్లిన్ ప్రాభవం పెరిగింది. ఎంతలా అంటే ఆ రోజుల్లో ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకొనే నటునిగా చాప్లిన్ నిలిచారు. 1923 నాటికే చాప్లిన్ సొంత బ్యానర్, సొంత స్టూడియో పెట్టే స్థాయికి చేరుకున్నారు. 

చాప్లిన్ కానుక 'ట్రాంప్'!

నవరసాల్లో హాస్యం కత్తిమీద సాములాంటిది అంటారు. ఏ మాత్రం ఎక్కువైనా కష్టమే, తక్కువైనా నష్టమే! అయితే చాప్లిన్ మాత్రం హాస్యాభినయంలోని అన్ని రకాలను సునాయాసంగా పండించి జనాన్ని ఆకట్టుకున్నారు. మైమింగ్, ఫాంటో మైమ్, పేరడీ, శ్లాప్ స్టిక్ మొదలైన హాస్యాభినయంలో చాప్లిన్ మాస్టర్ అనిపించుకున్నారు. చాప్లిన్ తన అభినయంతో ఆకట్టుకోవడమే కాదు, ప్రపంచానికి 'ట్రాంప్' పాత్రను కానుకగా అందించారు. 'ట్రాంప్' అంటే దేశదిమ్మరి. దేశాలు పట్టుకు తిరిగేవారికి ఏమి తెలుస్తుంది అంటారు. అయితే అలాంటి వారికే ఇతరు కంటే మిన్నగా తెలుసునని చరిత్ర చెబుతోంది. అందువల్లేనేమో చాప్లిన్ 'ట్రాంప్'పాత్రను చక్కగా రూపొందించారు. ఆ పాత్రలో ఆయన అభినయించిన చిత్రాలన్నీ జనాన్ని విశేషంగా మురిపించాయి. చాప్లిన్ 'ట్రాంప్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా జేజేలు అందుకుంది. 'ట్రాంప్' సీరీస్ తో సాగిన చాప్లిన్ చిత్రాలు "ద కిడ్, ద గోల్డ్ రష్, ద సర్కస్, సిటీ లైట్స్, మోడరన్ టైమ్స్" చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. మూకీలతో మ్యాజిక్ చేసిన చాప్లిన్ తరువాత మాటలతోనూ ప్రేక్షకులను రంజింప చేశారు. ఆ నాటి డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్ పై చాప్లిన్ రూపొందించిన వ్యంగ్య చిత్రం 'ద గ్రేట్ డిక్టేటర్' ఈ నాటి ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. 

చాప్లిన్ మెచ్చిన నటుడు!

చాప్లిన్ ను ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానించారు. ఆరాధించారు. కానీ, చాప్లిన్ ను కూడా మెప్పించిన నటుడు ఎవరంటే హాలీవుడ్ నటుడు మార్లన్ బ్రాండో. చాప్లిన్ కు బ్రాండో నటనంటే ఎంతో ఇష్టం. అందుకే బ్రాండోను హీరోగా పెట్టి, 'ఎ కౌంటెస్ ఫ్రమ్ హాంగ్ కాంగ్' అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రంలో చాప్లిన్ మూడో కొడుకు సిడ్నీ చాప్లిన్ కూడా నటించాడు. ఇందులో అతిథి పాత్రలో చాప్లిన్ కనిపించారు. ఇదే చాప్లిన్ తొలి రంగుల చిత్రం, అలాగే ఆయన తెరపై కనిపించిన చివరి సినిమా! 'ఎ కౌంటెస్ ఫ్రమ్ హాంగ్ కాంగ్'లో నాటి మేటి తారలు నటించినా, బాక్సాఫీస్ వద్ద అది విజయం సాధించలేకపోయింది. తరువాత చాప్లిన్ మెల్లగా సినిమా రంగానికి గుడ్ బై చెప్పారు. 

బహుకుటుంబీకుడు!

బుద్ధి జీవి అయిన మనిషికి ఎప్పుడో ఒకప్పుడు 'దేవుడు ఉన్నాడా?' అన్న ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. కష్టం కలిగినప్పుడే మనుషులకు దేవుడు గుర్తుకు వస్తాడంటారు. సుఖాలు ఇచ్చిన దేవుణ్ణీ మరచిపోమంటారు కొందరు. చాప్లిన్ మాత్రం బాల్యంలోనే అనేక కష్టనష్టాలు చూడటం వల్ల అసలు 'దేవుడు ఉన్నాడా? లేడా?' ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి అన్న భావనకు వచ్చారు. అలాగే తన కష్టాన్ని మరచిపోవడానికి అన్నట్టు చాప్లిన్ ఎన్నో ప్రేమాయణాలు సాగించారు. నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అయితే చాప్లిన్ నాల్గవ భార్య ఊనా ఓనీల్ ఎంతో ఓర్పుతో, నేర్పుతో కాపురం చేశారు. తన జీవితంలోకి ఊనా ముందే ప్రవేశించి ఉంటే, తాను ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకోవలసిన అవసరం ఉండేది కాదని చాప్లిన్ అనేవారు. చాప్లిన్ కంటే దాదాపు 36 సంవత్సరాలు చిన్నది ఊనా. చాప్లిన్, ఊనా దంపతులకు  ఎనిమిది మంది సంతానం. చాప్లిన్ కు మొత్తం పదకొండు మంది పిల్లలు. 

రాజకీయాలు...

చిన్నతనంలోనే ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకున్న చాప్లిన్, జీవితం అంటే ఏమిటో అతి త్వరగా నేర్చుకున్నారని చెప్పాలి. ఆ కష్టాల నుంచే చాప్లిన్ లోని మానవతావాది నిదురలేచాడని భావించాలి. తన చుట్టూ ఉన్న వారికి చేతనైన సాయం అందించడానికి చాప్లిన్ ముందుండేవారు. ముఖ్యంగా కష్టాల్లోనూ, బాధల్లోనూ ఉన్నవారికి చాప్లిన్ సహాయ హస్తం చాచేవారు. ఇక అప్పటి రాజకీయ పరిస్థితులను సైతం చాప్లిన్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేసేవారు. చాప్లిన్ లండన్ లో రాణిస్తున్న రోజుల్లో, బస్టర్ కీటన్ అమెరికాలో తన హాస్యాభినయంతో అలరించేవారు. చాప్లిన్ వర్సెస్ కీటన్ అన్న రీతిలో సాగారు. చాప్లిన్ రూపొందించిన 'లైమ్ లైట్'లో బస్టర్ కీటన్ ను ఓ అతిథి పాత్రలో నటింప చేశారు. చాప్లిన్, కీటన్ అలా స్క్రీన్ షేర్ చేసుకోవడం అదే మొదటిసారి, చివరి సారి. చాప్లిన్ లో మెల్లగా కమ్యూనిస్టు భావాలు మొదలయ్యాయి. అమెరికా, బ్రిటన్ లలో ఏ రాజకీయ పరిణామాన్నయినా, ఆయన కమ్యూనిస్ట్ దృక్పథంతో యోచించేవారు. అలాంటి యోచనల వల్లే అమెరికా నుండి బహిష్కరణకు గురయ్యారు చాప్లిన్. 1952లో అమెరికా వదలి స్విట్జర్లాండ్ వెళ్ళిన చాప్లిన్ తరువాత కూడా తన మనసుకు నచ్చిన చిత్రాలనే రూపొందించారు. తనకు లభించిన గౌరవ ఆస్కార్ ను అందుకోవడానికి  ఇరవై ఏళ్ళ తరువాత అంటే 1972లో చాప్లిన్ మళ్ళీ అమెరికాలో కాలు పెట్టారు. 

ఆస్తికుడా? నాస్తికుడా?

కొన్నిసార్లు నాస్తికునిగా, మరికొన్ని సందర్భాల్లో ఆస్తికునిగా కనిపించేవారు చాప్లిన్. 'జీసస్ కంటే తనకే ఎక్కువ పాపులారిటీ ఉంది' అని చాటింపు వేసుకొనీ విమర్శలకు గురయ్యారు. చిత్రంగా చాప్లిన్ 1977లో క్రిస్మస్ రోజునే అంటే డిసెంబర్ 25న కన్నుమూశారు. అప్పటి నుంచీ పైకి నాస్తికునిగా కనిపించినా, లోపల చాప్లిన్ కు దేవుడంటే భయం ఉండేదనీ అనేవారు. చాప్లిన్ కడదాకా తన నవ్వులతో చుట్టూ ఉన్నవారిని ఆనందింప చేశారు. ఏ విషయాన్నయినా సీరియస్ గా తీసుకోకుండా, కాసింత ఆలోచిస్తే కోపాన్ని జయించవచ్చుననీ చెప్పేవారు. చాప్లిన్ మరణశయ్యపై ఉన్న సమయంలో ఓ ప్రీస్ట్ వచ్చి ప్రార్థన చేశారు. ప్రీస్ట్ తన ప్రార్థనలో "దేవుడు నీ ఆత్మపై దయ చూపు గాక..." అని ప్రార్థించారు. అందుకు చాప్లిన్, "ఎందుక్కాదు, నిజానికి ఆత్మ ఆయనదే కదా!" అంటూ నవ్వించారు చాప్లిన్. అవే చాప్లిన్ నోటి నుండి వెలువడిన చివరి మాటలు. ఈ చివరి మాటలలోనే చాప్లిన్ తనకు దేవుడంటే నమ్మకం ఉందని తేలిపోయింది అనేవారు ఆస్తికులు. నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. తన నవ్వులతో కన్నీళ్ళను జయించారు చాప్లిన్. ఎందరో కన్నీళ్ళనూ తుడిచారు. అందుకే చాప్లిన్ అంటే నవ్వుకే నవ్వు నేర్పిన ఘనుడు అంటారు.

(ఏప్రిల్ 16న విశ్వవిఖ్యాత నటుడు చార్లెస్ చాప్లిన్ జయంతి)