నాగార్జున సాగర్ ఉపఎన్నికకు జానారెడ్డి ఒప్పుకున్నారా...?

నాగార్జున సాగర్ ఉపఎన్నికకు జానారెడ్డి ఒప్పుకున్నారా...?

పెద్దాయన్ని అందరూ అలా ఫిక్స్ చేశారా? లేదంటే ఆయనే ఫిక్స్ అయ్యి పావులు కదిపారా..!? ముందు నుండి నో అన్న ఆయన... ఇప్పుడు రంగంలోకి దిగడం వెనకాల ఉన్న వ్యూహం ఏంటి..?  

కాంగ్రెస్‌లో జానారెడ్డి ఎపిసోడ్‌పై కొత్త చర్చ!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిని నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది AICC. ఇక్కడి ఉపఎన్నికనే కారణంగా చూపిస్తూ పీసీసీ కొత్త చీఫ్‌ నియామకాన్ని వాయిదా వేసింది కాంగ్రెస్‌ పార్టీ. దీంతో జానారెడ్డి జోక్యం కూడా తోడవడంతో బలం చేకూరింది.  అంత బాగానే ఉన్నా.. ఇప్పుడు పార్టీలో కొత్త చర్చ జరుగుతోందట. కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్యమని.. ఇక్కడ పైకి మాట్లాడేదానికి.. వెనక జరిగే వాటకి పొంతన ఉండదు. తాజా ఎపిసోడ్‌ను కూడా అలాగే చూడాలన్నది కొందరు నాయకుల మాట. 

మొదట్లో పోటీకి ఆసక్తి చూపని జానారెడ్డి!

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేయడానికి మొదటి నుండి జానారెడ్డి అంత ఆసక్తి కనబర్చలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్ని అధికార పార్టీ TRS ఎంత సవాల్‌గా తీసుకుందో ఆయనకు తెలుసు. TRS ఆర్థిక బలం ముందు నిలవగలమా? ఇప్పుడు పోటీ చేసి.. మళ్లీ ఏడాదిన్నర కాగానే తిరిగి సాధారణ ఎన్నికల్లో బరిలో నిలవాలంటే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయా? అని  వివిధ అంశాలపై టెన్షన్‌ పడేవారట ఈ సీనియర్‌ నేత. అందుకే మొదట్లో ఉపఎన్నికపై ఆసక్తి చూపించలేదని సమాచారం. 

ఇంఛార్జ్‌ ఠాగూర్‌ ఆయన్ని అలా ఫిక్స్‌ చేశారా? 

పీసీసీ కొత్త చీఫ్‌ ఎంపిక ప్రక్రియ జోరందుకున్న తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా జానారెడ్డి బరిలో ఉంటారని AICC రాష్ట్ర వ్యహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ స్పష్టం చేశారు. పోటీకి విముఖత చూపిన పెద్దాయన చివరకు ఎలా ఒప్పుకొన్నారు అన్నది ప్రశ్నగా ఉంది. ఈ సందర్భంగా ఓ అంశం పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్‌ ఎంపికను వాయిదా వేయాలని జానారెడ్డి కోరినప్పుడు.. నాగార్జునసాగర్‌లో మీరే అభ్యర్థి అయితే మేడమ్‌ సోనియాకు చెబుతానని ఠాగూర్‌ షరతు పెట్టారా?  లేక  పీసీసీ చీఫ్‌ పదవి ఆశిస్తున్న  నాయకుడు చక్రం తిప్పారా? అని కొందరు ఆరా తీస్తున్నారట. 

పీసీసీ చీఫ్‌ ఎంపిక ఆపాలని చూసి ఇరుక్కుపోయారా? 

జానారెడ్డి మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారా లేక పీసీసీ చీఫ్‌ నియామకాన్ని ఆపాలని చేసిన వ్యూహంలో ఫిక్స్‌ అయ్యారా అని మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. పీసీసీ చీఫ్‌ నియామకం ఆగడం కంటే.. జానారెడ్డి బరిలో ఉండటమే పార్టీకి బలమని అభిప్రాయపడుతున్నారట. కాకపోతే కాంగ్రెస్‌లో అంతే.. ఎప్పుడేం జరుగుతుందో.. ఎప్పుడెలాంటి నిర్ణయం వెలువడుతుందో ఊహించలేమనే నానుడి మరోసారి రుజువైందని చెబుతున్నారు.