సొంత ఇలాకాలో పరువు పోకుండా ఎమ్మెల్యే తంటాలు.!

సొంత ఇలాకాలో పరువు పోకుండా ఎమ్మెల్యే తంటాలు.!

కౌన్సిలర్లు ఇచ్చిన ఝలక్కి ఆ ఎమ్మెల్యేకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. అంతా మనదే నడుస్తుంది.. మన మాటే వేదం అనుకుంటున్న ఆయనకు ఊహించని షాక్ తగిలింది. సొంత ఇలాకాలోనే పరువు పోవడంతో సరిదిద్దుకునేందుకు నానతంటాలు పడుతున్నారట. ఎవరా ఎమ్మెల్యే? ఏమిటా కథ? 

చొప్పదండి ఎమ్మెల్యేకు షాక్‌ ఇచ్చిన కౌన్సిలర్లు!

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కి నియెజకవర్గంలో పొలిటికల్ షాక్ తగిలింది. విపక్ష పార్టీతో కలిసి సొంత పార్టీ సభ్యులే ఆయనకు ఊహకందని విధంగా సమాధానం ఇచ్చారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్యానెల్‌ నెగ్గలేదు. ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేసి.. తమ ప్యానెల్‌ను గెలిపించుకున్నారు కౌన్సిలర్లు. 

ఎమ్మెల్యే సైతం పొరపాటున తన ఓటు ఎదుటపక్షానికి వేశారు?

కౌన్సిల్‌లో మొత్తం 14 మంది సభ్యులుండగా.. ఒక్కరే ఓటింగ్‌కు హాజరు కాలేదు. ఎక్స్‌ అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే ఓటు వేసినప్పటికీ.. అది కాస్తా ప్రత్యర్థులు నిలబెట్టిన అభ్యర్థికి పొరపాటున ఓటేసేశారు. వాస్తవానికి కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక విషయంలో ఎమ్మెల్యేకు.. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు మధ్య అస్సలు పడటం లేదు. ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులు వద్దేవద్దని ముఖం మీదే చెప్పేశారు. కానీ.. ఆయన పట్టించుకోలేదట. దీంతో ఎమ్మెల్యేకు షాక్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో పోటీ ప్యానెల్‌ను బరిలో దించి పంతం నెగ్గించుకున్నారని అంటున్నారు. 

తిరుగుబాటు మున్సిపాలిటీకే పరిమితమా?

ఇలా కౌన్సిలర్లే సొంత ప్యానెల్‌ను బరిలో దించడం.. గెలిపించుకోవడం.. అధికార పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇలా గెలిచిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగానే పత్రాలు అందజేయడం కొసమెరుపు. అయితే.. ఈ తిరుగుబాటు మున్సిపాలిటీకే పరిమితం అవుతుందా.. లేక నియోజకవర్గం అంతా పాకి..  భవిష్యత్‌లోనూ కొనసాగుతుందా  అన్నది అర్థం కావడం లేదట. తాజా పరిణామాలతో పార్టీ నేతలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే నిర్ణయాలు తీసుకోకపోతే.. చొప్పదండి టీఆర్‌ఎస్‌లో ముసలం పుడుతుందనేది కొందరి వాదన. 

చొప్పదండి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎన్నిక పెండింగ్‌

చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్‌ ఎన్నిక చాలా రోజులు నుంచీ పెండింగ్‌లో ఉంది. టీఆర్‌ఎస్‌లో ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరిని ఎంపిక చేస్తే.. మిగతా వారి నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే  కారణంతో ఎన్నికను పక్కన పెడుతున్నారట ఎమ్మెల్యే. ఈ విషయంలో ఎమ్మెల్యే రవిశంకర్‌ భయపడుతున్నది ఒక్కటైతే.. ఆయన ఎవరి పేరునూ ఖరారు చేయకపోవడం పార్టీ శ్రేణులకు ఆగ్రహానికి కారణం అవుతుందట. ప్రస్తుతం ఎమ్మెల్యే వర్సెస్‌ అసమ్మతి వర్గం అన్నట్లుగా నియోజకవర్గ రాజకీయాలు మారిపోయాయి. ఇదే సమయం అనుకున్నాయో ఏమో కానీ విపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు సైతం అసమ్మతి వర్గానికి దన్నుగా నిలుస్తూ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి. 

వ్యతిరేకులను పెంచుకుంటూ పోతున్నారా? 

రవిశంకర్‌ ఫస్ట్‌ టైమ్‌ ఎమ్మెల్యే. రాజకీయాలు వంటబట్టలేదో.. లేక సొంతంగా వెళ్లాలని అనుకుంటున్నారో కానీ.. వ్యతిరేకులను మాత్రం పెంచుకుంటూ పోతున్నారని టీఆర్‌ఎస్‌లో ఓ వర్గం అభిప్రాయపడుతోంది. మరి... ఈ సమస్యను పార్టీ పెద్దలు పరిష్కరిస్తారో.. లేక చొప్పదండి రాజకీయం ఇంకా మలుపులు తిరుగుతుందో చూడాలి.