పీలేరు ఎమ్మెల్యే చింతలపై కేడర్‌ గుర్రు

పీలేరు ఎమ్మెల్యే చింతలపై కేడర్‌ గుర్రు

అక్కడ ఎమ్మెల్యే ఎదుటే పెతాపాలకు పోతారు పార్టీ నాయకులు. ఇదేంటని గట్టిగా నిలదీస్తే మీదో వర్గం.. మాదో వర్గం అని ముఖం మీదే చెప్పేస్తారు. చివరకు ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడటం లేదట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏమా నియోజకవర్గం? లెట్స్‌ వాచ్‌

రెండోసారి గెలిచినా ఎమ్మెల్యే చింతల ఎదురీత!

చింతల రామచంద్రరెడ్డి. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి వరసగా రెండోసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకప్పుడు నియోజకవర్గంలో కేడర్‌కు ఆయనంటే క్రేజ్‌. ఇప్పుడు అదే కేడర్‌ చేస్తోన్న పనులతో తలపట్టుకుంటున్నారట చింతల. అప్పట్లో  పీలేరులో ఎమ్మెల్యే ఏం చెబితే అదే జరిగేది. కేడర్‌ కూడా ఆయన మాట జవదాటేది కాదు. 2019 తర్వాత పరిస్థితులు మారిపోవడంతో నియోజకవర్గంలో ఎదురీదుతున్నట్టు పార్టీలో గుసగసలాడుకుంటున్నారట. 

బయట నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే గొడవలు?

పీలేరులో ప్రస్తుతం గ్రామస్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా కేడర్‌ రెండు మూడు గ్రూపులుగా విడిపోయి నిర్వహిస్తున్నాయి. ఇటీవల గుర్రంకొండలో నిర్వహించిన సంఘీభావ పాదయాత్ర సభలో ఎమ్మెల్యే ఎదుటే కార్యకర్తలు బలప్రదర్శనకు దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఆవేశాలకు పోయారు. చివరకు ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటే గానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని కాకుండా బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే క్షేత్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

ఎంపీ మిథున్‌రెడ్డి వర్గీయులు వర్సెస్‌ ఎమ్మెల్యే చింతల వర్గం!

పీలేరులో భూ ఆక్రమణలపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నా ఎమ్మెల్యే చింతల పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీలేరు మండలంలోనే వందల ఎకరాల డీకేటీ భూములను వెంచర్లుగా వేసి అమ్మేశారు. దీనిపై ఓ మైనారిటీ నాయకుడు సీఎం జగన్‌కు ఫిర్యాదు చేయడం వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ పని ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులు చేశారని ఎమ్మెల్యే వర్గం..  చింతల మనుషులే చేశారని ఎంపీ వర్గం ఆరోపించుకుంటున్నాయట. 

కొన్ని మండలాలకు వెళ్లేందుకు జంకుతున్న చింతల?

కలికిరి, కలకడ, పీలేరు, కేవీపల్లి మండలాల్లో వర్గపోరును ఎమ్మెల్యే చింతల తట్టుకోలేకపోతున్నారట. ఇక్కడి వర్గపోరువల్లే ఎమ్మెల్యే అన్ని మండలాలకు వెళ్లడానికి జంకుతున్నారట. పదే పదే రెండు మూడు మండలాల్లో పర్యటిస్తున్నట్టు సమాచారం. పైగా నియోజకవర్గంలోని బీసీలు, మైనారిటీలు అధికార పార్టీ నేతలపై గుర్రుగా ఉన్నారట. ఇదే విషయాన్ని స్థానిక నాయకులు  జిల్లా మంత్రి, ఎంపీల దృష్టికి తీసుకెళ్లారట. అయినా ఎలాంటి మార్పు రాలేదని చెబుతున్నారు. 

కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయా? 

చిత్తూరు జిల్లా పీలేరు అంటే నల్లారి కుటుంబానికి బాగా పట్టున్న ప్రాంతం. అలాంటి చోట వైసీపీ పాగా వేసినా.. కేడర్‌ గ్రూపులుగా విడిపోవడం.. ఎమ్మెల్యే చెప్పినా ఎవరూ వినకపోవడం పార్టీ పెద్దలను కలవర పెడుతోందట. కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయని చెబుతున్నారు. మరి.. పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ గ్రూపులకు, భూ ఆక్రమణలకు ఎలాంటి పరిష్కారం కనుగొంటారో చూడాలి.