బస్వరాజు సారయ్య కి ఎమ్మెల్సీ ఇవ్వడానికి కారణమేంటి...?

బస్వరాజు సారయ్య కి ఎమ్మెల్సీ ఇవ్వడానికి కారణమేంటి...?

రాజకీయాల్లో అదృష్టం ఎప్పుడెలా తలుపు తడుతుందో ఊహించలేం. ఈ కోవలోకే వచ్చారు ఆ మాజీ మంత్రి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై జనాలకు ఉన్న కోపం ఆయనకు కలిసి వచ్చిందట. అధిష్ఠానం పిలిచి పదవి ఇవ్వడంతో అధికారపార్టీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా నాయకుడు? 

సారయ్యకు పదవి ఇవ్వడం వెనక ఈక్వేషన్స్‌ ఏంటి? 

బస్వరాజు సారయ్య. మాజీ మంత్రి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ కావడంతో అధికారపార్టీలో సారయ్యపై  ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన అనేక మంది టీఆర్‌ఎస్‌ నాయకులకు గతంలోనూ అనేక పదవులు వరించాయి. కీలక ఎన్నికల సమయంలో తలుపుతట్టి పదవులు పొందిన నాయకులు అనేక మంది ఉన్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రి సారయ్య చేరడంతో పార్టీ ఎంచుకున్న ఈక్వేషన్స్‌ ఏంటా అన్న ఆసక్తి పెరుగుతోంది. 

బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నమా? 

గతంలో ముదిరాజ్‌ వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, బీసీ వర్గానికి చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎస్సీ వర్గానికి చెందిన కడియం శ్రీహరి, ఎస్టీల నుంచి సత్యవతి రాథోడ్‌లను ఎమ్మెల్సీలను చేశారు సీఎం కేసీఆర్‌. ఇప్పుడు సారయ్యకు ఛాన్స్‌ ఇవ్వడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారని అనుకుంటున్నారు. రజక సామాజికవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా.. మంత్రిగా సారయ్యకు గుర్తింపు ఉంది. 2016లో కాంగ్రెస్‌ను వీడిన ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి  నుంచి తన వంతు వచ్చే వరకు వేచి చూశారనే టాక్‌ నడుస్తోంది. 

వరంగల్‌ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలపై  జనాలు ఆగ్రహం?

GHMC తర్వాత గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ మధ్య వచ్చిన వరదలకు ఇబ్బంది పడ్డ వరంగల్‌ జనం.. తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలపై కోపంగా ఉన్నట్టు టీఆర్‌ఎస్‌ పెద్దలు గుర్తించారట. అందుకే ఈ ప్రాంతంలో పట్టు ఉన్న మాజీ మంత్రి సారయ్యకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాదు గ్రేటర్‌  వరంగల్‌లో రాజకీయ పరిణామాలు మారతాయని భావిస్తున్నారట. ఒక్క గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికలే కాకుండా.. ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ఈ ప్రభావం సానుకూలంగా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు. 

వివాదాలకు దూరంగా ఉండటం కలిసి వస్తుందా?

వరంగల్‌లో భూదందాలు, సెటిల్‌మెంట్లు, పైరవీల విషయంలో అధికారపార్టీ నేతలపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వాటికి బస్వరాజు సారయ్య దూరంగా ఉంటారు. అది కూడా పార్టీకి ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారట. కొండా దంపతులను ఎదుర్కోవడంతోపాటు బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్న వరంగల్‌లో సారయ్య అస్త్రం పార్టీ బలోపేతానికి ఉపయోగ పడుతుందని అంచనా వేస్తున్నారు. మరి.. టీఆర్‌ఎస్‌ వేసిన ఈ పాచిక ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.