కోర్టు పైనే కోటి ఆశలు పెట్టుకున్న రాజుగారు...

కోర్టు పైనే కోటి ఆశలు పెట్టుకున్న రాజుగారు...

అధికారంలో ఉన్నాన్నాళ్లూ ఆ రాజుగారు రాజ ఠీవీతో వెలిగిపోయారు. ఎన్నికల్లో పార్టీతోపాటు ఆయన కూడా ఓడిపోవడంతో అన్నీ ఎదురు దెబ్బలే. వారసత్వ హక్కులు పోయాయి.  ఇప్పుడు కోర్టుపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయంలో ఏకాకి అయ్యామన్న బాధో ఏమో కానీ బంగ్లా గేటు కూడా తీయడం లేదట పూసపాటి వారు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

రాజకీయ, వారసత్వ సమస్యలతో ఉక్కిరి బిక్కిరి!

ఏడుసార్లు ఎమ్మెల్యే. ఓసారి ఎంపీ. రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం. వీటికితోడు గజపతిరాజుల వారసత్వం. ఇంతటి పేరు ఉన్నా.. నేడు ఏకాకిగా మారిపోయారు పూసపాటి అశోక్‌గజపతిరాజు. ఒకప్పుడు విజయనగరం జిల్లాలో ఆయన తిరుగులేని నేత. మొన్నటి వరకూ ఆయన ఏం చెబితే అదే జిల్లాలో శిలా శాసనంగా ఉండేది. అలాంటిది ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరం కావడంతో ప్రత్యర్థిపార్టీ  అశోక్‌గజపతిరాజును అష్టదిగ్భందం చేసింది. ఇటు రాజకీయంగా అటు వారసత్వ ఇబ్బందులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఈ విజయనగర రాజావారు. 

ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ ఎదురు కాలేదా?

వారసత్వ హక్కులపై పోరాడటానికి శక్తి చాలడం లేదన్న భావనలో ఉన్నారట అశోక్‌గజపతిరాజు. ఈ సమస్యలే ఊపిరి సలపనివ్వకుండా ఉండటంతో.. జిల్లాలో టీడీపీ బలోపేతానికి దృష్టి పెట్టే సావకాశమే చిక్కడం లేదట. ఏమనుకున్నారో ఏమో కానీ.. పార్టీ కార్యక్రమాలకు, టీడీపీ నేతలను కలిసి మాట్లాడే విషయంలో ఆమడదూరంలో ఉంటున్నారట.  దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటోన్న ఆయనకు ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఎదురుకాలేదని కామెంట్స్‌ చేస్తున్నారు పార్టీ శ్రేణులు. గతంలో అధికారంలో ఉన్నా లేకపోయినా రాజవంశీకుడిగా ఆయన గౌరవం ఎప్పుడూ అలాగే ఉండేది. 

సంచయిత ఎంట్రీతో షాక్‌ల మీద షాక్‌లు!

రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరమైన  తర్వాత రాజకీయ సమీకరణాల, వ్యూహాలు మారిపోయాయి. పొలిటికల్‌గా, కుటుంబం పరంగా అశోక్‌గజపతిరాజుకు అన్నీ ఎదురుదెబ్బలే అన్నది పార్టీ నాయకుల మాట. మాన్సాస్‌ ట్రస్ట్‌ చేజారిపోయింది. అన్న కుమార్తె సంచయిత గజపతి ఎంట్రీతో రాజుగారికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.  దీంతో ఆయన బంగ్లాకే పరిమితమైపోయారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. నిత్యం టీడీపీ కార్యకర్తలతో కళకళలాడే బంగళా బోసి పోయి కనిపిస్తోంది. తన బంగళాకు సైతం ఎవరూ రావొద్దని గేట్లు కూడా మూసేశారట. 

ఆశలన్నీ కోర్టు మీదే పెట్టుకున్నారా? 

మాన్సాస్‌ ట్రస్ట్‌, సింహాచలం దేవస్థానం నిర్ణయాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నా.. వాటిపై మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదట అశోక్‌గజపతి రాజు. మౌనంగా బంగళాలోనే ఉండిపోతున్నారట. అయితే అశోక్‌ గజపతిరాజు మౌనం వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయని టాక్‌ నడుస్తోంది. మాన్సాస్‌, సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ చైర్మన్‌ గిరిలపై ఇప్పటికే హైకోర్టు మెట్లెక్కిన ఆయన .. తన ఆశలన్నీ న్యాయస్థానం మీదే పెట్టుకున్నారట.  మన్సాస్‌ బైలాస్‌ ప్రకారం తానే చైర్మన్‌గా ఉండాలని.. అందుకే హైకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందనే కోటి ఆశలతో ఉన్నారట. మరి రాజుగారి ఆశలు నెరవేరుతాయో.. ఇదివరకటిలా టీడీపీని ముందుండి నడిపిస్తారో లేదో చూడాలి.